• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా, అమెరికాలు బద్ధ శత్రువులుగా మారుతున్నాయా, మూడోసారి అధ్యక్షుడైన షీ జిన్‌పింగ్ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
షీ జిన్‌పింగ్

షీ జిన్‌పింగ్ ఇప్పుడు అత్యంత శక్తిమంతమైన చైనా నాయకుడిగా అవతరించారు. ఆయన కన్నా ముందు అధ్యక్షులుగా ఉన్న వారిని రెండు పర్యాయాలకే పరిమితం చేసిన సంప్రదాయాన్ని పక్కనపెట్టి జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీంతో చైనా మీద తన అధికారాన్ని ఆయన మరింత బలోపేతం చేసుకున్నారు. బహుశా ఈ అధికారం నిరవధికంగా కొనసాగవచ్చు.

ఒకవైపు చైనాపై జిన్‌పింగ్ పట్టు బిగిస్తోంటే, మరోవైపు అంతర్జాతీయ వేదిక మీద పరిస్థితి మరింత బలహీనంగా కనిపిస్తోంది.

చైనా సంపన్నమైతే మరింత స్వేచ్ఛాయుతంగా ఉంటుందన్న ప్రపంచీకరణ శకపు భావనను.. కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన జిన్‌పింగ్, చైనా అధికారవాద నమూనాను మరింతగా బలోపేతం చేస్తూ సవాలు చేస్తున్నారు.

అమెరికా, చైనాల మధ్య దశాబ్దాల పాటు వాణిజ్యం, సంప్రదింపులను ఆ భావనే నడిపించింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి ఆ భావనే పునాదిగా ఉన్నది. తద్వారా ప్రతి ఏటా 50 వేల కోట్ల డాలర్ల విలువైన సరకులు పసిఫిక్ మహాసముద్రం దాటి వస్తున్నాయి.

మూడో విడత అధ్యక్షుడైన జిన్‌పింగ్ ఇప్పుడు అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. అత్యాధునిక చిప్ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు అందించేందుకు అమెరికా తిరస్కరిస్తోంది. చైనా ఎదుగుదలను ఎలాగైనా నెమ్మదింపజేయాలన్న ఉద్దేశమే ఇందుకు కారణమని కొందరు పరిశీలకులు చెప్తున్నారు.

చైనా, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవల ప్రస్ఫుటంగా వ్యక్తమవుతున్న విభేదాలకు కారణం.. ప్రప్రధమ ప్రపంచ శక్తిగా తన స్థానాన్ని పదిలం చేసుకోవాలన్న అమెరికా కాంక్షనే అని చైనా వాదిస్తోంది.

ప్రస్తుత ప్రపంచ క్రమానికి రష్యా కన్నా చైనానే అతి పెద్ద ముప్పు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త జాతీయ భద్రతా వ్యూహం చెబుతోంది. ప్రజాస్వామ్య తైవాన్‌ మీద చైనా దండయాత్ర చేసే అవకాశం నిజమవుతుందని అమెరికా మాట్లాడటం మొదలుపెట్టింది.

ఇవన్నీ చూస్తే.. పరస్పరం సుసంపన్నం చేసుకోవటం ద్వారా చివరికి సైద్ధాంతిక విభేదాలు, ఉద్రిక్తతలు తొలగిపోతాయని అమెరికా, చైనాల నేతలు ప్రకటించినప్పటి రోజుల నుంచి చాలా దూరం వెళ్లారని స్పష్టమవుతుంది.

మరి ఈ పరిస్థితి ఎలా వచ్చింది?

చైనా

'స్వేచ్ఛ అలవాట్లు'

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాను ప్రత్యర్థిగా పరిగణించడం పెరుగుతోంది. ఇది పెద్ద వింత. ఆ దేశానికి అధునాతన సెమీకండక్టర్లు అందుబాటులోకి రాకుండా అడ్డుకోవటానికి ఆయన ప్రయత్నించటం వాణిజ్య విధానం, వైఖరిలో గణనీయమైన మార్పును సూచిస్తోంది.

