ట్రంప్ బెదిరింపులపై బ్రిక్స్ దేశాల వ్యూహం.. డాలర్‌పై కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే అవకాశం ఉన్న భారీ సుంకాలను ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు చురుకుగా స్పందిస్తున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ట్రంప్ టారిఫ్ విధానాలపై చర్చించడానికి ఒక వర్చువల్ సమ్మిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశం ట్రంప్ బెదిరింపులు పెరుగుతున్న సమయంలో జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్రిక్స్, డాలర్, ఉమ్మడి కరెన్సీపై బ్రెజిల్ వైఖరి
బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా చేసిన ప్రకటనల ప్రకారం.. బ్రిక్స్ దేశాలు డాలర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టమైంది. ఆయన మాట్లాడుతూ.."మేము డాలర్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయాలనుకోవడం లేదు. అది ఒక ముఖ్యమైన కరెన్సీగా మేము భావిస్తాము. బ్రిక్స్ దేశాల మధ్య వర్తకం కోసం ఒక ఉమ్మడి కరెన్సీని రూపొందించే ఆలోచన ఉంది. కానీ దీనిపై ఇంకా పరిశోధన జరగాలి." అని బ్రెజిల్ అధ్యక్షుడు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ ప్రయత్నం డాలర్‌ను బలహీనపరచడం కోసం కాదని, కేవలం వ్యాపార సౌలభ్యం కోసం మాత్రమేనని బ్రెజిల్ స్పష్టం చేసింది.

ట్రంప్ బెదిరింపులు.. భారత వైఖరి
ఈ మొత్తం వ్యవహారంపై భారత వైఖరిని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. భారత్ బ్రిక్స్ కూటమిలో ఒక సభ్యదేశంగా కొనసాగుతుందని, ఉమ్మడి ప్రయోజనాలపై ఇతర సభ్య దేశాలతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. డాలర్‌కు వ్యతిరేకంగా భారత్‌కు ఎలాంటి ఎజెండా లేదని విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
ట్రంప్ బెదిరింపులు
గత జనవరిలో ట్రంప్ బ్రిక్స్ దేశాలకు తీవ్ర హెచ్చరిక చేశారు. ఒకవేళ బ్రిక్స్ దేశాలు డాలర్‌ను దాటవేయడానికి ఉమ్మడి కరెన్సీని రూపొందించడానికి ప్రయత్నిస్తే.. వాటిపై 100 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించారు. ఈ బెదిరింపులు మినహాయింపు లేకుండా అందరికీ వర్తిస్తాయని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో బ్రిక్స్ దేశాల మధ్య జరిగే ఈ వర్చువల్ సమ్మిట్ జరగనుంది. ఇదిలా ఉండగా.. బ్రిక్స్ దేశాలు అమెరికా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాయో, భవిష్యత్తులో తమ ఆర్థిక విధానాలను ఎలా రూపొందించుకుంటాయో చూడాలి.












Click it and Unblock the Notifications