మరో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది మృతి, మరో 19 మందికి !!
ప్రపంచ వ్యాప్తంగా వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు సర్వత్రా ఆవేదన నింపుతున్నాయి. ఓ వైపు రోడ్డు ప్రమాదాలు.. మరోవైపు రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు సైతం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు ఇప్పుడు ఇండోనేషియాలో జరిగిన విషాద ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ దుర్ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా సెంట్రల్ జావా ప్రాంతంలో ఈరోజు ( డిసెంబర్ 22, 2025 ) తెల్లవారుజామున ఈ విషాదం జరిగినట్టు చెబుతున్నారు. సెమరాంగ్ నగరంలోని క్రాప్యాక్ టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సు అత్యంత వేగంగా వెళ్తూ క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్దకు రాగానే.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది.

అయితే సమాచారం అందిన వెంటనే 'సెమరాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ' బృందాలు రంగంలోకి దిగాయి. బస్సు బోల్తా పడటం, కిటికీ అద్దాలు పగిలి లోపల అడ్డుగా ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారాయని అధికారులు తెలిపారు. చాలామంది బాధితులు బస్సు లోపలే ఇరుక్కుపోయారని.. లోపలికి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో గ్లాసులను తొలగించారు. ఆ తర్వాత అతి జాగ్రత్తగా బాధితులను బయటకు తీయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు పూర్తయ్యాయని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు.
ఇక ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో ప్రజలు మృతి చెందిన విషయం తీవ్రంగా కలిచివేస్తుంది. ఇటీవలే కర్నూలు జిల్లాలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమై ఏకంగా 19 మంది మరణించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి 44పై అగ్నిప్రమాదానికి గురైంది. మోటార్ సైకిల్ ను ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications