కేపిటల్ హిల్‌కు కూతవేటు దూరంలో: 15 రౌండ్ల కాల్పులు: ఉలిక్కిపడ్డ వాషింగ్టన్
వాషింగ్టన్: అమెరికాలో గన్ కల్చర్ మళ్లీ చెలరేగింది. ఇష్టారాజ్యంగా మారిన గన్ కల్చర్‌ను నివారించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ..బ్రేకులు పడట్లేదు. వరుస ఘటనలు చోటు చేసుకుంటూనే వస్తోన్నాయి. ఇదివరకు టెక్సాస్, ఓక్లహామా, తుల్సా ఆసుపత్రి, చికాగో..ఇలా పలు చోట్ల విచ్చలవిడిగా కాల్పులు సంభవించాయి. టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పుల తరువాత.. తరచూ అలాంటి ఘటనలు సంభవిస్తోన్నాయి. పదుల సంఖ్య ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు.
ఇప్పుడు తాజాగా వాషింగ్టన్ డీసీలో కాల్పుల ఉదంతం సంభవించింది. వాషింగ్టన్ డీసీ ఈశాన్యప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు స్థానికులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అమెరికా అధికార యంత్రాంగానికి కేంద్రబిందువు కేపిటల్ హిల్ సమీపంలో ఎఫ్ స్ట్రీట్ 1500 బ్లాక్‌లో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:37 నిమిషాలకు కాల్పులు చోటు చేసుకున్నాయి.

15 రౌండ్ల పాటు కాల్పులు జరిగాయని వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి సీన్ హిక్‌మన్ తెలిపారు. కాల్పులు చోటు చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు సాగిస్తోన్నామని చెప్పారు. ఈ కాల్పుల ఉదంతంలో ఇప్పటివరకు ఒకరు మరణించినట్లు చెప్పారు. పలువురు గాయపడినట్లు చెప్పారు. సంఘటనాస్థలంలో అంబులెన్స్‌లు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో గాయపడ్డ వారి సంఖ్య భారీగా ఉండొచ్చని అనుమానిస్తోన్నారు.
కిందటి నెల 18న ఇండియానాలో చోటు చేసుకున్న కాల్పుల్లో 10 మంది మరణించారు. అదేనెల 11న కాలిఫోర్నియాలో సంభవించిన కాల్పుల్లో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జులై 4న చికాగోలో జరిగిన కాల్పుల్లో ఆరుమంది మృత్యువాత పడ్డారు. చికాగోలో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. సౌత్ అల్బనీ, సౌత్ ఇండియానా, సౌత్ జస్టిస్, సౌత్ డమెన్.. ప్రాంతాల్లోనూ కాల్పులు సంభవించినట్లు చికాగో పోలీస్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications