వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AUKUS ఒప్పందం: అణు జలాంతర్గామి ప్రత్యేకత ఏమిటి? ఆస్ట్రేలియా ఎందుకు ఇలాంటి సబ్‌మెరైన్ తయారుచేస్తోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అణు జలాంతర్గామి

ఆస్ట్రేలియా ప్రభుత్వం బ్రిటన్, అమెరికాతో ఒక చారిత్రక రక్షణ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఇవి అణుశక్తితో నడిచే జలాంతర్గాములను తయారు చేస్తాయి.

ఈ అణు జలాంతర్గాములను ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో, జలాల్లో భద్రత, నిఘా కోసం ఉపయోగించనున్నారు.

అణు యుగం ప్రారంభంతోనే 1940లలో అణు శక్తితో సముద్రంలో నడిచే నౌకలపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి.

ఆ తర్వాత ఇప్పుడు కేవలం ఆరు దేశాల దగ్గరే ఈ అణు శక్తితో నడిచే జలాంతర్గాములు ఉన్నాయి. చైనా, ఫ్రాన్స్, భారత్, రష్యా, బ్రిటన్, అమెరికాకు మాత్రమే ఈ సత్తా ఉంది.

ఇలాంటి సమయంలో, అసలు ఒక అణు జలాంతర్గామిలో అణు శక్తిని ఎలా వినియోగిస్తారు. అది సాధారణ జలాంతర్గామి కంటే ఎంత ప్రత్యేకం అనే ప్రశ్నలు కూడా ఎదురవుతాయి.

అణు జలాంతర్గామి

తిరుగులేని శక్తి వనరు

ఇవన్నీ తెలుసుకోడానికి ముందు అణు శక్తితో నడిచే ఈ జలాంతర్గాములు అణ్వాయుధాలు కావని మనం గుర్తుంచుకోవాలి. అదేసమయంలో ఇవి సాధారణ జలాంతర్గాములతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి.

అణు శక్తిపై పరిశోధనలు జరుగుతున్న తొలినాళ్లలో అణు విచ్ఛిత్తి వల్ల విడుదలయ్యే శక్తిని విద్యుదుత్పత్తి కోసం భారీ స్థాయిలో ఉపయోగించవచ్చు అని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా గత 70 ఏళ్లుగా విద్యుత్ ప్లాంట్లలో ఏర్పాటు చేసిన న్యూక్లియర్ రియాక్టర్లతో విద్యుదుత్పత్తి చేసి ఇళ్లకు, పరిశ్రమలకు వెలుగునిస్తున్నారు. సరిగ్గా అదే విధంగా అణు జలాంతర్గామిలో కూడా ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. అదే దానికి శక్తి వనరుగా మారుతుంది.

ప్రతి అణు కేంద్రకం ప్రోటాన్, న్యూట్రాన్లతో తయారై ఉంటుంది. అణు విచ్ఛిత్తి ప్రక్రియలో భారీ స్థాయిలో శక్తి విడుదలవుతుంది. అణు శక్తితో నడిచే జలాంతర్గాముల్లో ఇంధనం కోసం యురేనియం ఉపయోగిస్తారు.

సహజ యురేనియంలో రెండు రకాల ఐసోటోప్‌లు ఉంటాయి. U 235, U 238. ఒక మూలకం అణువులు ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి, వాటి ద్రవ్యరాశి వేరు వేరుగా ఉంటే దానిని ఐసోటోప్ అంటారు.

U 235ను అణ్వాయుధాల తయారీకి లేదా అణు శక్తి ఉత్పత్తికి ఉపయోగిస్తారని భావిస్తారు. కానీ, యురేనియం ముడి ఖనిజంలో U 238 స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల... ఒక ప్రత్యేకమైన సెంట్రీఫ్యూజ్ విధానాన్ని ఉపయోగించి అందులో నుంచి U-235ను వేరు చేస్తారు.

అణు జలాంతర్గామి

న్యూక్లియర్ రియాక్టర్ పని చేయడానికి యురేనియం ఇంధనాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల U-235ని మనకు కావల్సిన స్థాయికి తీసుకురావచ్చు. జలాంతర్గామి కోసం ఆ నియమిత స్థాయి 50 శాతం వరకూ ఉంటుంది.

న్యూక్లియర్ రియాక్టర్‌లో 'చైన్ రియాక్షన్' కోసం అణు ఇంధనం శుద్ధి చాలా ముఖ్యం. దాని ద్వారా నియమిత, సురక్షిత స్థాయిలో శక్తి ఉత్పత్తి సాధ్యమవుతుంది.

రియాక్టర్ లోపల యురేనియం 235 మీద న్యూట్రాన్స్ పేల్చుతారు. దీని ద్వారా అణు విచ్ఛిత్తి ప్రక్రియ మొదలవుతుంది. ఫలితంగా మరిన్ని న్యూట్రాన్స్ విడుదలవుతాయి. సైన్స్‌లో ఇదే ప్రక్రియను 'చైన్ న్యూక్లియర్ రియాక్షన్' అంటారు.

ఈ శక్తి వేడి రూపంలో లభిస్తుంది. దానిని జలాంతర్గామి లోపల విద్యుత్ ఉత్పత్తికి, టర్బైన్‌లను నడపడానికి ఉపయోగిస్తారు.

జలాంతర్గాములు

అణు శక్తి ప్రయోజనాలు, నష్టాలు

అణు శక్తితో నడిచే జలాంతర్గామితో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, అది ఇంధనం నింపుకోవాల్సిన అవసరం ఉండదు.

