వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా డ్రోన్లు పాకిస్తాన్ గగనతలం నుంచి అఫ్గానిస్తాన్‌లోకి ప్రవేశిస్తున్నాయా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అఫ్గాన్ రక్షణ మంత్రి మౌల్వీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ (మధ్యలోనున్న వ్యక్తి)

అమెరికా డ్రోన్లు పాక్ గగనతలం గుండా అఫ్గాన్ భూభాగంలోకి ప్రవేశిస్తున్నాయంటూ తాలిబాన్ రక్షణ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ విషయంపై అఫ్గాన్ రక్షణ మంత్రి మౌల్వీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ఆదివారం మాట్లాడారు. కొన్ని అమెరికా డ్రోన్లు పాకిస్తాన్ మీదుగా అఫ్గాన్‌లోకి ప్రవేశిస్తున్నాయని తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు.

ముజాహిద్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. ''ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం నిజంగా దురదృష్టకరం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలను నేరుగా అఫ్గాన్ రక్షణ మంత్రే చేయడాన్ని మరింత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

పాకిస్తాన్

''అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని మేం గౌరవిస్తాం’’

ఈ వివాదంపై స్పందిస్తూ తాము అన్ని దేశాల సౌర్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవిస్తామని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. అన్ని రకాల ఉగ్రవాదాలనూ తాము ఖండిస్తామని అన్నారు.

మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత, ప్రజలకు ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలని అఫ్గాన్ అధికారులకు పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి సూచించారు. తమ భూభాగాన్ని ఎలాంటి అతివాద కార్యకలాపాలకు ఉపయోగించకుండా చూస్తామని ప్రజలకు తాలిబాన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.

గత ఏడాది అఫ్గాన్ నుంచి అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఉపసంహరించుకోవడంతో మళ్లీ తాలిబాన్లు పట్టు సంపాదించారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో తాలిబాన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.

తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు మౌల్వీ యాకుబ్‌ను ప్రస్తుతం రక్షణ మంత్రిగా తాలిబాన్లు నియమించారు.

అసలేం జరిగింది?

కాబూల్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మౌల్వీ మాట్లాడారు. ''మా దేశానికి వ్యతిరేకంగా జరిగే చర్యల కోసం పాకిస్తాన్ తన గగనతలాన్ని వేరే ఎవరూ ఉపయోగించనివ్వకుండా చూడాలి’’అని ఆయన డిమాండ్ చేశారు.

అయితే, తన ఆరోపణలకు తగిన ఆధారాలను విలేకరుల సమావేశంలో మౌల్వీ బయటపెట్టలేదు.

''అమెరికా మా రాడార్ల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. అయినప్పటికీ పాకిస్తాన్ గగనతలం గుండా అమెరికా డ్రోన్లు మా భూభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం అందింది’’అని మౌల్వీ చెప్పారు.

ఇటీవల అల్‌ఖైదా అధిపతి అల్ జవహిరిని కాబూల్‌లోని తన సొంత ఇంటిలోనే డ్రోన్ దాడిలో అమెరికా మట్టుపెట్టినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ధ్రువీకరించారు.

ఆ దాడి తర్వాత పాకిస్తాన్ గగనతలాన్ని అమెరికా ఉపయోగించుకుంటోందనే వార్తలు ఎక్కువయ్యాయి.

అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ సైన్యం ఖండిస్తోంది. తమ గగనతలాన్ని ఎలాంటి అవసరాలకు, ఎవరికీ అప్పగించడం లేదని పాకిస్తాన్ చెబుతోంది.

తాలిబాన్

తాలిబాన్లు ఏం ఆరోపణలు చేస్తున్నారు?

తమ దేశ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోందని తాలిబాన్ రక్షణ మంత్రి చెబుతున్నారు.

''ఈ అమెరికా డ్రోన్లన్నీ పాకిస్తాన్ మీదగుండానే అఫ్గాన్‌లోకి అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ గగనతలాన్ని అమెరికా ఉపయోగించుకుంటోంది. ఇలా గగనతలాన్ని ఎవరి చేతుల్లోనూ పెట్టొద్దని మేం పాకిస్తాన్‌కు సూచించాం’’అని ఆయన అన్నారు.

మరోవైపు అమెరికా డ్రోన్లు తమ భూభాగంలోకి వస్తున్నాయని తాలిబాన్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.

జబీహుల్లా

జబీహుల్లా ఏమన్నారు?

అఫ్గానిస్తాన్‌లోకి అమెరికా డ్రోన్లు ప్రవేశించడంపై అఫ్గాన్ రక్షణ మంత్రితోపాటు తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కూడా స్పందించారు.

ఈ విషయంపై ఆగస్టు 1న రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. ''గత వారాంతంలో కాబూల్‌లో అమెరికా కొన్ని డ్రోన్ దాడులు చేపట్టింది’’అని రాయిటర్స్‌తో జబీహుల్లా చెప్పారు.

అలాంటి దాడులను తాలిబాన్ తీవ్రంగా ఖండిస్తోందని, ఇవి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని జబీహుల్లా వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయే ముందుగా అమెరికా సేనలు కుదుర్చుకున్న ఒప్పందానికి వారే తూట్లు పొడుస్తున్నారని అన్నారు.

ఎప్పటికప్పుడే అఫ్గాన్‌లోని చాలా ప్రాంతాల్లో అమెరికా డ్రోన్లు కనిపిస్తున్నాయని జబీహుల్లా చెప్పారు. ఇది అఫ్గానిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే, కూర్చుని మాట్లాడుకుందామని అమెరికాకు ఆయన పిలుపునిచ్చారు.

మారుతున్న సమీకరణలు..

పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. కునార్, ఖోస్త్ ప్రావిన్స్‌లలో పాకిస్తాన్ సైన్యం బాంబు దాడులకు తెగబడుతోందని, ఈ దాడుల్లో దాదాపు 40 మంది చనిపోయారని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది.

ఆ దాడుల తర్వాత కాబూల్‌లోని పాకిస్తాన్ రాయబారికి అఫ్గాన్ విదేశాంగ కార్యాలయం సమన్లు కూడా జారీచేసింది. దాడులను తీవ్రంగా ఖండించింది.

అయితే, పాకిస్తాన్ మాత్రం.. అఫ్గాన్ భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగించుకొని తమ దేశంపై దాడులకు కుట్రలు పన్నుతున్నారని చెబుతోంది.

మరోవైపు డ్యూరండ్ రేఖ విషయంలోనూ రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. అఫ్గాన్, పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దును డ్యూరండ్ రేఖగా పిలుస్తారు. 2,640 కి.మీ. పొడవైన ఈ రేఖను రెండు దేశాల మధ్య సరిహద్దుగా 1893లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయిచింది.

బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మార్టిమర్ డ్యూరండ్, అఫ్గాన్ అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ దీనికి సంబంధించిన ఒప్పందంపై కాబూల్‌లో సంతకాలు చేశారు. అయితే, ఈ సరిహద్దుల విషయంలో అఫ్గాన్, పాక్‌ల మధ్య ఎప్పటికప్పుడే విభేదాలు వస్తుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Are US drones entering Afghanistan from Pakistani airspace?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X