• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్: ఆక్సిజన్ మరణాలు దేనికి సూచిక... అధికారుల నిర్లక్ష్యమే రోగుల ప్రాణాలు తీస్తోందా?

By BBC News తెలుగు
|

ఆక్సిజన్ కొరత

ఆక్సిజన్...ఆక్సిజన్...ఆక్సిజన్...దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. నింగి, నేల, నీరు...ఇలా అన్నీ మార్గాల్లో ఆక్సిజన్ తరలింపు నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయినా ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు ప్రాణ వాయువు సకాలంలో అందడం లేదు. ఫలితంగా పదుల సంఖ్యలో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఏపీలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు విశాఖ, విజయనగరం, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో చోటు చేసుకున్నాయి.

కొన్ని చోట్ల ఆక్సిజన్ లేక, మరికొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉన్నా...సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా కూడా మరణాలు సంభవిస్తున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగింది ఇదే.

అయితే, ఇటువంటి సంఘటనల్లో ప్రభుత్వం మృతుల సంఖ్యను తగ్గించి చెప్పడం, ఆక్సిజన్ సరఫరా లోపాల్ని దాచిపెట్టి అక్కడ మరణించిన వారిని సాధారణ కోవిడ్ మరణాలుగా చూపించే ప్రయత్నం చేస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఆక్సిజన్ కొరత

ఆక్సిజన్ కొరత ఉందా...కారణాలేంటి ?

సెకండ్ వేవ్‌లో కేసుల ఉధృతి ఎక్కువైంది. గత ఏడాది కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా 3వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవగా... ఇప్పుడు అది రెట్టింపయింది. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 7 వేల 200 మెట్రిక్ టన్నులు. ఇటీవల కాలంలో దీనికి కొంత మేర పెంచారు. అయినా ఆక్సిజన్ కొరత ఎదురవుతూనే ఉంది.

''ఏప్రిల్ మొదటి వారం నుంచి కోవిడ్ సెకండ్‌ వేవ్ ప్రభావం ఎక్కువైంది. దీని ప్రారంభంలో మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా కనిపించాయి. ఆ తరువాత దిల్లీ, యూపీ,ఏపీ, తమిళనాడులలో ఎక్కువయ్యాయి.

ఒక్కో సమయంలో ఒక్కొ చోట కేసులు పెరుగుతుండటంతో...ఏ ప్రాంతానికి ఆక్సిజన్ అవసరమైతే అక్కడికి సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇది కూడా కొన్ని చోట్ల ఆక్సిజన్ కొరత తీవ్రమవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు.

''స్టీల్‌ప్లాంట్‌లో ఏడాదికి లక్ష టన్నుల పైగా ఇండస్ట్రీయల్ ఆక్సిజన్ తయారవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా వీలైనంత లిక్విడ్ ఆక్సిజన్‌ తయారు చేస్తున్నాం. తయారీ సులభమే...కానీ తరలించడమే కష్టం. మెడికల్ ఆక్సిజన్‌ను తరలించాలంటే క్రయోజనిక్ ట్యాంకర్లు, సిలిండర్లు అవసరం. ప్రస్తుతం వీటి కొరత కూడా ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బందులకు కారణమవుతోంది'' అని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆక్సిజన్ ప్లాంట్ మేనేజర్ ఎన్. రామచంద్రరావు బీబీసీతో అన్నారు.

ఆక్సిజన్ కొరత

రెట్టింపు ఆక్సిజన్ కావాలి: సీఎం

ఫస్ట్‌వేవ్‌తో పోల్చుకుంటే ఈసారి ఆక్సిజన్ అవసరం 15 శాతానికి పెరిగిందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి ఆక్సిజన్ సరఫరా అవుతున్నా అది సరిపోవడం లేదు.

అందుకే ఏపీ ప్రభుత్వం సొంత ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్దమైంది. దీనికోసం ప్రభుత్వం రూ. 309.87 కోట్లు కేటాయించింది. అలాగే 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను కొనుగోలు చేయనుంది.