అణు జలాంతర్గామిని ఒకసారి విధుల్లో మోహరించినపుడు, దానిలో ఇంధనంగా ఉండే యురేనియంతో అది మరో 30 ఏళ్ల వరకూ సముద్రంలో పనిచేస్తూనే ఉండగలదు.

డీజిల్‌తో నడిచే సంప్రదాయ జలాంతర్గామితో పోలిస్తే అణు శక్తితో నడిచే జలాంతర్గామి సుదీర్ఘ కాలంపాటు వేగంగా పనిచేయగలదు. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంటుంది. సంప్రదాయ కంబస్టన్ ఇంజన్‌కు భిన్నంగా అణు జలాంతర్గామికి గాలి అవసరం కూడా ఉండదు.

అంటే.. ఒక అణు జలాంతర్గామి నెలల తరబడి సముద్రం లోతుల్లోనే ఉండగలదు. దానిని సుదూర ప్రాంతాల్లో నిఘా ఆపరేషన్ల కోసం సుదీర్ఘ ప్రయాణం కోసం పంపించవచ్చు. కానీ ఇందులో ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఈ జలాంతర్గామికి చాలా వ్యయం అవుతుంది.

అణు జలాంతర్గామి

ఒక అణు జలాంతర్గామిని తయారు చేయడానికి 100 కోట్ల డాలర్లు ఖర్చవుతుంది. అణు శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులు, నిపుణులతో మాత్రమే వీటిని తయారు చేయడం సాధ్యం అవుతుంది.

ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీలు న్యూక్లియర్ సైన్స్‌కు సంబంధించిన అంశాల్లో శిక్షణా కార్యక్రమాలు కూడా ఇస్తుంటాయి.

అణు జలాంతర్గాముల్లో సుశిక్షితులైన వర్క్ ఫోర్స్ కోసం పెరిగే డిమాండును భర్తీ చేయగలిగిన సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉందని కూడా భావిస్తున్నారు.

దీనితోపాటూ బ్రిటన్, అమెరికాతో జరిగిన ఒప్పందాల వల్ల వారి అనుభవం ఆస్ట్రేలియాకు ఉపయోగపడుతుంది.

అయితే ఆస్ట్రేలియా కోసం తయారు చేస్తున్న జలాంతర్గాముల కోసం ఇంధనం ఎక్కడ నుంచి వస్తుంది. ఆస్ట్రేలియా దగ్గర ఇప్పటికే యురేనియం నిల్వలు ఉన్నాయా అనేది ఇప్పటివరకూ స్పష్టంగా తెలీడం లేదు.

అణు ఇంధనంగా మార్చేలా యురేనియంను శుద్ధి చేయగలిగే సామర్థ్యం కూడా ఆస్ట్రేలియాకు లేదు. కానీ, అది ఆ టెక్నాలజీని మిగతా దేశాల నుంచి కొనుగోలు చేయవచ్చు.

అణు వ్యర్థాల మాటేమిటి

ఆస్ట్రేలియాలో 2015లో న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ రాయల్ కమిషన్ ఏర్పాటైంది.

అది తన రిపోర్టులో దక్షిణ ఆస్ట్రేలియాలో రేడియో యాక్టివ్ వ్యర్థాలను సుదీర్ఘ కాలం పాటు మెయింటైన్ చేయవచ్చని పేర్కంది.

కానీ అదే జరిగితే, ముందు ముందు, ఆ దేశంలో సమాఖ్య, ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య దీనిపై చర్చలు జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు, ఈ చర్చల ఫలితంపై చాలా ఆధారపడి ఉంటాయి.

అణు జలాంతర్గామి

అపార్థాలు, అపోహలు

ఆక్స్ ఒప్పందం అంటే, ఆస్ట్రేలియా తన జలాల్లో అణ్వాయుధాలను మోహరించబోతోందని అర్థం కాదు.

ఒకవేళ అది అలా చేస్తే దానికి 'వెపన్ గ్రేడ్; యురేనియం అవసరం అవుతుంది. దానికోసం అది యురేనియం 235ను 90 శాతం వరకూ శుద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ, అణు జలాంతర్గామి కోసం అలాంటి ఇంధనం అవసరం లేదు.

అణ్వాయుధాల వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ఒప్పందాలపై ఆస్ట్రేలియా సంతకాలు చేసింది. అందుకే అది అణ్వాయుధాలు తయారు చేయలేదు.

ఇక, అణు జలాంతర్గామి వల్ల ఆస్ట్రేలియాకు అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే, అది నిఘా ఆపరేషన్లు నిర్వహించవచ్చు. ఎవరూ గుర్తించకుండా తన లక్ష్యాలను పూర్తి చేయవచ్చు.

లోపలి సిబ్బంది, పర్యావరణం కోసం దీని భద్రత చాలా ముఖ్యం. కానీ, ఆధునిక టెక్నాలజీ సాయంతో అణు జలాంతర్గాముల్లో భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేయవచ్చని, వాటిని ప్రమాదాలకు గురికాకుండా అడ్డుకోవచ్చని భావిస్తున్నారు.

ఈ రాజకీయ నిర్ణయం ఫలితం ఏంటనేది భవిష్యత్తులో తెలియనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
AUKUS Agreement: What makes a nuclear submarine special? Why Australia is making such a submarine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X