భారతీయులు, విద్యార్థులకు అభయం ఇచ్చిన కెనడా
ఒట్టావా: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకుంటోన్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన తాలూకు దుమారం ఇంకా తగ్గట్లేదు.
జస్టిన్ ట్రూడో చేసిన ఈ ప్రకటన.. తీవ్రస్థాయిలో విభేదాలు చెలరేగడానికి కారణమైంది. ఆయన చేసిన ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ట్రూడో చేసిన ప్రకటనతో తాము విభేదిస్తోన్నామని స్పష్టం చేసింది. ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటో తమకు తెలియదని పేర్కొంది. భారత్‌లోని కెనడా హైకమిషనర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లను జారీ చేసింది. సమగ్ర వివరణ కోరింది.

అక్కడితో ఆగలేదు కేంద్ర ప్రభుత్వం. కెనడాలో నివసించే భారతీయులు, విద్యార్థులకు అడ్వైజరీని జారీ చేసింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడిన నేపథ్యంలో- అక్కడ నివసించే తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కెనడా వెళ్లే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరింది. కెనడాలో భారతీయులు, భారతీయ సంస్థలపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది కెనడా. దీన్ని తోసిపుచ్చుతున్నట్లు కెనడా ప్రజా భద్రత వ్యవహారాల శాఖ మంత్రి డొమినిక్ లెబ్లాంక్ చెప్పారు. ప్రజా భద్రతలో కెనడా అత్యంత సురక్షితమైన దేశమని, భద్రత విషయంలో ఎవరూ, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం స్పష్టం చేశారు.
ప్రజలకు భద్రత కల్పించే విషయం వెనుకంజ వేయబోమని హామీ ఇచ్చారు. తమ దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దాన్ని నెరవేర్చుతామని అన్నారు. ఖలిస్తానీ వేర్పాటు వాదులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతనూ కల్పిస్తామని డొమినిక్ లెబ్లాంక్ పేర్కొన్నారు.
జూన్ 18వ తేదీన ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జార్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాలో ఈ హత్య చోటు చేసుకుంది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గల గురుద్వారా బయట గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన మరణించారు.












Click it and Unblock the Notifications