1990ల చివరిలో అప్పుడు అమెరికా సెనేట్ సభ్యుడుగా ఉన్న జో బైడెన్, చైనాను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లోకి ఆహ్వానించిన ప్రయత్నాలకు కీలక రూపకర్తగా ఉన్నారు.

''చైనా మా శత్రువు కాదు'' అని బైడెన్ 2000 సంవత్సరంలో షాంఘై పర్యటనలో మీడియాతో అన్నారు. చైనాతో వాణిజ్యం పెరిగినట్లయితే ఆ దేశం ఉమ్మడి విధానాలు సార్వత్రిక విలువల వ్యవస్థలోకి వచ్చి, దానికి కట్టుబడుతుందని, బాధ్యతాయుతమైన శక్తిగా ఎదగటానికి దోహదపడుతుందనే విశ్వాసం ప్రాతిపదికగా ఆ ప్రకటన చేశారు.

జార్జ్ డబ్ల్యు బుష్ అధ్యక్షుడిగా ఉన్నపుడు డబ్ల్యూటీఓలో చైనాకు సభ్యత్వం సాకారమైంది. రిచర్డ్ నిక్సన్ మొదలుకుని ప్రతి అధ్యక్షుడూ మద్దతిచ్చిన దశాబ్దాల సంప్రదింపుల విధానానికి అది పరాకాష్టగా నిలిచింది.

చైనా తన తలుపులు మరింతగా తెరవాలని కార్పొరేట్ అమెరికా కూడా బలంగా లాబీయింగ్ చేస్తూ వచ్చింది. బ్రిటిష్ అమెరికన్ టొబాకో వంటి సంస్థలు చైనా వినియోగదారులకు తమ ఉత్పత్తులు అమ్మాలని చాలా ఆసక్తిగా ఉండేవి. అమెరికా - చైనా వాణిజ్య మండలి చౌకయిన కార్మిక శక్తి అందుబాటులోకి రావాలని ఆసక్తిగా ఉండేది.

''ఆర్థిక స్వాతంత్ర్యం స్వేచ్ఛా అలవాట్లను సృష్టిస్తుంది. స్వేచ్ఛా అలవాట్లు ప్రజాస్వామ్య అంచనాలను సృష్టిస్తాయి'' అని నాడు టెక్సస్ గవర్నర్‌గా ఉన్న బుష్ 2000 మే నెలలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.

చైనా సంపద పెరుగుతుండటంతో, కొంత కాలం పాటు ఎంతో కొంత పరిమితమైన రాజకీయ సంస్కరణలు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపించింది కూడా. డబ్ల్యూటీఓ సభ్యత్వం అనంతరం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో లాగానే చైనాలోనూ ప్రజలు అంతకుముందు కలలో కూడా ఊహంచని రీతిలో చర్చకు, అసమ్మతి తెలుపటానికి ఇంటర్నెట్ అవకాశం అందించింది.

షీ జిన్‌పింగ్ 2012లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తొలి విడత పదవిని ప్రారంభించిన తర్వాత కూడా.. చైనా ప్రాధమిక రీతిలో మంచి మార్పులకు లోనవుతోందనటానికి చైనాలో ఆకాశహర్మ్యాలను, సాంస్కృతిక ఆదానప్రదానాలను, నూతన మధ్య తరగతి సాక్ష్యాలని అంతర్జాతీయ మీడియా చూపింది.

కానీ, జిన్‌పింగ్ తన పాలన తొలి రోజుల్లోనే, అప్పుడప్పుడే మొదలైన 'స్వేచ్ఛా అలవాట్ల'ను ప్రపంచీకరణతో వచ్చే ఆహ్వానించదగ్గ మార్పులుగా కాకుండా, ఎట్టిపరిస్థితుల్లోనూ పోరాడి ఓడించాల్సిన అంశాలుగా గుర్తించారని చెప్పటానికి చాలా ఆధారాలు ఉన్నాయి.

