వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాదేశ్‌లో దేవాలయాలపై దాడి తరువాత భయం నీడలో బతుకుతున్న హిందువులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ప్రాంతా చంద్ర దాస్

హిందువులు అందరిలాగే బానోలత కూడా దేవాలయం అంటే పవిత్రమైనది, సురక్షితమైనదని భావించారు.

అందుకే తన 21 ఏళ్ల కొడుకు ప్రాంతా చంద్ర దాస్ దేవాలయానికి వెళతానంటే ఆమె భయపడలేదు.

కాలేజీ చదువుతున్న ప్రాంతా దాస్ గత వారం బంగ్లాదేశ్‌లో నోవాఖలి జిల్లాలోని ఒక ఆలయంలో దుర్మరణం పాలయ్యారు.

ముస్లిం మెజారిటీ దేశంలో వందలాది మతఛాందసవాదులు ప్రాంతా దాస్‌ను కొట్టి చంపారు.

"నా చిన్న కొడుకు నాకు చాలా దగ్గర. నా బిడ్డ చనిపోయాక నాకింకేమీ మిగల్లేదు" అంటూ బానోలత విలపిస్తున్నారు.

బానోలత

కుమిల్లా పట్టణంలో దుర్గా పూజ మండపాల వద్ద ఖురాన్‌కు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో అక్కడ అల్లర్లు ప్రారంభమయ్యాయి.

ఈ అల్లర్లలో బానోలత కొడుకు ప్రాణాలు కోల్పోయారు.

సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించిన కొన్ని గంటల్లోనే కుమిల్లాలోని దుర్గా పూజ మండపాలపై ముస్లిం ఛాందసవాదుల గుంపు దాడి చేసింది.

వెంటనే బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా హింస మొదలైంది. దేవాలయాలను ధ్వంసం చేయడంతో పాటు హిందూ మైనారిటీ వర్గాలకు చెందిన ఇళ్లు, దుకాణాలకు నిప్పు పెట్టారు.

ఆ హింసాకాండలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. వారిలో ఇద్దరు హిందువులు. అనేకమంది గాయపడ్డారు.

అల్లరి మూకను అదుపు చేసేందుకు పోలీసులు అనేక చోట్ల బాష్పవాయువు ప్రయోగించారు. కాల్పులు జరిపారు.

ఇస్కాన్ ఆలయంపై దాడులు జరిగాయని తెలిసిన వెంటనే బానోలత కుటుంబం తమ కొడుకు కోసం తీవ్రంగా గాలించింది. మరుసటిరోజు, సమీపంలోని ఒక చెరువులో ప్రాంతా దాస్ మృతదేహం దొరికింది. ఆయన ఒళ్ళంతా గాయలతో నిండి ఉందని బానోలత తెలిపారు.

"మా ఇంటికి తిరిగి వెళ్లడానికి భయమేస్తోంది. మళ్లీ దాడులు జరుగుతాయని భయంగా ఉంది. ప్రస్తుతం నేను ఆలయంలోనే ఉంటున్నాను" అని బానోలత బీబీసీకి చెప్పారు.

నోవాఖలిలో ఇస్కాన్ ఆలయంపై జరిగిన దాడి

ఖురాన్‌ను అవమానించారంటూ దాడులు

సుమారు 16.5 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 9 శాతం కన్నా తక్కువే.

గతంలోనూ హిందువులపై పలుమార్లు దాడులు జరిగినా, ఇదే అతి పెద్ద మూక హింస అని కమ్యూనిటీ నాయకులు అంటున్నారు.

"హిందూ సమాజంపై ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి ఇది" అని కుమిల్లాలోని హిందూ ఉత్సవ కమిటీ హెడ్ అచింతా దాస్ అన్నారు.

ముస్లింల మత గ్రంథమైన ఖురాన్‌ను హిందువులు అవమానించారన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు.

ఆలయాలపై దాడులు జరిగిన మర్నాడు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఈ అల్లర్లను ఖండించారు. నేరస్థులను కచ్చితంగా పట్టుకుంటామని తెలిపారు.

"గతంలోనూ మేమిది చేశాం. భవిష్యత్తులో కూడా చేస్తాం. నేరస్థులకు తగిన శిక్ష పడాలి" అని ఆమె అన్నారు.

