వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cambodia-JobScam: ఆగ్నేయాసియాలో ఉద్యోగాల పేరిట జరుగుతున్న మానవ అక్రమ రవాణా కుంభకోణం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

విదేశాల్లో ఉద్యోగం, ఆకర్షించే జీతం, మంచి హోటల్‌లో నివసించే అవకాశం, ఒక వ్యక్తిగత ట్రైనర్...ఇలాంటి ఉద్యోగ ఆఫర్‌ను యాంగ్ వీబిన్ కాదనలేకపోయారు.

కంబోడియాలోని టెలీసేల్స్ ఉద్యోగం గురించి వచ్చిన ఈ ప్రకటన చూడగానే ఆయన ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించారు.

35 ఏళ్ల వీబిన్ స్వదేశంలో మేస్త్రీ పని చేస్తూ తగినంత సంపాదించలేకపోతున్నారు. ఆయనకు తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది.

కొన్ని వారాల తర్వాత వీబీన్ కంబోడియా రాజధాని నామ్ పెన్‌కు బయలుదేరారు. ఆయన అక్కడకు చేరేటప్పటికి కొంత మంది ఆయనను నిర్మానుష్యంగా ఉన్న ఒక వీధిలో ఊరూ పేరు లేని భవనం దగ్గరకు తీసుకుని వెళ్లారు.

రిక్రూట్‌మెంట్ ఏజెంట్ ఉద్యోగ ప్రకటన చేసినప్పుడు పంపిన ఫోటోలకు ఈ భవనానికి పొంతన లేదు.

పేపర్ వర్క్ చేసేందుకు పాస్ పోర్టును ఆయన దగ్గర నుంచి తీసేసుకున్నట్లు చెప్పారు. ఆయనకొక చిన్న గదిని చూపించారు. ఈ పరిసరాలను దాటి వెళ్లేందుకు వీలు లేదనే హెచ్చరిక కూడా జారీ చేశారు.

"నేను తప్పుడు ప్రదేశానికి వచ్చానని అర్థమైంది. నేనొక ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోయాను" అని ఆయన బీబీసీకి చెప్పారు.

ఇటీవల ఆగ్నేయాసియాలో ఉద్యోగాల కుంభకోణం నిర్వహిస్తూ మానవ అక్రమ రవాణా చేస్తున్న వారి చేతుల్లో మోసపోయిన వేలాది మంది కార్మికుల్లో ఈయన కూడా ఒకరు.

ఇండోనేసియా, వియత్నాం, మలేసియా, హాంగ్ కాంగ్, తైవాన్ ఇప్పటికే ఈ కుంభకోణానికి సంబంధించి అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు జారీ చేశాయి.

సులభంగా లభించే ఉద్యోగాలు, అదనపు ప్రోత్సాహకాలకు లొంగిపోయి చాలామంది కాంబోడియా, మియన్మార్, థాయ్‌లాండ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ దేశాల్లో అడుగుపెట్టగానే వాళ్ళు అక్కడ బందీలుగా మారి మోసాలకు నిలయాలైన ఆన్‌లైన్ కేంద్రాల్లో పని చేసేలా ఒత్తిడికి గురవుతున్నారు.

మాన అక్రమ రవాణా

ఆగ్నేయాసియాలో అక్రమ మానవ రవాణా ఎప్పటి నుంచో సమస్యగా ఉంది. కానీ, నేర సామ్రాజ్యాలు మరింత దూరం అలోచించి కొత్త తరహా బాధితుల కోసం వేటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా వీళ్ళు టీనేజర్లు, కంప్యూటర్ పరిజ్ఞానం, చదువు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లో నేర కార్యకలాపాలు నిర్వహించేందుకు నైపుణ్యం ఉన్న వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. వీరి ద్వారా పిగ్ బుచెరింగ్ లాంటి ప్రేమ కుంభకోణాలు, క్రిప్టో మోసాలు, మనీ లాండరింగ్, చట్ట వ్యతిరేకంగా చేసే జూదం లాంటి పనులు చేయిస్తారు.

ఒక మహిళగా నటిస్తూ ఆన్ లైన్‌లో అపరిచితులతో స్నేహం చేసుకునే పనిని తనకు ఇచ్చినట్లు వియత్నాంకు చెందిన చి టిన్ బీబీసీకి చెప్పారు.

