కనిపిస్తే కాల్చివేత.. బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది..?
బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పదవీచ్యుతురాలైన ప్రధానమంత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) తీర్పు వెలువడబోతోన్న నేపథ్యంలో దాడులు చోటు చేసుకుంటోన్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. అవామీ లీగ్, ఆ పార్టీ కార్యకలాపాలను యునుస్ ప్రభుత్వం నిషేధించినప్పటికీ.. ఈ బంద్‌కు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. రాజధాని ఢాకాలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆవామీ లీగ్ బలంగా ఉండే చోట్ల పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు సంభవిస్తోన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలపై దాడులు సాగుతోన్నాయి. ఢాకాలో ఆదివారం సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సైతం సంభవించడం.. అక్కడ నెలకొన్న పరిస్థితుల తీవ్రతకు అద్దం పట్టాయి.

ఈ పరిణామాల మధ్య.. షేక్ హసీనా ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ్యాప్తంగా నిరసనలను మరింత ఉధృతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఢాకాలో ప్రభుత్వ సలహాదారు సయ్యదా రిజ్వానా హసన్ నివాసం ముందు రాత్రి 9 గంటల సమయంలో రెండు బాంబులు పేలాయి. మరో పేలుడు కార్వాన్ బజార్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేదు.
ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ షేక్ మహమ్మద్ సజ్జాద్ అలీ, హింసకు పాల్పడేవారిపై, ముఖ్యంగా పోలీసులపై దాడి చేసేవారిపై కాల్పులు జరపాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కోర్టు తీర్పునకు ముందు ఢాకా అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కాల్చివేయాలని సూచించారు. షూట్ అట్ సైట్ ఆదేశాలను జారీ చేశారు. రాత్రంతా కూడా ఢాకాలో ఉద్రిక్తత కొనసాగింది.
ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ నేడు తీర్పు వెలువరించనుంది. షేక్ హసీనా, మాజీ హోమ్ మంత్రి అసదుజ్జామాన్ ఖాన్ కమల్, మాజీ పోలీసు జనరల్ ఇన్‌స్పెక్టర్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్‌పై జూలై-ఆగస్టులో జరిగిన విద్యార్థి ఆందోళనల సందర్భంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై అక్టోబర్ 23వ తేదీన వాదనలు ముగిశాయి. షేక్ హసీనాపై ఉన్న ఈ కేసు 2024 జులై- ఆగస్టు మధ్య సంభవించిన హింసాత్మక నిరసనలకు సంబంధించినది.












Click it and Unblock the Notifications