ఆయన తొలిసారి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత నవంబర్ 9వ తేదీన కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కార్యాలయం జారీ చేసిన డాక్యుమెంట్ నంబర్ 9లో 'సార్వజనీన విలువలు', పార్టీ నియంత్రణకు వెలుపల 'పౌర సమాజం' అనే భావన, స్వతంత్ర మీడియా సహా ఏడు చెడుల నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఒక జాబితాను చెప్పినట్లు తెలుస్తోంది.

సైద్ధాంతిక బలహీనత, సోషలిస్టు వైఖరిని కాపాడటంలో వైఫల్యం సోవియట్ యూనియన్ పతనానికి కారణమయ్యాయని జిన్‌పింగ్ భావించారు.

ఉమ్మడి, సార్వజనీన విలువలనే ఆదర్శం దొంగ దెబ్బతీసే కుట్ర అని, చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా అదే బాటలో నడిచేందుకు దారితీస్తుందని ఆయన నమ్మారు. దీనికి ఆయన ఇచ్చిన జవాబు.. అధికారవాదాన్ని, ఏక పార్టీ పాలనను వేగంగా, రాజీ లేకుండా, నిస్సంకోచంగా బలోపేతం చేయటం.

పశ్చిమ దేశాలతో వాణిజ్యం వలన చైనా వేగంగా ఎదిగింది

స్వేచ్ఛ అణచివేత

జిన్‌పింగ్ అధ్యక్షుడిగా రెండో విడత వచ్చేసరికి దేశంలో చర్చ, అసమ్మతి మీద బలంగా బిరడా బిగించటం మొదలైంది. లాయర్లను జైళ్లలో పెట్టటం, అసమ్మతి గళం నొక్కివేయటం, హాంగ్‌కాంగ్ స్వాతంత్ర్యాలను రద్దు చేయటం, షిన్‌జియాంగ్‌లో పది లక్షల మందికి పైగా వీగర్లను సామూహికంగా నిర్బంధించటానికి శిబిరాలు నిర్మించటం వంటివి ప్రారంభమయ్యాయి.

అయినప్పటికీ, చైనా బలపడకుండా క్రియాశీలంగా అడ్డుకునే విధానం సంగతి తర్వాత.. అసలు చైనాతో వాణిజ్య సంబంధాలను తెంపుకోవటానికి పశ్చిమ దేశాలు త్వరపడినట్లు ఆధారాలేవీ లేవు.

డబ్ల్యూటీఓలో చైనా చేరిక.. చైనా కార్మిక శక్తితో తమ ఉత్పత్తులను తయారు చేయించుకునే కార్పొరేట్ సంస్థలకు, చైనా వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయించే సంస్థలకు కొన్ని దశాబ్దాల పాటు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. చైనాలోని రాయబార కార్యాలయాల్లో ఇప్పటికీ వందలాది మందితో వాణిజ్య బృందాలు కొనసాగుతున్నాయి కూడా.

చైనాతో బ్రిటన్ వాణిజ్యం, భాగస్వామ్యానికి సంబంధించిన 'స్వర్ణ యుగం' జిన్‌పింగ్ మొదటి విడతలో మొదలై రెండో విడతలో కూడా కొనసాగింది.

బ్రిటన్ చాన్సలర్ జార్జ్ ఒస్బోర్న్ షిన్‌జియాంగ్ ప్రాంతంలో ఉన్న వాణిజ్య అవకాశాలను హైలైట్ చేయడానికి అక్కడ పర్యటించారు కూడా. అప్పటికే ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అంశంపై ప్రపంచం దృష్టి సారించింది.

సాధారణంగా ప్రజాస్వామ్య దేశాల నుంచి రాజకీయ నాయకుల పర్యటనలు దేశాల మధ్య సంబంధాలకు ప్రయోజనం చేకూరుస్తాయని డప్పు కొట్టి బాహాటంగా చెబుతారు. కానీ, మానవ హక్కుల ఉల్లంఘన వంటి విషయాలను తలుపు వెనకాలే చాటుగా చర్చిస్తారు.