''కేంద్రం నిర్ణయించిన ప్రకారం ఏపీకి 590 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ వస్తోంది. ప్రస్తుతం (11.05.21 నాటికి) ఆక్సిజన్ అవసరం, వినియోగం రెండూ సరిగ్గా సరిపోతున్నాయి. మిగులు ఉండటం లేదు. కానీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతుంది." అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.

మరోవైపు రాష్ట్రానికి ఇస్తున్న ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఏపీ సీఎం కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రస్తుతం సరఫరా అవుతున్న 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఏ మాత్రం చాలడం లేదని, కనీసం 910 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కోరారు. అత్యవసరంగా 20 ఆక్సిజన్‌ ట్యాంకర్లను రాష్ట్రానికి మంజూరు చేయాలని సీఎం ఆ లేఖలో కోరారు.

ఆక్సిజన్ కొరత

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి కేంద్రాలు రెండే

ఆక్సిజన్ వేరు, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ వేరు. పరిశ్రమలు తమ అవసరాల కోసం ఇండస్ట్రియల్ ఆక్సిజన్‌ను తయారు చేసుకుంటాయి. దానిని అవసరమైతే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌గా మార్చుకోవచ్చు. అయితే దీనికి ఎయిర్ సెపరేషన్ ప్లాంట్స్ అవసరం.

పూర్తిగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మాత్రమే తయారు చేసే కంపెనీలు ఏపీలో కేవలం రెండే ఉన్నాయి. అవి ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని లిక్వినాక్స్ గ్యాసెస్ (Liquinox Gases), రెండోది విశాఖ పరవాడ పారిశ్రామిక ప్రాంతంలో ఎలెన్ బారీస్ (Ellen Berries). విశాఖ స్టీల్ ప్లాంట్ వీటికి అదనం.

''విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లోని ఉత్పత్తి కేంద్రంతో కలిపి రాష్ట్రంలోని మూడు కేంద్రాలు రోజుకు 190 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ తయారు చేస్తాయి. అలాగే కొన్ని కంపెనీలు కూడా కొద్ది మొత్తంలో మెడికల్ ఆక్సిజన్ ను తయారు చేస్తున్నాయి.

ఆక్సిజన్ కొరత

ఇవన్ని కలిపినా 200 మెట్రిక్ టన్నులు దాటటం కష్టం. కానీ, రాష్ట్రంలో రోజుకు 600 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ అవసరం అవుతోంది. అందుకే ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ క్రమంలో రవాణాకు ఎటువంటి అడ్డంకి రాకుండా...గ్రీన్ ఛానెల్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం." అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు.

ఆక్సిజన్ కొరత

గ్రీన్ కారిడారైనా... రవాణాలో సమస్యలే

ఫస్ట్‌వేవ్‌లో రాష్ట్రంలో రోజుకి 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అసవరమయ్యేది. సెకండ్ వేవ్ ప్రారంభంలోనే అది 380 మెట్రిక్ టన్నులకి చేరుకుంది. క్రమంగా 440, తర్వాత పది రోజులకి 510, ఇప్పుడు 590 మెట్రిక్‌ టన్నులు అవసరమవుతోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

''రవాణా పెద్ద సమస్యగా మారుతోంది. అవసరంలో ఉన్నాం కదా అని ఆక్సిజన్ తీసుకొచ్చే ఏ వాహనం వేగంగా వెళ్ల కూడదు. అది రైల్వే శాఖ నిర్వహిస్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ అయినా, ట్యాంకర్లయినా తక్కువ వేగంతో ప్రయాణం చేయాలి.

గూడ్సు రైళ్లు గంటకు 45కి.మీ. సగటు వేగంతో ప్రయాణిస్తుండగా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ సగటు వేగం 43 కి.మీ. లారీ ట్యాంకర్లను రైలుపైకి ఎక్కిస్తున్నాం. అందుకే లారీలు కదలకుండా తక్కువ వేగంతో నడపాలి." అని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

''లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ రవాణా చాలా కష్టం. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్ కూడా ఈ ట్యాంకర్లను నడపడానికి జంకుతారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లు గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించ కూడదు. అలా చేస్తే జీపీఎస్ ద్వారా గమనించి మాకు ఫోన్ చేస్తారు.