ప్రధాని హెచ్చరికలు జారీ చేసిన తరువాత కూడా బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు హింస పాకింది. మైనారిటీ వర్గాల్లో భయాందోళనలను రేకెత్తించింది.

ఒకానొక సమయంలో అల్లర్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం, దేశంలోని 22 జిల్లాల్లో భద్రతా దళాలను రంగంలోకి దింపింది.

నందారాణి, ఆమె పిల్లలు పొలాల్లో దాక్కుని తమ ప్రాణాలు కాపాడుకున్నారు

ఈ హింసాకాండ ప్రారంభమైన ఒక వారం తరువాత, ముస్లింల పవిత్ర స్థలాన్ని హిందువులు అవమానించారంటూ సోషల్ మీడియాలో మరో పోస్ట్ వైరల్ అయింది.

దాంతో, ఉత్తర బంగ్లాదేశ్‌లో పదుల సంఖ్యలో హిందువుల ఇళ్లకు నిప్పంటించారు.

"అల్లరి మూక సమీపిస్తోందని తెలియగానే, నా పిల్లలిద్దరినీ తీసుకుని పారిపోయాను. మేం వరిపొలాల్లో దాక్కున్నాం. అల్లరి మూక మా ఇంటికి నిప్పంటించడం అక్కడి నుంచి కనిపించింది. మా ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. మేమిప్పుడు గుడారాల్లో ఉంటున్నాం" అని రంగ్‌పూర్ జిల్లాలోని బీర్‌గంజ్‌కు చెందిన నందా రాణి బీబీసీకి తెలిపారు.

వందల మందిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ తెలిపారు.

"గతంలో వివిధ సమయాల్లో జరిగిన హింసాత్మక ఘటనల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని" ఆయన విలేఖరులతో అన్నారు.

మైనారిటీ వర్గాలపై హింసను వ్యతిరేకిస్తామని ఇస్లామిస్ట్ ఉద్యమ నాయకులు తెలిపారు.

"దేవాలయాలపై దాడి చేస్తున్నవారిని శిక్షించాలి. మనమంతా శాంతి, సామరస్యంతో జీవించాలి" అని ఇస్లామిస్ట్ రాజకీయ పార్టీ బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఆందోళన్ వైస్ చైర్మన్ మౌలానా ముజిబుర్ రెహమాన్ హమీది అన్నారు.

అయితే, ఇస్లాంను అవమానించినవారిని కఠినంగా శిక్షించాలని హమీదితో సహా ముస్లిం నేతలు బహిరంగంగా పిలుపునిచ్చారు.

ఉత్తర బంగ్లాదేశ్‌లోని బీర్‌గంజ్‌లో విధ్వంసకారులు ఇళ్లు తగలబెట్టారు

బంగ్లాదేశ్‌లో మత హింస

1971లో పాకిస్తాన్ నుంచి స్వతంత్రం పొందిన తరువాత, తమది లౌకిక రాజ్యమని బంగ్లాదేశ్ గర్వంగా చెప్పుకుంది.

ఆ దేశ రాజ్యాంగం ఇస్లాంకు జాతీయ మతం హోదాను ఇచ్చినప్పటికీ, లౌకిక సూత్రాలను సమర్థిస్తుంది.

కానీ, గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్‌లో అతివాద ఇస్లామిస్ట్ సమూహాల ప్రాముఖ్యం పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు.

పెరుగుతున్న మతఛాందసవాదాన్ని, అసహనాన్ని ఎదుర్కోవడంలో 2008 నుంచి అధికారంలో ఉన్న అవామీ లీగ్ విఫలమైందని వారు భావిస్తున్నారు.

"పరిమితులకు లోబడ్డ ప్రజాస్వామ్య పాలనలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఛాందసవాద శక్తులతో రాజీ పడింది" అని ప్రముఖ ఆర్థికవేత్త దేవప్రియ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.

"ఫలితంగా ఛాందవాదుల ప్రాముఖ్యం, గుర్తింపు, ప్రభావం పెరిగింది" అని ఆయన అన్నారు.

1947లో భారత, పాకిస్తాన్ విభజన మొదలుకొని భారత ఉపఖండంలో మతపరమైన హింసకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది.