ఆ సమయంలోనే, హంటర్ బైడెన్ (జో బైడెన్ చిన్న కొడుకు) కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్న చైనా సంస్థలతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఇదే, నేటికీ ఆయన చుట్టూ కొనసాగుతున్న రాజకీయ వివాదానికి కేంద్రం.

జరిగిన సంగతుల బట్టి, అమెరికా లేదా యూరప్ రాజకీయ ప్రముఖులు చైనాతో సంప్రదింపుల విధానాన్ని పునఃసమీక్షించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపించలేదు.

నేను బీజింగ్‌లో జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు, చైనాలో అణచివేతను కవర్ చేస్తున్నా, అక్కడి వృద్ధి, ప్రగతిని కవర్ చేయకపోతే నా జర్నలిజంలో కొంత లోపం ఉన్నట్టేనని కార్పొరేటివ్ ఎగ్జిక్యూటివ్స్ నాతో అనేవారు.

అక్కడి ఆకాశహర్మ్యాలు, హై-స్పీడ్ రైలు మార్గాలను చూస్తుంటే, వాణిజ్యం, సంప్రదింపులు.. చైనా అధికారులను రాజకీయ సంస్కరణల దిశగా ప్రేరేపించే బదులు, బయటి ప్రపంచం ఆలోచనలు మార్చినట్టు అనిపిస్తోంది.

ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛ పెంపొందడం కాదు, మానవ హక్కులనేవే లేకుండా ఈ సంపదనంతా పోగు చేయవచ్చని పాఠం నేర్చుకున్నట్లుగా ఉంది.

"పాశ్చాత్య దేశాల్లో ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నట్టు, చైనాలో ప్రజలు స్వేచ్ఛను కోరుకోరు" అని చైనాలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ఒక అమెరికన్ సంస్థలోని ఓ సీనియర్ మేనేజర్ అన్నారు. ఈ బహుళజాతి సంస్థ గృహోపకరణాలను తయారుచేస్తుంది.

ఆయన, తన ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులతో చాలాసార్లు మాట్లాడిన తరువాత, వాళ్లకు రాజకీయాల మీద ఏ మాత్రం ఆసక్తి లేదని, "కేవలం డబ్బు సంపాదనతో సంతోషంగా ఉన్నారు" అనే నిర్ణయానికొచ్చారు.

వ్యాపారులు, కార్పొరేషన్లు, ప్రభుత్వాలు చైనాలో రాజకీయ స్వేచ్ఛను తీసుకువస్తామన్న వాగ్దానాన్ని ఎక్కడో ఒకచోట వదిలేశారు అనిపిస్తోంది.

సంపద ఉంటే చాలు అన్న భావన పెరుగుతోంది.

అయితే, ఇంతకీ ఏం మారింది?

డోనాల్డ్ ట్రంప్

మూస ధోరణికి బీటలు

మొదటగా, ప్రజల అభిప్రాయం మారింది. 2018 తరువాత వీగర్ ముస్లింలు షిన్‌జియాంగ్‌లో జరుగున్న విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడి నిర్బంధ శిబిరాలలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యుల గురించి చెప్పడం మొదలుపెట్టారు. అలా చెప్పడం వలన స్వదేశంలో తమ బంధువులకు హాని కలగవచ్చన్న సంగతి తెలిసినా, ఈ విషయాలను బహిర్గతం చేశారు.

ఈ అంతర్జాతీయ స్పందనకు చైనా మొదట కంగారుపడింది. ఎందుకంటే, పశ్చిమ దేశాలు సుదీర్ఘకాలంగా చైనాతో వాణిజ్యం, భాగస్వామ్యం నెరపుతూనే, చైనాలో పలు రకాల అణచివేతలను సహిస్తూ వచ్చాయి.