"నేను ప్రతీ రోజు 15 మంది కొత్త స్నేహితులను చేసుకుని వాళ్ళను ఆన్‌లైన్‌లో జూదం ఆడేందుకు, లాటరీ వెబ్ సైటులో చేరేలా ప్రేరేపించాలి. ఇందులో కనీసం ఐదుగురు గేమింగ్ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేసేలా చూడాలి" అని చెప్పారు.

"నన్ను మర్యాదగా ప్రవర్తించమని మా మేనేజర్ ఆదేశించారు. నేను తప్పించుకుని పారిపోవడానికిగానీ, ఎదురు చెప్పడానికిగానీ ప్రయత్నిస్తే, హింసించే గదిలోకి తీసుకుని వెళతామని బెదిరించారు. యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే వాళ్లకు తిండి పెట్టకుండా ఆకలితో మాడ్చి కొట్టేవారని కొంతమంది నాతో చెప్పారు" అని ఆమె వివరించారు.

ఇలాంటి వేధింపులు మిగిల్చే వేదన ఎప్పటికీ తీరదు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు వియాత్నామీ బాధితులు, తమను కొట్టి, విద్యుత్ షాక్ ఇచ్చి, ఈ కుంభకోణాలు నిర్వహించే కేంద్రాలకు అమ్మేసినట్లు చెప్పారు.

అందులో ఒకరికి కేవలం 15 ఏళ్లు. ఈ వేధింపుల వల్ల ఆమె ముఖం రూపు మారిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నుంచి స్కూలుకు వెళ్లడం లేదు. స్నేహితులను కలవడానికి అవమానంగా భావిస్తున్నారు.

మరో 25 ఏళ్ల అబ్బాయిని బంధించి అతని కుటుంబం నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.

తనను బంధించిన వ్యక్తి డబ్బులు డిమాండ్ చేసేందుకు దుండగులు తన తల్లిదండ్రులకు పంపిన ఫొటోను ఆయన బీబీసీకి షేర్ చేశారు.

ఆయన చేతులను ఇనుప మంచానికి కట్టేసి, విద్యుత్ షాక్ ఇచ్చినట్లుగా మోకాళ్ళ పై గాయాలు కనిపిస్తున్నాయి.

ఈ బాధితులు కుంభకోణ కేంద్రాలను వదిలి వెళ్లాలని అనుకుంటే, వారికి కట్టాల్సిన డబ్బును కట్టి వెళ్ళమని చెప్పేవారని చెప్పారు.

వియత్నాంకు చెందిన వ్యక్తిని ఇనుప మంచానికి కట్టేసి విద్యుత్ షాక్ ఇచ్చినట్లుగా మోకాళ్లపై గాయాలు కనిపిస్తున్నాయి

చాలాసార్లు ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉండేది. ఇవ్వలేని వారిని మరొక కేంద్రానికి అమ్మేసే ప్రమాదం ఉండేది.

చి టిన్‌ను విడిపించేందుకు వారి కుటుంబం 2600 డాలర్ల(సుమారు రూ. 2 లక్షలు)ను చెల్లించాల్సి వచ్చింది. ఈ డబ్బును సమకూర్చుకోలేనివారు ఏదో ఒక సాహసం చేసి ప్రమాదం నుంచి బయటపడటం తప్ప మరొక మార్గం లేదు.

ఒక కేసులో ఓ కంబోడియా క్యాసినో నుంచి 40 మంది వియత్నాం పౌరులు గోడను దూకి పారిపోయారు. సరిహద్దులు దాటడానికి వాళ్లు నదిలో ఈదుకుంటూ వెళ్లాల్సివచ్చింది. ఈ ప్రయత్నంలో నీటి ప్రవాహానికి 16 ఏళ్ల బాలుడు మరణించాడు కూడా.

ఈ ఘటన గత నెలలో విస్తృతంగా ప్రచారం పొందింది.

జాబ్ స్కామ్ కేంద్రాలకు కంబోడియా నిలయంగా మారింది. థాయ్‌లాండ్, మియన్మార్ లలో కూడా ఇలాంటివి చాలా పుట్టుకొచ్చాయి.

ఇందులో చాలా చైనా సంస్థలు లేదా చైనాతో సంబంధం ఉన్న సంస్థలు ఉన్నట్లుగా కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

ఈ సంస్థలు చాలాసార్లు చైనా నేర ముఠాలకు కవర్ సంస్థలుగా పని చేస్తూ ఉంటాయని గ్లోబల్ యాంటీ స్కాం ఆర్గనైజేషన్ (గాసో) తెలిపింది.