లిక్విడ్ ఆక్సిజన్‌ కావడంతో… చిన్న ప్రమాదం జరిగినా తీవ్రమైన నష్టం ఉంటుంది. ప్రస్తుతం ఎల్‌ఎంవోను రవాణా చేసే ట్యాంకర్లు, దానిని నడిపే డ్రైవర్లు కూడా తక్కువే ఉన్నారు" అని గాజువాక లారీ డ్రైవర్ల సంఘం ప్రతినిధి సురేశ్ చెప్పారు.

''సింగపూర్ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్ నౌక ద్వారా 8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3898 ఆక్సిజన్ సిలిండర్లు విశాఖ చేరుకున్నాయి. కరోనా సహాయ కార్యక్రమాల్లో భాగంగా తూర్పు నావికాదళం సముద్రసేతు-2 కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇందులో భాగంగా 9 నౌకలు వివిధ దేశాలకు తరలి వెళ్లాయి. వివిధ దేశాల నుంచి సేకరించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లను భారత్‌కు తరలిస్తున్నారు." అని తూర్పు నౌకాదళం పీఆర్వో కెప్టెన్ సీజీ రాజు చెప్పారు.

ఆక్సిజన్ కొరత

సిలిండర్ వాషర్‌తో కూడా ప్రమాదమే...

గత నెల రోజులుగా కొన్ని జిల్లాలతో పాటు తిరుపతి రుయా ఆసుపత్రి ఆక్సిజన్ సరఫరా లోపాల ఘటనలలో పదుల సంఖ్యలో కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఈ సంఘటనతో రాష్ట్రంలోని అన్నీ ఆసుపత్రులు అప్రమత్తమయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్లు,అవి సరఫరా అయ్యే పైపులు,ట్యూబుల పనితీరు, నాణ్యత పరిశీలనపై దృష్టి పెట్టాయి.

''మెడికల్ ఆక్సిజన్‌ను మూడు రకాలుగా పొందవచ్చు. అవి కంప్రెస్డ్ గ్యాస్ సిస్టం,ఆక్సిజన్ కాన్సంట్రేటర్,లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్స్. ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ వినియోగిస్తాం. విశాఖలో అతి పెద్ద కోవిడ్ ఆసుపత్రి విమ్స్‌లో ప్రస్తుతం ఆక్సిజన్ సమస్య లేదు. అయితే ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి సమస్యల తలెత్తకుండా టెక్నికల్ ఎక్స్‌ఫర్ట్‌తో పరిశీలన చేయిస్తున్నాం.

ఆక్సిజన్ సిలిండర్లలో వాషర్ సరిగా అమర్చకపోయినా...సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తి ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. సరఫరా అవుతున్న పీడన స్థాయి, సిస్టంలోని ట్యూబ్‌ల పనితీరు, లీకులేమైనా ఉన్నాయా అనే విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. లోపలుంటే వెంటనే సరిదిద్దాలి." అని విశాఖలోని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు వివరించారు.

ఆక్సిజన్ కొరత

ఇవి ప్రభుత్వ హత్యలు: విపక్షాలు

ఏపీలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక చనిపోయిన కేసులను ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని విపక్షాలు అంటున్నాయి. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే...అక్రమ కేసులు పెట్టి నోటీసులు ఇస్తున్నారు తప్ప,ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆక్షిజన్ ఇవ్వలేకపోతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు అన్నారు.

''ఏపీలో కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. ఆక్సిజన్ సరఫరా రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం అత్యంత విచారకరం.

ఏపీలో ఆక్సిజన్ అందక గత 10రోజుల్లో 35మందికి పైగా కరోనా రోగులు మరణించారు. సెకండ్ వేవ్ ప్రభావాన్ని నిపుణులు హెచ్చరించినా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది." అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: Oxygen deaths are an indicator of what,Is the negligence of the authorities killing patients
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X