షీ జిన్‌పింగ్ అధికారంలోకి రాక ముందే, ఇతర మతాల వారిని లక్ష్యంగా చేసుకోవడం, అసమ్మతి తెలిపినవారిని జైల్లో పెట్టడం, వన్-చైల్డ్ పాలసీని కఠినంగా అమలుచేయడం చైనా రాజకీయాల్లో అంతర్గత భాగంగా ఉన్నాయి.

కానీ, పూర్తిగా ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని.. కేవలం వారి సంస్కృతి, గుర్తింపు వల్ల ముప్పు ఉందని చెబుతూ, వారిని సామూహికంగా నిర్బంధించడం.. అంతర్జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని మార్చివేసింది. చారిత్రకంగా యూరప్, దాని ఆవలి దేశాలు ఇలాంటి నిర్బంధాన్ని చవిచూశాయి కాబట్టి వారంతా ఈ అంశం పట్ల స్పందించారు.

షిన్‌జియాంగ్‌లో వ్యాపారాలు ఉన్న కార్పొరేట్ సంస్థలు వినియోగదారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అలాగే, ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది.

హాంగ్‌కాంగ్‌లో అసమ్మతిని అణచివేసిన వేగం, దక్షిణ చైనా సముద్రంలో సైనికీకరణ, తైవాన్‌పై పెరుగుతున్న బెదిరింపులు వంటి ఇతర అంశాలు కూడా తెర పైకి వచ్చాయి.

కానీ, షిన్‌జియాంగ్ అంశం అంతర్జాతీయ సమాజాన్ని బాగా కదిలించింది. పలువురు అంతర్జాతీయ జర్నలిస్టులు అక్కడ జరుగుతున్న విషయలాను బయటపెట్టే ప్రయత్నాలు చేశారు. నాతో సహా అలాంటి జర్నలిస్టులు అందరినీ చైనా బయటకు తరిమేసింది.

తాజా ప్యూ ఒపీనియన్ సర్వే ప్రకారం, 80 శాతం అమెరికన్లు చైనాపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇది దశాబ్దం క్రితం కన్నా 40 శాతం పెరిగింది.

రెండవ కీలకమైన మార్పు, డోనాల్డ్ ట్రంప్.

డోనాల్డ్ ట్రంప్ చైనా వ్యతిరేకత ఎప్పుడూ స్థిరంగా లేదు. ట్రంప్ ఒకసారి చైనా అన్యాయమైన వాణిజ్య విధానాలపై విరుచుకుపడితే, మరొకసారి షీ జిన్‌పింగ్ బలమైన పాలనను ప్రశంసించారు. అయినాసరే, ప్రభావవంతంగా బ్లూ కాలర్ ఉద్యోగుల అసంతృప్తిని పోగుచేయగలిగారు.

క్లుప్తంగా చెప్పాలంటే, అవుట్‌సోర్స్ ఉద్యోగాలు, సాంకేతికత మినహా, వాణిజ్యం, భాగస్వామ్యం ప్రయోజనకరం కావని ట్రంప్ వాదించారు.

ఆయన ప్రత్యర్థులు ఆయన భాషపై, చెప్పే విధానంపై ఎన్ని విమర్శలు గుప్పించినా, మూస ధోరణికి బీటలు పడ్డాయి.

బైడెన్ అధ్యక్షుడైన తరువాత, చైనాపై ట్రంప్ విధానాలను కొన్నింటిని వెనక్కి తీసుకున్నారు. అందులో ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కూడా ఉంది. సుంకాలు మాత్రం అలాగే ఉన్నాయి.

ఆలస్యంగానైనా అమెరికా ఒక విషయాన్ని గ్రహించింది. చైనాతో వాణిజ్యం, టెక్నాలజీ సహకారం అక్కడ రాజకీయ సంస్కరణలను తీసుకురాకపోగా, బీజింగ్ అధికార నమూనాను బలోపేతం చేయడానికి ఉపయోగపడిందన్న విషయం అమెరికాకు బోధపడింది.