"ఇందులో చాలా సంస్థలు మనీ లాండరింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అత్యంత ఆధునికంగా ఐటీ, ఫైనాన్స్ లాంటి ప్రత్యేక విభాగాలతో ఏర్పాటై ఉంటాయి. కొన్ని సంస్థలు కార్పొరేట్ తరహాలో మోసం చేయడంలో శిక్షణ కూడా ఇస్తాయి. ఉద్యోగి ప్రోగ్రెస్ రిపోర్టులు, కోటాలు, సేల్స్ లక్ష్యాలను నిర్దేశించడం కూడా ఇందులో ఉంటాయి’’ అని గాసో ప్రతినిధి యాన్ సాంటియాగో చెప్పారు.

ఇవి బహుళజాతి సంస్థల్లా పని చేస్తాయి. నేర ముఠాలు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు కుంభకోణ కేంద్రాలను నిర్వహించేందుకు, లేదా ఉద్యోగులను నియమించేందుకు స్థానిక గ్యాంగుల సహాయం తీసుకుంటాయి.

ఆగ్నేయ ఆసియాలో జరుగుతున్న అక్రమ మానవ రవాణాలో 40కి పైగా బృందాల పాత్ర ఉన్నట్లు తైవాన్ అధికారులు గత నెలలో చెప్పారు.

మానవ అక్రమ రవాణా

చైనా సంబంధిత టెలికాం, ఆన్ లైన్ కుంభకోణాలు ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ, కోవిడ్ మహమ్మారి మొత్తం పరిస్థితిని మార్చేసిందని నిపుణులు అంటున్నారు.

మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ కు తమ కార్యకలాపాలను ఎలా మార్చాలనే విషయాన్ని నేర ముఠాలు వేగంగా గ్రహించాయి.

చాలా మంది చైనాలో ఉద్యోగులను కూడా లక్ష్యంగా చేసుకునేవారు. అయితే, చైనాలో అమలు చేసిన కఠినమైన ప్రయాణ నిబంధనలు, లాక్ డౌన్‌లు, ఆ దేశం నుంచి వచ్చే వారి సంఖ్యను తగ్గించి, మోసగాళ్ల లక్ష్యం ఇతర దేశాల వైపు తిరిగేలా చేసింది.

దీంతో పాటు సతమతమవుతున్న ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో నిరుద్యోగుల సంఖ్య కూడా పెరిగింది.

"బాధితుల్లో ఎక్కువ మంది యువత. కొంత మంది యూనివర్సిటీ చదువులు పూర్తయి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఆన్ లైన్ లో ఇలాంటి ప్రకటనలు చూసినప్పుడు సహజంగా వీటికి ఆకర్షితులయ్యేవారు" అని యూఎన్ మైగ్రేషన్ లో ఆసియా పసిఫిక్ మైగ్రంట్ ప్రొటెక్షన్ నిపుణుడు పెప్పీ కివినేమి సిద్ధిక్ చెప్పారు.

"ప్రపంచంలో చాలా దేశాలు కోవిడ్ నిబంధలను సడలించడంతో పాటు వ్యవస్థీకృత నేరాలను నియంత్రించే విషయం పై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వాల దగ్గర సామర్థ్యం లేకపోవడంతో అక్రమ రవాణాదారులకు మనుషులను తరలించడం సులభంగా మారింది" అని ఆమె చెప్పారు.

ఈ ప్రాంతంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ద్వారా పెరిగిన చైనా పెట్టుబడులు ప్రాంతాల మధ్య రవాణా మెరుగుపడింది. దీంతో, పరిధిని మించి వ్యవస్థీకృత నేరాలు విస్తృతమయ్యే సామర్థ్యం కూడా పెరిగిందని నిపుణులు అంటారు.

గత నెలలో థాయ్ అధికారులు ఆగ్నేయాసియాలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టిన చైనా వ్యాపారవేత్త షీ జీ జియాంగ్‌ను అరెస్టు చేశారు. ఆయనకు బిలియన్ డాలర్ల విలువ చేసే క్యాసినో, మియన్మార్‌లో ఒక పర్యాటక కేంద్రం కూడా ఉంది.

ఆయనను ఇంటర్ పోల్ కూడా వెదుకుతోంది.

