వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుడాపెస్ట్ మెమోరాండం: మూడు దశాబ్దాల కిందట యుక్రెయిన్ తన అణు ఆయుధాలన్నింటిని రష్యాకు ఎందుకు అప్పగించింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఫిబ్రవరి 25న రష్యాను ఎదుర్కొనేందుకు యుద్దభూమికి వెళుతున్న యుక్రేనియన్ ట్యాంక్

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా, రష్యాల తర్వాత ఈ భూమి మీద మూడో అతి పెద్ద అణుశక్తి ఏ బ్రిటనో, ఫ్రాన్సో, చైనానో కాదు. యుక్రెయిన్.

1991లో సోవియట్ యూనియన్ (యుఎస్ఎస్ఆర్) పతనంతో, స్వతంత్ర దేశంగా ఏర్పడిన యుక్రెయిన్ తన భూభాగంలో మాస్కో వదిలిపెట్టిన సుమారు 3,000 అణ్వాయుధాలను వారసత్వంగా పొందింది. కానీ, మూడు దశాబ్దాల తరువాత, యుక్రెయిన్ అణ్వాయుధాలు లేని దేశంగా మారింది.

ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా దాడి తర్వాత ఆ దేశం క్లిష్టమైన స్థితిలో ఉంది. నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) శక్తులు జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించడంతో యుక్రెయిన్ పరిస్థితి మరింతగా దిగజారింది.

మరి ఒకప్పుడు మూడో అతి పెద్ద అణ్వాయుధ దేశంగా ఉన్న యుక్రెయిన్ ఇప్పుడు ఇంత నిస్సహాయంగా మారడానికి కారణమేంటి? గత మూడు దశాబ్ధాలలో ఏం జరిగింది?

ఈ ప్రశ్నలకు యుక్రెయిన్ దగ్గర ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నట్లయితే అది తనపై జరుగుతున్న దాడిని నిరోధించగలిగేదా ? ఇప్పుడు జరుగుతున్న యుద్ధం న్యూక్లియర్ వార్ గా మారే ప్రమాదం ఉందా? యుక్రెయిన్ అణ్వాయుధాలు కొనడానికి ప్రయత్నించిందన్న రష్యా ఆరోపణల్లో నిజమెంత అన్న సందేహాలు కూడా తోడవుతున్నాయి.

ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైంది

బుడాపెస్ట్‌లో ఒప్పందం

1990లలో భద్రత, స్వతంత్ర దేశంగా గుర్తింపు కోసం తన భూభాగంలో మిగిలిపోయిన అణ్వాయుధాలను వదులుకోవాలని నిర్ణయించుకుంది యుక్రెయిన్. సోవియట్‌ యూనియన్ నుంచి విడివడిన తర్వాత రష్యా, యూకే, యుక్రెయిన్, అమెరికా దేశాల మధ్య జరిగిన బుడాపెస్ట్ మెమోరాండం అనే ఒప్పందంలో ఇప్పటి ఘర్షణకు కూడా వర్తించే అనేక షరతులు ఉన్నాయి.

1994లో హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా యుక్రెయిన్ అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక (ఎన్‌పీటీ) ఒప్పందానికి కట్టుబడేందుకు సిద్ధమైంది. తన భూభాగంలో సోవియట్ రష్యా వదిలేసిన వార్‌హెడ్‌లను తిరిగి మాస్కోకు ఇవ్వడానికి పూనుకుంది.

''యుఎస్ఎస్ఆర్ పతనంతో సోవియట్ అణ్వాయుధాలలో కొన్ని తూర్పు ఐరోపా దేశాలలో మిగిలిపోయాయి. అవి దుర్వినియోగమవుతాయని, ఐరోపాను ప్రమాదంలో పడేస్తాయని పశ్చిమ దేశాలు ఆందోళన చెందాయి'' అని యూనివర్సిటీ ఆఫ్ సావోపాలో లోని ఏషియన్ స్టడీస్ లేబరేటరీలో రాజనీతి శాస్త్రవేత్త, రీసెర్చర్ విన్సెంట్ ఫెరారో జూనియర్ బీబీసీతో అన్నారు.

యుక్రెయిన్ అణు నిరాయుధీకరణకు ఒప్పుకున్నందుకు బదులుగా రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలు యుక్రెయిన్ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తాయి. భవిష్యత్తులో ఆ దేశంపై ఎవరైనా దాడులు చేస్తే వాటిని అడ్డుకుంటామని హామీనిచ్చాయి.

