నేపాల్ సంక్షోభంలో ట్విస్ట్‌లు- చైనా సాయం కోరిన ప్రచండ- వేచిచూస్తున్న భారత్
నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో నెలకొన్న సంక్షోభంతో పార్లమెంటు అర్దాంతరంగా రద్దు కావడం, మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే విచిత్రంగా నేపాల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అక్కడి కమ్యూనిస్టు నేతలు పొరుగుదేశాల జోక్యం కోరుతుండటం విశేషం. ముఖ్యంగా నేపాల్ పక్కనే ఉన్న మరో కమ్యూనిస్టు దేశం చైనా జోక్యం కోరుతూ నేపాల్ నేతలు చేస్తున్న ప్రకటనలను భారత్ కూడా నిశితంగా గమనిస్తోంది.

నేపాల్లో కొనసాగుతున్న సంక్షోభం
నేపాల్లో పార్లమెంటు రద్దుతో నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రధాని కేపీ శర్మ ఓలీ, ప్రచండ వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో ఇప్పటికే పార్లమెంటు రద్దు కాగా.. మధ్యంతర ఎన్నికల నిర్వహణ దిశగా సరైన అడుగురు పడటం లేదు. దీంతో సంక్షోభ పరిష్కారం జరిగితే తప్ప ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేదు. మరోవైపు నేపాల్లో రాజకీయ సంక్షోభాన్ని చల్లార్చేందుకు ఈ అగ్గిని రాజేసిన కమ్యూనిస్టు నేతలే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి కూడా భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకునే అన్నట్లుగా సాగుతున్నాయి.

చైనా సాయం కోరిన ప్రచండ..
నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనాకు గట్టి మద్దతు దారుగా ఉన్నారు. కరోనా సమయంలోనూ ఎప్పటి నుంచో తమ దేశంతో సత్సంబంధాలు ఉన్న భారత్‌ను కాదని చైనా సాయం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా భారత్‌ను ఇరుకునపెట్టేలా నేపాల్ మ్యాప్‌లో మార్పులు చేశారు. భారత్‌లో మూడు భూభాగాలు తమవే అంటూ కొత్త వివాదాలు సృష్టించారు.
అయితే ఓలీని వ్యతిరికిస్తున్న మరో నేత ప్రచండ మాత్రం భారత్‌కు గట్టి మద్దతు దారుగా ఉన్నారు. కానీ తాజా సంక్షోభం నేపథ్యంలో ఆయన కూడా చైనా మద్దతు కోరారు. నేపాల్ సంక్షోభ పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని ప్రచండ చేసిన విజ్ఞప్తి సంచలనం రేపుతోంది.

వేచి చూసే ధోరణిలో భారత్
హిమాలయ రాజ్యమైన నేపాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలు సహజంగానే భారత్‌లో ఆసక్తి రేపుతున్నాయి. నేపాల్ రాజకీయ సంక్షోభంపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటున్న భారత్.. అవసరాన్ని బట్టి మాత్రమే స్పందించాలని భావిస్తోంది. ఇప్పటికే అక్కడ సంక్షోభానికి కారణమైన కేపీ శర్మ ఓలీ, ప్రచండ ఇద్దరూ చైనా సాయం కోరుతున్న నేపథ్యంలో పరిస్ధితిని బట్టి స్పందిస్తామని నేపాలీ నేతలకు సంకేతాలు పంపుతోంది. ఇప్పటికే నేపాల్లో భారత రాయబారి వినయ్ క్వాత్రా ప్రధాని ఓలీతో భేటీ అయ్యారు. పార్లమెంటు రద్దుకు దారి తీసిన కారణాలపై ఓలీ అభిప్రాయాన్ని ఆయన తెలుసుకున్నారు. మరోవైపు భారత విదేశాంగశాఖ మాత్రం నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని చెబుతోంది. నేపాల్ ప్రధానీ ఓలీ చర్యలు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది.