వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాదేశ్: చేతుల్లో వేలిముద్రలు లేని కుటుంబం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వేలు ముద్రలు లేని వ్యక్తి

బంగ్లాదేశ్‌కు చెందిన అపు సర్కార్ కుటుంబంలో పురుషులకు వేలిముద్రలు ఉండవు. వీరి చేతి వేళ్లు ఎలాంటి గీతలు, రేఖలు లేకుండా నునుపుగా ఉంటాయి.

మన చేతివేళ్ల మీద గుండ్రంగా సుడులు తిరుగుతూ సాగే సన్నని రేఖలను డెర్మటాగ్లిఫ్స్ అంటారు. ఈ డెర్మటోగ్లిఫ్స్ ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవు.

ఒక అరుదైన జన్యుపరివర్తన (జెనెటిక్ మ్యూటేషన్) కారణంగా కొంతమంది చేతి వేళ్లపై డెర్మటాగ్లిఫ్స్ ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్య ఉన్నవారు చాలా కొద్దిమందే ఉన్నారు. వారిలో ఈ కుటుంబం ఒకటి.

22 ఏళ్ల అపు సర్కార్ ఉత్తర బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి జిల్లాలో ఉంటారు. ఆయన తాత, తండ్రి వ్యవసాయం చేసేవారు. అపు ఈమధ్యకాలం వరకు మెడికల్ అసిస్టంట్‌గా పనిచేసేవారు.

ఆపు తాతల కాలంలో వేలిముద్రలు లేకపోవడం వల్ల పెద్ద సమస్య కాకపోయి ఉండొచ్చు. అప్పట్లో సంతకం చేయడం రాకపోతే వేలిముద్రలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు మనకు సంబంధించిన బయోమెట్రిక్ డేటా సేకరించేటప్పుడు కచ్చితంగా మన వేలిముద్రలను తీసుకుని భద్రపరుస్తున్నారు. పాస్‌పోర్ట్ కావాలంటే వేలిముద్రలు ఇవ్వాల్సిందే. ఆఖరికి స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసేందుకు కూడా వేలిముద్రలనే వాడుతున్నాం.

ఓటు వేసేముందు వేలిముద్రలు ఇస్తున్న మహిళ

బంగ్లాదేశ్ ప్రభుత్వం 2008లో వయోజనులందరికీ నేషనల్ ఐడీ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డుల మీద వేలిముద్ర తప్పనిసరిగా ఉండాలి. అపు వాళ్ల నాన్న అమల్ సర్కార్‌కు వేలి ముద్రలు లేకపోవడంతో పెద్ద చిక్కొచ్చి పడింది. చివరకు, కార్డు మీద 'నో ఫింగర్‌ప్రింట్’ అని రాసి ఇచ్చారు.

2010లో పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ముఖ్యమైన పత్రాలన్నిటికీ వేలిముద్రలు సేకరించడం తప్పనిసరి చేశారు. ఎన్నో ప్రయత్నాల తరువాత, ఒక మెడికల్ సర్టిఫికెట్ సహాయంతో అమల్ పాస్‌పోర్ట్ పొందగలిగారు. అయితే, ఇప్పటివరకూ ఆయన ఈ పాస్‌పోర్ట్ వాడలేదు. ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ వేలిముద్రల సమస్య వస్తుందని భయపడి ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేదు. పాస్‌పోర్ట్ పొందగలిగారు కానీ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం దొరకలేదు.

"నేను ఫీజు కట్టాను, డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యాను. అయినా నాకు లైసెన్స్ కార్డు ఇవ్వలేదు. నాకు వేలిముద్రలు లేవు కాబట్టి లైసెన్స్ కార్డు మంజూరు చేయలేమని అధికారులు చెప్పారు" అని అమల్ తెలిపారు.

కానీ, అమల్ వ్యవసాయ పనులకోసం మోటార్‌ సైకిల్ వాడాల్సి ఉంటుంది. లైన్సెస్ కోసం కట్టిన ఫీజు రసీదు జేబులో పెట్టుకుని బండి నడుపుతుంటారు. కానీ ఎక్కడైనా పోలీసులకు చిక్కితే ఫైన్ వేస్తుంటారు. ఫీజు రసీదు చూపించి, చేతి వేళ్లను చూపించి, వేలిముద్రల సమస్య గురించి చెప్పినా కూడా వాళ్లు ఫైన్ వేస్తూనే ఉంటారని అమల్ తెలిపారు.

వేలిముద్రలు లేక ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వం 2016లో మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. సిమ్ కార్డు కొనాలంటే నేషనల్ డాటాబేస్‌లోని వేలిముద్రలతో మ్యాచ్ అవ్వాలని రూల్ పెట్టింది.

