నేపాల్ భూకంప బాధితుల్లో 50 వేల మంది గర్భిణీలు: ఐక్యరాజ్య సమితి
న్యూఢిల్లీ: నేపాల్‌ను వరుస భూప్రకంపనలు అతలాకుతలం చేశాయి. ఈ భూకంప బాధితుల్లో సుమారు 50,000 మంది గర్భిణీలు ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. నేపాల్ భూకంప తీవ్రత దేశ వ్యాప్తంగా 80 లక్షల మంది మీద ప్రభావం చూపగా, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 5,057 మంది మరణించినట్లు తెలుస్తోంది.
యునైడెట్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ ప్రాథమిక అంచనా ప్రకారం నేపాల్ భూకంప ప్రభావం నుంచి బతికి బయటపడిన వారిలో సుమారు 50,000 మంది గర్భిణీలు ఉన్నట్లు పేర్కొన్నారు. వారందరికీ ప్రత్యేక వైద్య సదుపాయాలు అందిస్తోన్నట్లు పేర్కొన్నారు.

భూకంప తీవ్రతకు నేపాల్‌లోని పురాతన భవనాలు, ఇళ్లు పూర్తిగా నేలమట్టంఅవడంతో వైద్య సదుపాయాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గర్భిణీలకు ప్రత్యేకించి వైద్య సదుపాయాలు కల్పించేందుకు గాను ఎమర్జెన్సీ సర్వీసు స్టాఫ్ మెంబర్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచారు.
ఈ భూకంప ప్రభావం గర్భిణీలపై పడకుండా ఉండేందుకు గాను అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బాబాతుండే వివరించారు. అన్ని ప్రయత్నాలు భద్రతతో పాటు, వారి పిల్లలు భద్రత కోసం చేస్తున్నట్లు వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా మారుమూల గ్రామాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ సరైన సమాగ్రి, నిపుణులు లేకపోవడం వల్ల ప్రభుత్వాధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. 14 లక్షల మందికి ఆహారం అవసరమని, నీరు గుడారాల కొరత కూడా ఉందని తెలిపారు.
ఇక భారత్ నుంచి ఇప్పటివరకూ నేపాల్‌కు తాత్కాలిక ఆసుపత్రులను, ఆహారం, నీరు, ఔషధాలను, గాలింపు బృందాలను పంపించింది. నేపాల్‌కు అన్ని విధాల సహాయం చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
'నేపాల్ ఒంటరి కాదు. మేం ఉన్నాం' అని ప్రధాని మోడీ ప్రకటించారు. మంగళవారం ఆయన ఆప్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో కలిసి మీడియాతో మాట్లాడారు. దక్షిణాసియా దేశాలన్నీ నేపాల్‌కు అండగా ఉంటాయని చెప్పారు.
నేపాల్ భూకంప బాధితుల్లో మధుమేహంతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు భారత్ రూ. కోటి విలువైన 75 వేల ఇన్సులిన్ ఇంజెక్షన్లను పంపుతున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.












Click it and Unblock the Notifications