బంగ్లాదేశ్‌కు స్వతంత్రం రాక మునుపు ఆ ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్‌గా వ్యవహరించేవారు.

1971లో రక్తసిక్తమైన యుద్ధం తరువాత పాకిస్తాన్ నుంచి ఆ దేశానికి విముక్తి లభించింది.

విభజన నీడలు ఇప్పటికీ దక్షిణ ఆసియా ప్రాంతాలను కమ్ముకునే ఉన్నాయి.

హింసకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి

"గత కొన్ని దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఓ క్రమపద్ధతిలో జరుగుతున్నాయి" అని బంగ్లాదేశ్‌లోని హిందు, బుద్ధిస్ట్, క్రిస్టియన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ రాణా దాస్‌గుప్త అన్నారు.

"బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లు, భూములు లాక్కోవడానికి ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం జరుగుతోంది. వాళ్లు దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నారు."

బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా 1947లో 30 శాతం ఉండేదని, ప్రస్తుతం 9 శాతం కన్నా తక్కువ ఉందని అక్కడి హిందూ నేతలు చెబుతున్నారు. చాలామంది భారతదేశం పారిపోయారు.

మైనారిటీలపై దాడుల పట్ల చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ వచ్చాయని మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

"మైనారిటీల రక్షణ విషయంలో, సరైన విచారణ జరుపకపోవడం ఒక వ్యూహాన్ని, నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. శిక్షలు పడకపోవడం, సమర్థంగా చర్యలు తీసుకోకపోవడం మత హింస కొనసాగడానికి కారణాలు" అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దక్షిణాసియా ప్రచారకర్త సాద్ హమ్మదీ అభిప్రాయపడ్డారు.

మైనారిటీలపై దాడుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదన్న విమర్శలను బంగ్లాదేశ్ న్యాయ శాఖ మంత్రి అనిసుల్ హఖ్ కొట్టిపారేశారు.

"అన్ని ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. కొన్ని సార్లు కొంత ఎక్కువ సమయం పడుతుంది. దర్యాప్తు వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం" అని హఖ్ బీబీసీతో అన్నారు.

ఇస్లామిస్టులను తృప్తిపరిచే విధంగా ప్రభుత్వం నడుచుకుంటోందన్న ఆరోపణలను కూడా హఖ్ తిరస్కరించారు.

"అలాంటి అభిప్రాయాలేవీ నిజం కావు. అన్ని మతాల ప్రజలు సామరస్యంతో జీవించాలని మేం కోరుకుంటున్నాం."

హింస తర్వాత సాయుధ పోలీసులు హిందూ మందిరాలకు రక్షణ కల్పించారు

భారతదేశ ప్రభావం

పొరుగున ఉన్న భారతదేశంలో జాతీయవాద బీజేపీ నాయకత్వంలో ముస్లిం వ్యతిరేక ధోరణులు పెరుగుతుండడం, బంగ్లాదేశ్‌లోని అతివాద ముస్లింలను ఆగ్రహానికి గురిచేస్తోందని, ఆ దేశంలో హిందువులపై దాడులకు అది కొంత కారణమని కొందరు భావిస్తున్నారు.

బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల తాకిడి పెరుగుతుందనే భయానికి బీజేపీ నిప్పు రాజేసింది. ఫలితంగా ఢాకాలో ఆగ్రహం వెల్లువెత్తింది.

మరో పక్క ప్రవాసీయులను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించేయాలని భారతదేశంలోని హిందూ అతివాదులు పిలుపునిచ్చారు.

"భారతదేశంలో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా విచారకరం. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను పీడించడానికి కొందరు దీన్ని సాకుగా వాడుకుంటున్నారు" అని భట్టాచార్య అన్నారు.

"తమ దేశంలోని పౌరులందరినీ ఒకే రకంగా గౌరవించడం, వారి హక్కులను కాపాడుతూ, భద్రత కల్పించడం అన్ని ప్రభుత్వాల బాధ్యత" అని ఆయన అన్నారు.

అదనపు రిపోర్టింగ్: ఢాకా నుంచి సల్మాన్ సయీద్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bangladesh:After attacks on hindu temples, Hindu people are living in fear
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X