అప్పుడే స్వాతంత్ర్యం పొందిన యుక్రెయిన్‌కు ఒక దేశంగా ప్రపంచం గుర్తింపు అత్యవసరం. ఈ లక్ష్యం కోసం ఒప్పందంపై సంతకం చేసిన యుక్రెయిన్, 1996 నాటికి తన భూభాగంలో ఉన్న అణ్వాయుధాలన్నింటినీ రష్యాకు అప్పగించింది. ఇవే షరతులతో బెలారస్, కజకిస్తాన్‌లు కూడా బుడాపెస్ట్ మెమోరాండంపై సంతకం చేశాయి.

యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ

"ఆయుధాలు లేవు, భద్రత లేదు"

సెవాస్టోపోల్‌లో నౌకా స్థావరం, క్రైమియాపై దాడి ద్వారా 2014లో రష్యా బుడాపెస్ట్ మెమోరాండాన్ని ఉల్లంఘించిందని యుక్రెయిన్ ఆరోపించింది.

అదే సంవత్సరం తన భూభాగానికి తూర్పు సరిహద్దుల్లో ఉన్న దోన్యస్క్, లూహాన్స్క్ ప్రావిన్సులలో తిరుగుబాటు చేస్తున్న వేర్పాటువాద గ్రూపులకు మద్దతివ్వడం ద్వారా రష్యా బుడాపెస్ట్ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించిందని యుక్రెయిన్ అన్నది.

ఈ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో ఇప్పటికే 14,000 మందికి పైగా మరణించారు. యుక్రేనియన్ భూభాగంపై రష్యా దాడి ముప్పు 2022 ప్రారంభంలో స్పష్టంగా కనిపించినందున, అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ నేతృత్వంలోని యుక్రేనియన్ ప్రభుత్వం మరోసారి బుడాపెస్ట్ మెమోరాండాన్ని గుర్తు చేసింది. కానీ, సంప్రదింపులకు సమయం లేదు. ఫిబ్రవరి 24న రష్యా దాడి ప్రారంభమైంది.

బుడాపెస్ట్ మెమోరాండంపై యుక్రేనియన్ అధ్యక్షుడు చివరిసారిగా చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన చర్యలను సమర్థించుకోవడానికి ఉపయోగించుకున్నారు.

అమెరికా సహాయంతో అణ్వాయుధ సంపత్తిని పొందడానికే యుక్రెయిన్ ఈ ఒప్పందం నుండి వైదొలగుతున్నట్లు రష్యా అధ్యక్షుడు ఒక ప్రసంగంలో ఆరోపించారు. రష్యా అధ్యక్షుడి అభిప్రాయం ప్రకారం యుక్రెయిన్ అణ్వాయుధాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. దీని వల్ల రష్యా ప్రజల భద్రత ప్రమాదంలో పడింది.

"పుతిన్ ప్రకటనలు పూర్తిగా అబద్ధం. యుక్రెయిన్‌ను అణ్వాయుధ దేశంగా మార్చడంపై అమెరికాకు ఏ మాత్రం ఆసక్తి లేదు" అని యూనివర్సిటీ ఆఫ్ వాటర్‌లూ (కెనడా)లో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్, అణు భద్రత నిపుణుడు అలెగ్జాండర్ లానోస్కా అన్నారు.

"ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణు ఆయుధాగారాన్ని విడిచిపెట్టినందుకు బదులుగా యుక్రెయిన్ అనేక భద్రతా హామీలను పొందింది. ఇప్పుడు మా వద్ద ఆయుధాలు లేవు, భద్రత కూడా లేదు'' అని ఫిబ్రవరి 19న చేసిన ప్రసంగంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ అన్నారు.

"బుడాపెస్ట్ మెమోరాండంపై సంతకం చేసిన దేశాలతో సంప్రదింపులు జరపడానికి 2014 నుంచి యుక్రెయిన్ మూడుసార్లు ప్రయత్నించింది. అవి ఫలించలేదు. ఇప్పుడు నాలుగోసారి ప్రయత్నం చేస్తోంది. ఇదే చివరిసారి '' అని జెలియెన్క్సీ అన్నారు.

రష్యాకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమైన యుక్రేనియన్ దళాలు

'అపరిపక్వ నిర్ణయం'

బుడాపెస్ట్ మెమోరాండంపై యుక్రెయిన్ సంతకం చేయక ముందే దీనిపై అమలుపై కొంతమంది నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. ''ఈ నిర్ణయం రొమాంటిక్ అండ్ ప్రిమెచ్యూర్'' అని యుక్రేనియన్ పార్లమెంట్ సభ్యుడు వొలదిమీర్ టోలుబ్కో 1992లోనే వాదించారు.