"నేను సిమ్ కార్డ్ కొనేందుకు వెళ్లినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. సెన్సార్ మీద నా వేలు పెడితే ఆ సాఫ్ట్‌వేర్ పనిచేయలేదు. వాళ్లకు ఏమీ అర్థం కాక కంగారు పడ్డారు" అని అమల్ నవ్వుతూ చెప్పారు.

ఆయనకు సిమ్ కార్డ్ దొరకలేదు. వాళ్లింట్లో మగవారందరికీ మొబైల్ సిమ్ కార్డు కొనడం అసాధ్యమైపోయింది. చివరకు, అపు తల్లి పేరు మీద సిమ్‌లు తీసుకున్నారు.

అమల్ శంకర్ చేతులు

అపు కుటుంబానికి వచ్చిన ఈ సమస్యను 'అడెర్మటాగ్లిఫియా’ అంటారు. ఇది 2007లో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది.

స్విట్జర్ల్యాండ్‌కు చెందిన ఒక మహిళ అమెరికా వెళ్లాలనుకున్నారు. ఆమె చేతి వేలిముద్రలు లేవు. విమానాశ్రయంలో ముఖకవళికలు సరిపోయినప్పటికీ, వేలిముద్రలు నమోదు చేయలేకపోవడంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అమెరికాలో అడుగుపెట్టనివ్వలేదు.

చర్మవ్యాధి నిపుణులు ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను పరీక్షించారు. ఆమెతో పాటు వారింట్లో ఎనిమిది మందికి చేతివేళ్ల మీద ముద్రలు లేవని, చెమట గ్రంథులు కూడా తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.

తర్వాత ఆ కుటుంబంలో 16 మందికి డీఎన్ఏ పరీక్షలు జరిపారు. వారిలో ఏడుగురికి మామూలు చేతివేళ్లు, తొమ్మిది మందికి వేలిముద్రలు లేని వేళ్లు ఉన్నాయి.

"ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు అరుదు. చాలా తక్కువ కుటుంబాలలోనే ఈ సమస్య ఉన్నట్లు నమోదైంది" అని వారికి పరీక్షలు చేసిన ప్రొఫెసర్ ఐటిన్ బీబీసీకి తెలిపారు.

ఈ సమస్య గురించి పరిశోధించి, ఈ వ్యాధికి ఒక పేరు పెట్టడానికి నాలుగేళ్లు పట్టింది. 2011లో దీని గురించి పూర్తి వివరాలు తెలిశాయి.

ఎస్ఎంఏఆర్‌సీఏడీ1 (స్మార్‌కేడ్1) అనే జన్యువు ఆ కుటుంబలోని తొమ్మిదిమంది సభ్యులలో మ్యూటేషన్ చెందిందని, దానివల్లే వారందరికీ వేలిముద్రల సమస్య ఉత్పన్నమైందని డెర్మటాలజిస్టుల పరిశోధనలో తేలింది.

అప్పటికి ఈ జన్యువు గురించి ఎవరికీ తెలీదు. అయితే, దీనివల్ల మరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉండవని, చేతివేళ్ల మీద ముద్రలు మాత్రమే అదృశ్యమైపోతాయని కనుగొన్నారు. దీన్ని కనిపెట్టడానికి నాలుగేళ్లు పట్టింది. 2011లో ఈ వ్యాధిని నిర్థరించారు.

"ఈ జన్యు పరివర్తన గురించి అప్పటికి ఎలాంటి సమాచారం లేదు. అందుకే దీన్ని కనిపెట్టడానికి అన్నేళ్లు పట్టింది" అని ప్రొఫెసర్ ఐటిన్ చెప్పారు.

ఈ సమస్యకు 'అడెర్మటాగ్లిఫియా’ అని నామకరణం చేశారు. దీన్ని "ప్రవాసాన్ని ఆలస్యం చేసిన వ్యాధి (ఇమిగ్రేషన్ డిలే డిసీజ్) అని ఐటిన్ అనుకరించారు. స్విస్ మహిళను అమెరికాలోకి ప్రవేశించనివ్వకుండా ఆపింది కాబట్టి దీన్ని అలా పిలుస్తున్నామని ఆయన అన్నారు.

'ఇమిగ్రేషన్ డిలే డిసీజ్’ ఒక కుటుంబంలో కొన్ని తరాలవరకూ సంక్రమించే అవకాశం ఉంది.

అపు వాళ్ల చిన్నాన్న గోపేశ్ కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు. పాస్‌పోర్ట్ పొందడానికి ఆయనకు రెండేళ్లు పట్టిందని చెప్పారు.

