కార్గో షిప్‌లో అగ్నిప్రమాదం.. 3 వేల కార్లు జలసమాధి
ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అలూటియన్ దీవుల సమీపంలో కొత్త వాహనాలతో మెక్సికోకు వెళుతున్న భారీ కార్గో షిప్ అగ్నిప్రమాదానికి గురై నీట మునిగింది. ఈ దారుణ ఘటనలో 3 వేల కార్లు జల సమాధి కావడం సంచలనంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జూన్ 3వ తేదీన కార్గో షిప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అదుపు తప్పడంతో.. ఓడలో ఉన్న 22 మంది సిబ్బంది లైఫ్ బోట్లసాయంతో బయటపడగా.. వారిని సమీపంలో ఉన్న మర్చంట్ మెరైన్ అనే నౌకలోని వారు కాపాడారని తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో ఓడలో వెనక భాగంలో మెక్సికోకు తీసుకెళ్తున్న 3 వేల కార్లు ఉండగా.. అందులో 800 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఓడను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రోజుల తరబడి రగులుకున్న మంటలు ఓడ నిర్మాణాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్టు వాపోతున్నారు.
అలస్కాలోని అలూటియన్ దీవులకు సమీపంలో ఈ నౌక మునిగిపోయినట్లు లండన్ కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్ మారిటైమ్ స్పష్టం చేసింది. దాంతో పడవతో పాటు ఇవి కూడా పూర్తిగా నీట మునిగాయి.
ఈ ఓడ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ముఖ్యంగా అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ ఘటనపై సముద్ర భద్రతా అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన సముద్రయాన పరిశ్రమలో షిప్పింగ్ భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలలో ఉండే బ్యాటరీల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఓడ నీటమునిగినప్పటికీ ఎలాంటి కాలుష్యం ఏర్పడలేదని యూఎస్ కు చెందిన కోస్ట్ గార్డ్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఒకవేళ కాలుష్యం ఏర్పడిన అది విస్తరించకుండా ఉండటం కోసం కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన రెండు సాల్వేజ్ టగ్‌లను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications