గుడ్‌న్యూస్: చిన్నపిల్లకూ వ్యాక్సిన్ -100శాతం సమర్థత -ఫైజర్ కంపెనీ సంచలన ప్రకటన
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుండగం, కొత్త కేసులు, మరణాలు అమాంతం పెరిగిపోతుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొన్నవేళ అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా సంస్థ గుడ్ న్యూస్ వెల్లడించింది. జర్మన్ ఫార్మా దిగ్గజం బయోఎన్ టెక్ తో కలిసి ఫైజర్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ చిన్నపిల్లలపైనా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.
జగన్ సర్కార్ మరో భూదందా -ఇళ్ల పట్టాల అసలు కథ -నిమ్మగడ్డకు హ్యాట్సాఫ్: వైసీపీ ఎంపీ రఘురామ

12-15 ఏళ్ల పిల్లలకు సక్సెస్
కొవిడ్ టీకాలకు సంబంధించి ఫైజర్ సంస్థ తాజాగా కీలక ప్రకటన చేశాయి. అమెరికాతో పాటు పలు దేశాల్లో తాము అందుబాటులోకి తెచ్చిన టీకాలు చిన్న పిల్లల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా 12-15 ఏళ్ల వయసు పిల్లల్లో టీకా వందశాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఈ వయసు వారికి టీకా ఇచ్చేందుకు అనుమతి కోసం నియంత్రణ సంస్థలను సంప్రదిస్తామని ఫైజర్-బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

ప్రస్తుతానికి 16ఏళ్లు దాటిన వారికే
వ్యాక్సిన్ల తయారీలో తొలి నుంచీ ముందు వరుసలో ఉండి, అమెరికాలో మొదటిగా ఆమోదం పొందిన ఫైజర్ టీకా.. దాదాపు 65దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆ టీకాను ఇప్పటి దాకా 16ఏళ్ల వయసుపైబడిన వారికి ఇచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఫైజర్ టీకా 90శాతానికి పైగా సమర్థత కలిగినట్లు పలు నివేదికల్లో వెల్లడైంది. క్లినికల్ ప్రయోగాలు కాకుండా ఇజ్రాయెల్‌లో ఈ టీకాను నేరుగా 12లక్షల మందికి ఇవ్వగా, అక్కడ కూడా 94శాతం సమర్థత కలిగినట్లు తేలింది. ఇదే సమయంలో చిన్నారుల కోసం టీకా తెచ్చేందుకు ఫైజర్ ప్రయత్నాలు కొనసాగించింది. ఈ క్రమంలో..

100 శాతం సమర్థతతో జోష్..
చిన్నపిల్లకూ టీకాను అందుబాటులోకి తేవాలనుకున్న ఫైజర్ సంస్థ ఇందుకోసం అమెరికాలో 12-15ఏళ్ల వయసున్న 2600 మంది పిల్లలపై మూడోదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. అనంతరం వారిలో 100శాతం సమర్థత చూపించడంతో పాటు బలమైన యాంటీబాడీ ప్రతిస్పందనలు గుర్తించినట్లు వెల్లడించింది. దీంతో 12-15ఏళ్ల వయసు వారికీ వ్యాక్సిన్ అనుమతి కోసం త్వరలోనే యూఎస్ ఎఫ్‌డీఐని సంప్రదిస్తామని ఫైజర్ ప్రకటించింది. అంతేకాదు..

త్వరలో 5ఏళ్ల పిల్లలకూ టీకాలు
12-15 సంవత్సరాల వయసు వారిపై చేసిన టీకా ప్రయోగాలు 100 శాతం సక్సెస్ కావడంతో ఫైజర్ సంస్థ తన తదుపరి ప్రయోగాలను ముమ్మరం చేసింది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగాలను కూడా ఫైజర్ ఈమధ్యే మొదలుపెట్టింది. వీరితో పాటే మరికొన్ని వారాల్లోనే ఐదేళ్లలోపు చిన్నారులకు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫైజర్ ప్రయోగాలు సక్సెస్ అయి, మిగతా కంపెనీలు కూడా చిన్నపిల్లకు టీకాలను తీసుకొస్తే దాదాపు కరోనా ముప్పు తొలిగినట్లవుతుంది. ప్రస్తుతం చాలా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోడానికి వయోపరిమితిని 18ఏళ్లుగా నిర్ధారించారు. కాగా, భారత్ లో ఫైజర్ సహా రష్యా తయారీ స్పుత్నిక్ వ్యాక్సిన్ కూ అనుమతులను పరిశీలిస్తున్నది. ప్రతస్తుతం మన దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్లు అందించాలని కేంద్రం తాజాగా ఆదేశాలిచ్చింది.