నేపాల్ భూకంపం: ప్రభుత్వంపై మండిపడుతున్న బాధితులు
ఖాట్మండు: సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం వేగంగా కదలకపోవడంపై నేపాల్ భూకంప బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతులకు వారే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు భూకంపం తాకిడికి 4,352 మంది మృతదేహాలను వెలికి తీశారు. 8,063 మంది గాయపడ్డారు.
భూకంప బాధితుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 18 ట్రక్కుల్లో సరుకులను, వస్తువులను పంపించింది. వాటిలో పది ట్రక్కుల్లో ఆహార పదార్థాలు పంపించారు. మరో ఏడు ట్రక్కుల్లో మినరల్ వాటర్, మందులు పంపించారు. ఖాట్మండుకు వైద్యుల బృందం ఒక్కటి చేరుకుంది.

నేపాల్ నుంచి తమ పౌరులను రప్పించేందుకు భారత్ అన్ని విధాలా చర్యలు తీసుకుంది. నేపాల్‌లోని పది జిల్లాలు, రాజధాని ఖాట్మండు భూకంప తీవ్రతకు భారీగా దెబ్బ తిన్నాయి. సింధుపాల్ చౌక్ కూడా తీవ్రంగా దెబ్బ తింది. ఈ ప్రాంతాల్లో రెండు వేలకు పైగా మరణించినట్లు చెబుతున్నారు.
ప్రభుత్వ అసమర్థత పట్ల పౌరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పునరావాస, సహాయక చర్యలు వేగంగా జరగడం లేదని నేపాల్ ప్రధాని సుశీల్ కుమార్ కొయిరాలా కూడా అంగీకరించారు. ఈ జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రాజకీయ పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎనిమిది మిలియన్ల మంది జీవితాలు దెబ్బ తిన్నాయని ఐక్య రాజ్య సమితి చెప్పింది.












Click it and Unblock the Notifications