భారత్ ఒంటరి కాదు.. కష్ట కాలంలో అండగా కదిలిన దేశాలు.. కరోనాపై ఫైట్‌కు ఇదీ అంతర్జాతీయ మద్దతు...
కరోనా సెకండ్ వేవ్‌తో విలవిల్లాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్‌కు తాము ఎలా అండగా ఉండగలమో చూస్తున్నామని చెప్పింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం(ఏప్రిల్ 22) నుంచి భారత్‌పై బ్రిటన్ ట్రావెల్ బ్యాన్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ఈ ప్రకటన చేశారు. బహుశా బ్రిటన్ నుంచి వెంటిలేటర్లు,మందులు ఇతరత్రా మెడికల్ అవసరాలకు సంబంధించిన సాయం భారత్‌కు అందే అవకాశం ఉంది. బ్రిటన్‌తో పాటు అమెరికా,ఆస్ట్రేలియా,జర్మనీ,యూరోపియా సైతం భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి.

భారత్‌పై బ్రిటన్ ట్రావెల్ బ్యాన్...
భారత్‌ను బ్రిటన్ ప్రస్తుతం రెడ్ లిస్టులో పెట్టింది. భారత్ నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా నిషేధించింది. భారత్ నుంచి తిరిగొచ్చినవారు తప్పనిసరిగా 10 రోజుల పాటు హోటల్ క్వారెంటైన్‌లో ఉండాలని సూచించింది. ఏప్రిల్ 14 వరకూ బ్రిటన్‌లో 55 డబుల్ మ్యుటెంట్ ఇండియన్ వేరియంట్ వైరస్ నమూనాలను గుర్తించిన నేపథ్యంలో భారత్‌కు రాకపోకలపై బ్రిటన్ నిషేధం విధించింది. ప్రస్తుతం డబుల్ మ్యుటెంట్ ఇండియన్ వేరియంట్‌పై అక్కడి నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ వేరియంట్స్ ఎంత వేగంగా వ్యాప్తి చెందగలవు... ఎంతవరకు ప్రాణాంతకమైనవి... ఏ మేర మందులకు,చికిత్సకు లొంగుతాయి వంటి అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.

ఆందోళన చెందుతున్న భారతీయ విద్యార్థులు...
గురువారం సాయంత్రం భారత్ నుంచి బ్రిటన్‌లో చివరి ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఆ తర్వాత మరో 8 విమానాల ల్యాండింగ్‌కి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ బ్రిటన్ అందుకు నిరాకరించింది. శుక్రవారం(ఏప్రిల్ 22) వరకు భారత్ నుంచి బ్రిటన్ తిరిగొచ్చిన ప్రయాణికులంతా తప్పనిసరిగా 10 రోజుల పాటు ప్రభుత్వ అనుమతి పొందిన హోటళ్లలో క్వారెంటైన్‌లో ఉండాలని సూచించింది. ఇందుకోసం దాదాపు 2వేల పౌండ్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. దీంతో భారత్ నుంచి బ్రిటన్ వెళ్లిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో క్వారెంటైన్ వ్యయం తగ్గింపుపై అక్కడి అధికారులతో భారతీయ విద్యార్థుల ప్రతినిధి బృందం సంప్రదింపులు జరుపుతోంది.

భారత్‌కు అమెరికా అండ...
బ్రిటన్‌తో పాటు అమెరికా,ఫ్రాన్స్,ఆస్ట్రేలియా,జర్మనీ దేశాలు కూడా భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. 'భారత్‌లో హృదయవిదారక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కష్టకాలంలో మా ఆలోచనలు భారత్ వెంటే ఉంటాయి. కరోనాపై పోరులో మేము భారత్‌కు అండగా నిలబడుతాం...' అని అమెరికా హెల్త్ సెక్రటరీ మాట్ హన్‌కాక్ తెలిపారు. వైట్ హౌస్ ప్రతినిధి జెన్ సాకి మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌తో అటు రాజకీయంగా ఇటు నిపుణులపరంగా సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ సంక్షోభ కాలంలో భారత్‌కు అవసరమైన సాయాన్ని అందించే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు.

సాయం చేసేందుకు ముందుకొచ్చిన మరిన్ని దేశాలు...
'భారత్‌కు మేము ఎమర్జెన్సీ రిలీఫ్ సప్లై అందించాం. అలాగే ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయ వైద్య అధికారులకు అవసరమైన శిక్షణ అందించనున్నాం. ఈ కష్టకాలంలో భారత్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ సంప్రదింపులు జరుపుతున్నాం.' అని జెన్ సాకి తెలిపారు.అటు ఫ్రాన్స్ కూడా భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ కష్ట కాలంలో భారత్‌కు అండగా ఉంటామని చెప్పింది. యూరోపియన్ యూనియన్ కూడా భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సహాయ సహకారాలు అవసరమని జర్మనీ పేర్కొంది. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను తాము కూడా పంచుకుంటామని చెప్పింది. భారత్‌కు సహాయ సహకారాలు అందించేందుకు తామూ సిద్దమని ఆస్ట్రేలియా కూడా ప్రకటించింది.












Click it and Unblock the Notifications