ఈ ప్రాంతంలో ఆయన చట్ట వ్యతిరేక జూద కార్యకలాపాలు నిర్వహించిన నేర ముఠాకు అధిపతి అని ఇంటర్ పోల్ వర్ణించింది.

షీ కు చెందిన కే కే పార్కులో చాలా మంది అక్రమ రవాణాకు గురై, బందీలుగా మారి చిత్రహింసలు అనుభవించినట్లు చాలా మంది బాధితులు చెప్పారు.

ఈ ముఠాలను పట్టుకునేందుకు చట్ట వ్యవస్థ సంసిద్ధమవుతోంది. ఈ కుంభకోణ కేంద్రాలపై సోదాలు నిర్వహించి వీటిని మూసివేయించేందుకు ఇటీవల కంబోడియా పోలీసులు ఇండోనేషియా, థాయ్, మలేసియా, వియత్నాం అధికారులతో కలిసి పని చేస్తున్నారు. బాధితుల కోసం నేరుగా హాట్ లైన్ ను కూడా ఏర్పాటు చేశారు.

ఇది చాలా తీవ్రమైన సమస్య అని కంబోడియా హోంమంత్రి అంగీకరించారు. క్రూరమైన స్థాయికి ఎదిగిన కొత్త నేరంగా ఆయన దీన్ని వర్ణించారు. విదేశీయులు ఎక్కువగా దీనికి పాల్పడ్డారని ఆయన చెప్పారు.

మానవ అక్రమ రవాణాదారుల నుంచి లంచాలను తీసుకొని వారితో కంబోడియా పోలీసులు, జడ్జిలు, ఇతర అధికారులు కుమ్మక్కయ్యారని బాధితులు, ప్రభుత్వేతర సంస్థలు చెబుతున్నాయని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక పేర్కొంది.

వీరిపై నిరంతరం ఆరోపణలు వస్తున్నప్పటికీ, చాలా మంది అధికారులపై ఇంకా విచారణ జరగలేదని ఈ నివేదిక తెలిపింది.

ఈ సమస్యను పూర్తిగా అరికట్టడానికి ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కివినేమి సిద్ధిక్ అన్నారు.

''అక్రమ రవాణాకు సంబంధించిన చట్టాలను ఈ ప్రభుత్వాలు మరింత కఠినంగా మార్చాలి. ప్రజలకు మద్దతుగా ఉండే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. సరిహద్దు చట్టాలు కూడా కఠినం చేయాలి'' అని అన్నారు.

ఇలాంటి కుంభకోణాలపై అవగాహన పెంచేందుకు ప్రజలను చైత్యన్యపరిచే ప్రచారాలను చాలా దేశాలు ప్రారంభించాయి.

ఎయిర్‌పోర్ట్‌లలో స్క్రీనింగ్ వ్యవస్థను కొన్ని దేశాలు ప్రారంభించాయి. ప్రయాణీకులు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు అనే వివరాల గురించి విమానాశ్రయాల్లో పోలీసులు ఆరా తీస్తారు.

బాధితులకు సహాయం చేయడానికి, వారిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి చాలా దేశాల్లో వలంటీర్ గ్రూప్‌లు ఏర్పాటయ్యాయి. ఈ గ్రూపుల్లో కొందరు గతంలో ఇలాంటి కుంభకోణాల్లో బాధితులు.

కంబోడియాలో 58 రోజుల పాటు బందీగా గడిపిన తర్వాత ఒక రోజు ఉదయం గార్డులు లేని సమయం చూసి వీబిన్ పాక్కుంటూ బయటకు వచ్చి అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. ఇలాంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా పోరాడే కార్యకర్తల సహాయంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు తన పాత ఉద్యోగంలోనే ఆయన చేరారు.

''చాలామంది ప్రజలు మంచి జీవితాన్ని కోరుకుంటారు. ఉద్యోగాల గురించి ఊహాలోకంలో విహరిస్తుటారు. కానీ, ప్రాక్టికల్‌గా ఆలోచించాలని నేను అందరికీ సూచిస్తున్నా. ఎక్కడైనా డబ్బు సంపాదించవచ్చు. రిస్క్ తీసకుంటూ విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. విదేశాల్లో ప్రమాదాలు ఎన్నో పొంచి ఉంటాయి. ఆ ప్రమాదాలను మీరు ఊహించలేరు'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Cambodia-JobScam: A Human Trafficking Scam in the Name of Jobs in Southeast Asia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X