అన్ని అణ్వాయుధాలను వదిలేయకుండా కొన్నింటి అట్టి పెట్టుకోవాలని, దీనివల్ల దేశంపై దురాక్రమణలను నిరోధించవచ్చని ఆయన నాటి పాలకులకు సూచించారు. ఇప్పుడు ఆయన మాటే నిజమైందని, యుక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే, రష్యా ఇంత దూకుడుగా వ్యవహరించేది కాదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలకు దురక్రమణ ముప్పు చాలా తక్కువని, వాటిని ఉపయోగించకపోయినా, బెదిరింపుకు పనికొస్తాయని విన్సెంట్ ఫెరారో జూనియర్ అన్నారు. అమెరికా, రష్యాలు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఘర్షణకు దిగకపోవడానికి కారణం కూడా ఇదేనని ఈ వాదనను సమర్ధించేవారు అంటారు.

అయితే, అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు, నిత్య ఉద్రిక్తతలకు దారితీస్తుందని, ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య ఘర్షణ అలాంటిదేనని ఫెరారో అన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్

రాజకీయ, ఆర్థిక భారం

అయితే, యుక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. సోవియట్ యూనియన్ నుంచి వారసత్వంగా దక్కిన న్యూక్లియర్ వెపన్స్ పై యుక్రెయిన్‌కు ఎలాంటి అధికారం లేదని, కేవలం అవి భౌతికంగా మాత్రమే యుక్రెయిన్‌లో ఉన్నాయని అంటున్నారు.

"యుక్రెయిన్‌కు ఈ ఆయుధాలపై భౌతిక నియంత్రణ మాత్రమే ఉంది, కానీ కార్యాచరణ నియంత్రణ లేదు. వాటిని ఆపరేట్ చేయడానికి వారికి యాక్సెస్ కోడ్‌లు, వివరాలు అందుబాటులో లేవు" అని అలెగ్జాండర్ లానోస్కా అనే రీసెర్చర్ అన్నారు.

"యుక్రెయిన్ దగ్గర ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, వాటి వల్ల గణనీయమైన రాజకీయ, ఆర్థిక భారాలు ఉంటాయి" అని అలెగ్జాండర్ అన్నారు. అణ్వాయుధ కార్యక్రమం వల్ల భవిష్యత్తులో అనేక ప్రమాదాలు కూడా ఉంటాయని బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ లో అంతర్జాతీయ రాజకీయాల ప్రొఫెసర్ ఆండ్రూ ఫుటర్ అభిప్రాయపడ్డారు.

2014లో రష్యా దాడిని ఎదుర్కొనే క్రమంలో యుద్ధట్యాంక్ పై యుక్రేనియన్ సైనికులు

అణు ఘర్షణ జరిగే ప్రమాదం ఉందా?

కీయెవ్ అణు నిరాయుధీకరణ చేసినప్పటికీ, రష్యా దళాలు యుక్రెయిన్‌పై దాడి చేయడంతో ఐరోపాలో అణు ఘర్షణ భయాలు పుంజుకున్నాయి. పైగా నాటోలోని ఏ సభ్య దేశమైనా ఈ ఘర్షణలో జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకుంటే తాను దూకుడుగా స్పందిస్తానని పుతిన్ తన ప్రసంగాల్లో స్పష్టం చేశారు. దీనికి తోడు అణ్వాయుధాల విభాగాన్ని స్పెషల్ అలర్ట్‌లో కూడా ఉంచారు పుతిన్.

అయితే, అలర్ట్ స్టేటస్‌కి మారడం వల్ల వాటిని ఉపయోగించాలనే ఉద్దేశం ఉందని చెప్పడం కూడా కష్టమేనని కొందరు నిపుణులు చెబుతున్నారు.

అటు అమెరికా, ఇటు నాటో కూటమి కూడా పుతిన్ చర్యలను బాధ్యతారహితమైనవిగా పేర్కొన్నప్పటికీ, తమ సభ్య దేశంపై దాడి చేస్తే తప్ప అమెరికా లేదా నాటో ఈ వ్యవహారంలో కల్పించుకునే పరిస్థితి లేదు. పుతిన్ చర్యలను భయపెట్టే చర్యలుగా పలువురు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Budapest Memorandum: Why did Ukraine hand over all of its nuclear weapons to Russia three decades ago
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X