న్యూ నార్మల్

ఇటీవల బైడెన్ తైవాన్‌పై చేసిన వ్యాఖ్యలు చూస్తే, అమెరికా-చైనా సంబంధాలు ఎంత మారిపోయాయో అర్థమవుతుంది.

చైనా తైవాన్ మీద దాడి చేస్తే తైవాన్‌కు మద్దతుగా అమెరికా సేనలను పంపిస్తారా అని సీబీఎస్ న్యూస్ బైడెన్‌ను ఒక ఇంటర్వ్యూలో అడిగింది.

"అవును. ఊహించని రీతిలో దాడి చేస్తే సైన్యాన్ని పంపిస్తాం" అన్నది బైడెన్ సమాధానం.

ఇన్నాళ్లు అమెరికా తైవాన్‌పై ఉద్దేశపూర్వకంగానే, వ్యూహాత్మక సందిగ్ధతను పాటిస్తూ వచ్చింది. తైవాన్‌కు సహాయంగా నిలుస్తుందా, లేదా అన్నది ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అమెరికా జోక్యం చేసుకోదని చెబితే, దాడి విషయంలో చైనాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. సహాయం చేస్తుందని చెబితే, తైవాన్ అధికారికంగా స్వతంత్రం ప్రకటించుకునేందుకు ఊతమిచ్చినట్టు అవుతుంది. అందుకే సందిగ్ధతను కొనసాగించింది.

కానీ, ఇప్పుడు బైడెన్ స్పష్టంగా తైవాన్‌కు సహాయం చేస్తామని చెప్పడం చైనాకు ఆగ్రహం కలిగించింది. అమెరికా వైఖరిలో కీలకమైన మార్పు వచ్చినట్టు గుర్తించింది.

ఉమ్మడి నిబంధనలు, విలువలకు బదులుగా, చైనా ఇప్పుడు దాని సంపన్న అధికారవాద నమూనాను ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా అందిస్తోంది.

ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయని వాదిస్తూ, తన ఇంటెలిజెంట్ సర్వీసుల ద్వారా నియంతృత్వాన్ని అంతర్జాతీయ సంస్థలలో ప్రోత్సహించడానికి విస్తృతంగా కృషి చేస్తోంది.

కొన్ని వర్గాల్లో, ఉదాహరణకు జర్మన్ వ్యాపార వర్గాల్లో వాణిజ్యం, భాగస్వామ్యంపై అభిప్రాయాలు మారుతున్నాయి.

నేడు అంతర్జాతీయ సప్లై చెయిన్‌కు చైనా కీలకం. అందుకే, చైనాతో సంబంధాలు కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని వారు వాదిస్తున్నారు.

అయితే, చైనా వల్ల తీవ్రమైన ముప్పు ఉందన్న వాదనపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి సులువైన ప్రత్యామ్నాయాలు లేకపోవచ్చు. సప్లై చెయిన్ మారడానికి ఏళ్లు పడుతుంది. ఇప్పటికిప్పుడు మారడం ఖర్చుతో కూడిన వ్యవహారం అవుతుంది.

మరోవైపు, చైనాతో సంబంధాలు నెరుపుతున్నవారికి ఆ దేశం ప్రోత్సాహకాలను అందిస్తోంది. సంబంధాలు కొనసాగించనివారిపై వ్యయాలు పెంచుతోంది.

షీ జిన్‌పింగ్ మూడవసారి అధికారాన్ని చేపట్టిన ఈ సమయంలో కచ్చితంగా ఒక విషయం చెప్పవచ్చు.. ప్రపంచంలో పెద్ద మార్పులు వస్తున్నాయి.

అమెరికాకు చైనాతో శత్రుత్వం పెరుగుతోంది. రష్యాలో లాగ, చైనాలో కూడా విరోధులను స్వయంగా పెంచుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Are China and America becoming sworn enemies, what signals is Xi Jinping, the third-term president, giving?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X