"గత రెండేళ్లల్లో నాలుగైదుసార్లు ఢాకా వెళ్లి అక్కడి అధికారులను ఒప్పించాల్సి వచ్చింది. నాకు వేలి ముద్రలు లేవని వాళ్లకు పదే పదే చెప్పి ఒప్పించాల్సి వచ్చింది" అని గోపేష్ తెలిపారు.

గోపేశ్ పనిచేసే కార్యాలయంలో అధికారులు ఫింగర్‌ప్రింట్ సిస్టం ఏర్పాటు చేశారు. అంటే ఆఫీస్ తలుపులు తెరుచుకోవాలంటే వేలిముద్ర కావాలి. తన సమస్య గురించి పై అధికారులకు వివరించి, పాత పద్ధతిలోనే రోజూ సంతకం చేసి లోపలికి వస్తానని చెప్పి ఒప్పించారు.

అమల్, ఆపు

బంగ్లాదేశ్‌కు చెందిన ఒక డెర్మటాలజిస్ట్.. అపు కుటుంబానికి వచ్చిన సమస్యను 'పుట్టుకతో వచ్చిన పామోప్లాంటర్ కెరటోడెర్మా’గా గుర్తించారు. ఇది 'అడెర్మటాగ్లిఫియా ముదిరిన దశ’ అని ప్రొఫెసర్ ఐటిన్ తెలిపారు. ఈ వ్యాధి వలన అదనంగా చర్మం పొడిబారడం, అరచేతులు, అరికాళ్లల్లో చెమట పట్టకపోవడం జరుగుతుందని తేలింది. సర్కార్ కుటుంబ సభ్యులకు ఈ సమస్యలన్నీ ఉన్నట్లు కనుగొన్నారు.

సర్కార్ కుటుంబానికి అడెర్మటాగ్లిఫియా ఉన్నట్లు నిర్థరించడానికి మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరికి జన్యు పరీక్షలు నిర్వహించేందుకు డెర్మటాలజిస్టుల బృందం సిద్ధంగా ఉందని ప్రొఫెసర్ స్ప్రెచర్ తెలిపారు.

అయితే, ఈ పరీక్షలతో వారి సమస్య ఏమిటో కచ్చితంగా నిర్థరించవచ్చుగానీ దానిని తగ్గించే పరిష్కార మార్గమేమీ లేదు. వేలిముద్రలు లేకపోవడం వలన రోజువారీ జీవితంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులకు పరిష్కారం లేదని నిపుణులు అంటున్నారు.

ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోకుండానే అమల్ సర్కార్ జీవితం గడిచింది. కానీ తన పిల్లల జీవితం అలా సాగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి పరిస్థితిని అర్థం చేసుకోవాల్సింది పోయి సమాజం వారిని మరింత దూరంగా నెట్టేస్తోందని ఆయన అన్నారు.

"ఇది నా చేతుల్లో ఉన్నది కాదు. నాకు పుట్టుకతో వచ్చింది. కానీ నా పిల్లలు, నేను అన్ని రకాల ఇబ్బందులూ ఎదుర్కొంటున్నాం. ఇది చాలా బాధాకరం" అని అమల్ చెప్పారు.

ఆపు సర్కార్ తమ్ముడు అను

అమల్, ఆపులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక కొత్త నేషనల్ ఐడెంటిటీ కార్డ్ జారీ చేసింది. ఇందులో ఇతర బయోమెట్రిక్ డేటా… కంటి రెటీనా స్కాన్, ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్)లను పొందుపరిచారు.

అయితే, ఇప్పటికీ వారు మొబైల్ సిమ్ కార్డ్ కొనుక్కోలేరు. డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు. పాస్‌పోర్ట్ పొందాలంటే సంవత్సరాల తరబడి ప్రయత్నించాలి.

"నా పరిస్థితిని అందరికీ వివరించి చెప్పీ, చెప్పీ అలిసిపోయాను. నా సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించమని ఎందరినో అభ్యర్థించాను. కానీ ఎవరి దగ్గరా కచ్చితమైన సమాధానం లేదు. కోర్టుకు వెళ్లమని కొందరు సలహా ఇచ్చారు. ఇంక ఏ దారీ లేకపోతే కోర్టుకు వెళ్లక తప్పదు" అని అపు సర్కార్ అన్నారు.

తనకి ఎలాగైనా పాస్‌పోర్ట్ దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లాలని, ప్రపంచం చూడాలని ఆశపడుతున్నారు.

(ఫొటోలు: అపు కుటుంబం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
A family without fingerprints on their hands in Bangladesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X