కరోనా వైరస్ 4 వేల వేరియంట్లు..బ్రిటీష్ మంత్రి సంచలనం: వ్యాక్సిన్ అన్నిటికీ పని చేస్తుందా అన్న ఆనుమానం
ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి బారినుండి ప్రపంచాన్ని కాపాడటం కోసం అన్ని దేశాలు యుద్ధప్రాతిపదికన చర్యలకు దిగాయి. ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి . ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సైతం కొనసాగుతోంది. ఇదే సమయంలో బ్రిటిష్ మంత్రి ఆసక్తికరమైన, సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.

కరోనా మహమ్మారికి కారణమైన వైరస్ 4000 వేరియంట్లు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారికి కారణమైన వైరస్ 4000 వేరియంట్లు ఉన్నాయని, ఇప్పటికే టీకాలు అభివృద్ధి చేసిన ఫార్మా సంస్థలు వాటిని మరింత మెరుగు పరిచే ప్రయత్నం చేస్తున్నాయని బ్రిటిష్ మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఫైజర్ ఇంక్ మరియు ఆస్ట్రాజెనెకా పిఎల్‌సితో సహా అన్ని వ్యాక్సిన్ తయారీదారులు తమ టీకాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారని బ్రిటిష్ మంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ 19 కు కి కారణమయ్యే కరోనావైరస్ రకానికి చెందిన వేలాది వైవిధ్యాల వైరస్ ఉత్పరివర్తన చెందుతోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

కరోనా కొత్త వేరియంట్లకు తగ్గట్టుగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఫార్మా సంస్థలు
ఇప్పటికే బ్రిటిష్, దక్షిణాఫ్రికా మరియు బ్రెజిలియన్ వేరియంట్లను గుర్తించారు. ఇవి మొదటి వచ్చిన కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా వెల్లడించారు. ఫైజర్-బయోటెక్, మోడెర్నా, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా మరియు ఇతరులు తమ వ్యాక్సిన్‌ను మార్పు చెందుతున్న జన్యు ఉత్పరివర్తనాలకు తగ్గట్టుగా మార్పు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు . ఏదైనా వేరియంట్‌కు వ్యాక్సిన్ పని చేసేలా వాటిని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారని పేర్కొన్నారు..

జీనోమ్ సీక్వెన్సింగ్ లో అన్ని వేరియంట్ల లైబ్రరీ .. ఏ సవాల్ కైనా సిద్ధం అన్న బ్రిటీష్ మంత్రి
కరోనా వైరస్ ఉత్పరివర్తన జరిగే వేలాది వైవిధ్యాలు ఉన్నా కొత్త కరోనా స్ట్రెయిన్స్ పుట్టినప్పటికీ, తక్కువ సంఖ్యలోనే ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టాయని వాటిని సైతం ఎదుర్కొనేలా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నట్లుగా బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో పేర్కొన్నారు. బ్రిటిష్ మంత్రి అతిపెద్ద జీనోమ్ సీక్వెన్సింగ్ పరిశ్రమ యూకేలో ఉందని, ప్రపంచంలోని జీనోమ్ సీక్వెన్సింగ్ పరిశ్రమలో తమకు 50% ఉందని అన్ని వేరియంట్ల లైబ్రరీని ఉంచుతున్నామని ఏ సవాలుకైనా ప్రతిస్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.