యూనివర్శిటీలో కాల్పులు: ఇద్దరు విద్యార్థులు మృతి: ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుండగా..
అమెరికా రోడ్ ఐలాండ్ ప్రావిడెన్స్ లోని ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఐవీ లీగ్ క్యాంపస్‌లో పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్ల దుస్తుల్లో ఉన్న ఓ షూటర్ ఈ కాల్పులకు పాల్పడ్డాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎఫ్బీఐని ఆదేశించినట్లు వెల్లడించారు.
బ్రౌన్ యూనివర్సిటీ.. సుమారు 7,300 మంది అండర్ గ్రాడ్యుయేట్, 3,000 మందికి పైగా గ్రాడ్యుయేట్ విద్యార్థులతో కూడిన ఓ ప్రైవేట్ విద్యాసంస్థ. కాల్పులు.. యూనివర్శిటీ క్యాంపస్ పరిధిలోని బారస్ అండ్ హోలీ భవనంలో చోటు చేసుకున్నాయి. ఇది ఏడతస్తుల కాంప్లెక్స్. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉన్నాయి. 100కు పైగా ల్యాబొరేటరీలు, డజన్ల కొద్దీ తరగతి గదులు, కార్యాలయాలు ఉన్నాయి. ఇంజినీరింగ్ డిజైన్ ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో కాల్పులు జరిగాయి.

కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు పారిపోవడంతో క్యాంపస్‌ను పూర్తిగా లాక్‌డౌన్ చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రొవిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. ఐవీ లీగ్ క్యాంపస్ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఫెడరల్ అధికారులు, ఎమర్జెన్సీ సిబ్బంది చేరుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎఫ్‌బీఐని రంగంలోకి దించినట్లు తెలిపారు. బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ (ఏటీఎఫ్) ఏజెంట్లు కూడా దర్యాప్తుల్లో భాగస్వాములయ్యారు. నల్ల రంగు దుస్తులు ధరించిన అనుమానితుడు చివరిసారిగా భవనం నుండి బయటకి వెళ్తుండగా తమకు కనిపించినట్లు విద్యార్థులు తమకు సమాచారం ఇచ్చినట్లు ప్రావిడెన్స్ డిప్యూటీ పోలీస్ చీఫ్ టిమోతీ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తోన్నామని అన్నారు.
కాల్పులతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎవ్వరూ బయటికి రావొద్దని పోలీసులు సూచించారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు జాగ్రత్తగా ఉండాలని కోరారు. క్యాంపస్ మొత్తాన్ని కూడా ఎఫ్బీఐ, పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరణించిన విద్యార్థుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications