విషాదం: పడవ మునిగి, 37మంది శరణార్థుల మృతి
అంకారా: మరో విషాద ఘటన చోటు చేసుకుంది. టర్కీ నుంచి గ్రీసు వెళుతున్న శరణార్థుల నాటుపడవ ఏజీయన్ సముద్రంలో బోల్తాపడినప్పుడు 37 మంది మరణించారని టర్కీ అధికార వార్తాసంస్థ అనదోలు న్యూస్ వెల్లడించింది. మృతులలో ఐదుగురు చిన్నపిల్లలున్నారు.
వారంతా గ్రీకు దీవి లెస్బోస్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీరప్రాంత రక్షకదళం పడవలోని 75 మందిని కాపాడగలిగింది. పడవలోని శరణార్థులు ఆప్ఘనిస్థాన్, సిరియా, మయన్మార్ దేశాలకు చెందినవారున్నారు.
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు టర్కీ నుంచి గ్రీసుకు నాటుపడవల్లో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై మరణించిన శరణార్థుల సంఖ్య 218కి పెరిగింది.

కొలరాడోలో కాల్పులు, కత్తిపోట్లు: వ్యక్తి మృతి
లాస్ఏజెల్స్: కాల్పులు, కత్తిపోట్లకు గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన కొలరాడాలో చోటు చేసుకుంది. పశ్చిమ అమెరికాలోని భారీ ఎత్తున మోటర్ సైకిల్ షో నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
భారీ సంఖ్యలో షోకు జనాలు తరలిరావడం, అదే సమయంలో ఈ ఘటన జరగడంతో తొక్కిసలాట కూడా సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు మాత్రం బైక్ పై వస్తూ తరుచుగా దాడులకు పాల్పడినవారే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications