వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసిఫ్ సుల్తానీ: ప్రాణభయంతో దేశం విడిచి పారిపోవడం నుంచి ఒలింపిక్ కల నిజం చేసుకునేంత వరకు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆసిఫ్ సుల్తానీ

"దారిలో బందిపోటు దొంగలు మమ్మల్ని దోచుకున్నారు. మా దగ్గర ఉన్న కొద్దిపాటి సామాన్లను కూడా నుదుటి మీద తుపాకీ పెట్టి మరీ దోచుకున్నారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. నేను చాలా భయపడిపోయాను."

అఫ్గానిస్తాన్ నుంచి బయలుదేరిన తరువాత వారి ప్రయాణం ఎలా సాగిందో ఆసిఫ్ సుల్తానీకి పూర్తిగా గుర్తు లేదుగానీ, కొన్ని విషయాలు మాత్రం జ్ఞాపకం ఉన్నాయి.

హజారా వర్గానికి చెందిన ఆసిఫ్ కుటుంబం అక్కడి వేధింపులు భరించలేక అఫ్గానిస్తాన్ విడిచి వెళ్లవలసి వచ్చింది.

ఆశ్రయం పొందేందుకు వారు ఇరాన్ చేసుకున్నారు. కానీ, అక్కడ వారిని సాధారణ శరణార్థుల్లా కాకుండా వివక్షతో చూశారు.

"సరైన పత్రాలు లేవని మాపై వివక్ష చూపించారు. అక్కడి ప్రజలు నన్ను చాలా హింసించారు. లాగి తన్నేవారు. నాపై ఉమ్మేవారు. వాళ్ల ముందు మోకరిల్లి దయాభిక్ష కోరమని బలవంత పెట్టేవారు" అని ఆసిఫ్ వివరించారు.

కానీ ఆసిఫ్ తండ్రి తన బిడ్డకు కొండంత అండగా నిలిచారు. ధైర్యం చెప్పి, స్వీయ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని ప్రోత్సహించారు.

ఆ ప్రోత్సాహమే ఇవాళ ఆసిఫ్‌ను టోక్యో ఒలింపిక్స్‌లో టీం రెఫ్యూజీ తరపున కరాటే పోటీల్లో స్థానం సంపాదించే దిశగా పురిగొల్పింది.

ఆసిఫ్ సుల్తానీ

మార్షల్ ఆర్ట్స్

ఇరాన్ వెళ్లిన తరువాత ఆసిఫ్ దగ్గర సరైన పత్రాలు ఏవీ లేకపోవడంతో సమీపంలో ఉన్న కరాటే కేంద్రంలో ఆయనను చేర్చుకోలేదు.

దాంతో విసుగు చెందిన ఆసిఫ్ తన ఇంటి వెనుక భాగంలోనే ఒక ట్రైనింగ్ జిమ్ ఏర్పాటు చేసుకున్నారు.

"నా మనసు ముక్కలైపోయింది. జీవితంలో నాకు మిగిలిన ఆశ అదొక్కటే.. కరాటే నేర్చుకుంటే చాలు అనుకున్నాను. నా స్నేహితులను కొందరిని పోగు చేసుకుని స్వయం శిక్షణ ప్రారంభించాను.

బ్రూస్ లీ సినిమాలు చూసి నేను కూడా ఆయనలాంటి వాడినేనని ధైర్యం తెచ్చుకున్నాను. ఇదేదో ఫ్యాషన్ అని మొదలు పెట్టలేదు. బలం ఉంది, ధైర్యం ఉంది. ఏదైనా చెయ్యాలనే కోరిక ఉంది" అని ఆసిఫ్ చెప్పారు.

ఆసిఫ్ సుల్తానీ

ఒక్కటే మార్గం

కలలన్నీ చిధ్రమైపోయే రోజు ఒకటి ఆసిఫ్‌కు ఎదురైంది. ఆసిఫ్‌కు 16 ఏళ్ల వయసప్పుడు ఆయన్ను తిరిగి అఫ్గానిస్తాన్ పంపించేశారు.

ప్రాణాలు కాపాడుకోవడానికి ఆసిఫ్ అఫ్గానిస్తాన్ లో ఒక చిన్న హొటల్ రూమ్‌లో దాక్కోవలసి వచ్చింది.

"అక్కడి వాళ్లు పెద్ద పెద్ద తుపాకులు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ కనిపించారు. నేను చాలా భయపడిపోయాను. ఎందుకంటే, అఫ్గానిస్తాన్‌లో హజారా వర్గాన్ని చాలా ఏళ్లుగా అణచి వేతకు గురి చేస్తున్నారు" అని ఆసిఫ్ తెలిపారు.

ఇప్పుడు తన దగ్గర ఒకే ఒక్క మార్గం ఉందని ఆసిఫ్‌కు అనిపించింది. ఎలాగైనా అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకున్నారు.

https://twitter.com/asifsultani_/status/1382292911019106307

కొన్ని రోజుల తరువాత, ఇండోనేషియా మీదుగా ఆస్ట్రేలియా ప్రయాణమవుతున్న 100 మంది సభ్యుల బృందంలో ఆసిఫ్ చేరారు.

చిన్న పడవలో చాలా దూరం సముద్ర ప్రయాణం చేయాలి. మార్గమధ్యలో వారి పడవ ఇంజిన్ పాడైపోయింది. నడి సముద్రంలో చిక్కుకుపోయారు.

"అందరూ ఏడవడం మొదలుపెట్టారు. నీటిలో దూకేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అదంతా ఒక పీడకలలాగ మారిపోయింది" అని ఆసిఫ్ చెప్పారు.

ఎన్నో గంటలు అలా సముద్రం మధ్యలో గడిపాక, చివరకు పడవ ఒడ్డుకు చేరుకోగలిగింది.

ఆస్ట్రేలియా చేరుకున్న తరువాత ఆసిఫ్‌కు రెండేళ్లు నిర్బంధ కేంద్రంలో గడపాల్సి వచ్చింది.

https://twitter.com/asifsultani_/status/1257638808780066816

18 ఏళ్ల వయసు వచ్చిన తరువాత, ఆస్ట్రేలియాలోని ఉన్నత పాఠశాలలో ఆసిఫ్ ప్రవేశం పొందారు.

అక్కడ ఆయనకు రోజుకు రెండుసార్లు కరాటేలో శిక్షణ ఇచ్చేవారు.

ఆసిఫ్‌కు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ రెఫ్యూజీ స్కాలర్‌షిప్ లభించింది.

టీమ్ రెఫ్యూజీ తరపున 2016లో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో ఆసిఫ్ స్థానం సంపాదిస్తారా లేదా అనేది జూన్‌లో తెలుస్తుంది.

"నేనేమీ స్వర్ణ పతకం సాధించడానికి వెళ్లట్లేదు. నచ్చినట్టు జీవించే అదృష్టం ఒక శరణార్థిగా నాకు లేదు. నన్ను వేధింపులకు గురి చేసి, పుట్టి, పెరిగిన ప్రాంతాన్ని, కుటుంబాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితిని కూడా నేను కోరుకోలేదు'' అన్నారు ఆసిఫ్.

''నాలాగా తమ సొంత దేశాలను, మనుషులను విడిచి వెళ్లిన ఎంతోమంది పిల్లలకు ఒక చేయూతనివ్వాలని అనుకుంటున్నాను. వారిలో నన్ను నేను చూసుకుంటాను" అని ఆసిఫ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Asif Sultani: From fleeing the country in fear for his life until the Olympic dream came true
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X