నేనేం తప్పు చేయలేదు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం..!!
సంచలనంగా మారిన పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. ఆత్మహత్యా యత్నానికి ముందు తన తప్పేమీ లేదని ఉదయ్ కృష్ణారెడ్డి వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి కి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ కొనసాగుతోంది.
నేషనల్ పోలీసు అకాడమీలో తనతోపాటు శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి రహస్యంగా తన వ్యక్తిగత ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి తీవ్రంగా బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. తనకు అసభ్యకర మెసేజ్‌లు పంపి బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆ వీడియోలను మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వాపోయారు. తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మెడపై కత్తి పెట్టి ఆ గది నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడని ఆ అధికారిణి ఆరోపించారు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై బీఎన్‌ఎస్‌లోని 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2) సెక్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఈ, 67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అధికారుల విచారణ
కాగా, ఈ ఘటన పైన ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళా ఐపీఎస్ ట్రైనీ చేసిన ఆరోపణలు నిజమని ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. దీంతో, పోలీసు అకాడమీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. దీనికి ముందు తన తప్పేమీ లేదంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉదయ్ కు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టేందుకు విచారణ కొనసాగుతోంది. ఉదయ్ ఆరోగ్య పరిస్థితి పైన ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేయనున్నాయి.


Click it and Unblock the Notifications