కంటైనర్ డిపోలో ఘోర అగ్ని ప్రమాదం: 40 మంది మృతి, 500 మందికిపైగా గాయాలు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్రైవేటు కంటైనర్ డిపోలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సమారు 500 మందికిపైగా గాయాలపాలయ్యారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి స్థానికంగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
సమీపంలోని భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

మంటలను ఆర్పేసిన 19 ఫైర్ ఇంజిన్లు
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే 19 ఫైర్ఇంజిన్లు మంటలను ఆర్పేందుకు నిరంతరాయంగా శ్రమించాయి. ఆరు అంబులెన్సులను అందుబాటులో ఉంచి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ట్టాగాంగ్లోని సీతాకుందా ప్రాంతంలో ఉన్న బీఎం కంటైనర్ డిపోలో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక ఎస్ఐ నురుల్ ఆలం వెల్లడించారు.క్షతగాత్రులకు తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

భారీ పేలుళ్లతోనే చెలరేగిన మంటలు
శనివారం రాత్రి 9 గంటలకే మంటలు ప్రారంభయ్యాయని, 11.45 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. 'ఆ తర్వాత మంటలు ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్‌కు వ్యాపించాయి. ఓ కంటైనర్‌లో రసాయనాలు ఉండటం వల్ల మంటలు భారీగా చెలరేగాయి అని అధికారులు వెల్లడించారు. డిపో చాలా వరకు ఖాళీగానే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అగ్నిప్రమాదంలో 500 మందికి పైగా గాయపడ్డారని రెడ్ క్రిసెంట్ యూత్ హెల్త్ సర్వీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇస్తాకుల్ ఇస్లామ్ పేర్కొన్నారు. 350 మంది స్థానిక సీఎంసీఎహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఇతర ఆస్పత్రుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా విచారం
మరోవైపు, మృతుల కుటుంబ సభ్యులకు 560 డాలర్ల పరిహారం (సుమారు రూ.43వేలు) ప్రకటించారు చట్టోగ్రామ్ డివిజనల్ కమిషనర్ అష్రఫ్ ఉద్దిన్. గాయపడ్డ వారికి 224 డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ ఘోర ప్రమాద ఘటనపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై అధికారులు అత్యున్నత స్థాయి విచారణ ప్రారంభించారు. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించనున్నారు.












Click it and Unblock the Notifications