భారత్‌కు రానున్న బంగ్లా ప్రధాని?.. షేక్ హసీనా అంశంపై బిగ్ ట్విస్ట్!
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారని శుక్రవారం రాష్ట్రపతి భవన్ సచివాలయం జారీ చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయనకు అధికారిక స్వాగతం పలికేందుకు రాష్ట్రపతి భవన్ సచివాలయం శనివారం పూర్తిస్థాయి రిహార్సల్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ రిహార్సల్స్ కారణంగా ఆగస్టు 22న జరగాల్సిన 'గార్డ్ మార్పు'(చేంజ్ ఆఫ్ గార్డ్స్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి లాంఛనప్రాయ స్వాగతం కోసం పూర్తిస్థాయి రిహార్సల్స్ జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చాక తొలిసారిగా..
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినప్పటి నుండి, ఆయన భారతదేశ పర్యటనపై అంచనాలు నెలకొన్నాయి.ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌లో తారిక్ రెహమాన్ అధికారం చేపట్టినప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు, ఆయన కుటుంబానికి భారతదేశాన్ని సందర్శించమని ఆహ్వానిస్తూ లేఖ రాశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. సెప్టెంబరులో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాల్సిందిగా భారత్ బంగ్లాదేశ్ ప్రధానిని కూడా ఆహ్వానించింది. అయితే, బంగ్లాదేశ్ నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రాలేదు. కొన్ని దౌత్యపరమైన అంశాల వల్ల ఇప్పటివరకు ఈ పర్యటన వాయిదా పడుతూ వచ్చింది.

షేక్ హసీనా అంశమే ప్రధాన అడ్డంకి!
తారిఖ్ రెహమాన్ భారత పర్యటనకు ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద అడ్డంకి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా ఇండియాలో ఉండటమే.భారత్ నుండి ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. షేక్ హసీనా ఇటీవల తన వ్యక్తిగత హోదాలో పత్రికలతో మాట్లాడటాన్ని కూడా బంగ్లాదేశ్ తీవ్రంగా వ్యతిరేకించింది.షేక్ హసీనా ఇండియాలో ఉన్నందున బంగ్లాదేశ్‌లోని పలు వర్గాలు తారిఖ్ రెహమాన్ భారత పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి. ఇండియాలో ఉంటూ షేక్ హసీనా చేసే రాజకీయ కామెంట్స్ పై బంగ్లాలోని కఠినవాద వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం తేలే వరకు భారత పర్యటన వద్దని బంగ్లా ప్రధానిపై సొంత దేశంలో తీవ్ర ఒత్తిడి ఉంది.
దౌత్యపరమైన అడుగులు
తన దేశీయ రాజకీయాల కారణంగా తారిఖ్ రెహమాన్ ఇప్పటివరకు తన భారత పర్యటనపై ఎలాంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయారు . అయితే రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు స్వాగతం పలికేందుకు జరుగుతున్న ఏర్పాట్లను చూస్తుంటే, ఏదైనా నిర్దిష్టమైన దౌత్యపరమైన చొరవ కోసం అంతర్గతంగా గట్టి ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తోంది.













Click it and Unblock the Notifications