భారత్ రావడానికి ఛోటా రాజన్ కు భయం
జకర్తా: మోస్ట్ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ భారత్ రావాలంటే భయపడుతున్నాడని, అక్కడికి వెలితే చంపేస్తారని అంటున్నాడని అక్కడి పోలీసు అధికారులు అంటున్నారు. ఇంత కాలం ఎందరినో గడగడలాడించిన ఛోట రాజన్ ఎందుకు భయపడుతున్నాడో అర్థం కాలేదని అంటున్నారు.
ఇండోనేషియాలోని బాలి పోలీసు కమిషనర్ రెయిన్ హార్డ్ నయింగోలన్ భారత్ కు చెందిన ఓ జాతీయ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు స్వయంగా వెల్లడించారు. తనను విడుదల చేస్తే వెంటనే జింబాబ్వేకి పారిపోతానని ఛోటా రాజన్ అంటున్నాడని చెప్పారు.
జింబాబ్వేకి పారిపోవడానికి తాను ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియా వచ్చానని ఛోటా రాజన్ చెబుతున్నాడని, పదే పదే విడుదల చెయ్యాలని మనవి చేస్తున్నాడని రెయిన్ హార్డ్ నయింగోలన్ అన్నారు. ఛోటా రాజన్ చాల భయపడుతున్నాడని చెప్పారు.

వరుస పెట్టి సిగరెట్లు కాలుస్తున్నాడని వివరించారు. ఛోటా రాజన్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడని రెయిన్ హార్డ్ నయింగోలన్ చెప్పారు. ఛోటా రాజన్ లివర్, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని అన్నారు.
అయితే ఛోటా రాజన్ ను భారత్ పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బాలి పోలీసు కమిషనర్ రెయిన్ హార్డ్ నయింగోలన్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఛోటా రాజన్ ను బాలి విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఛోటా రాజన్ భయపడుతున్నాడని అక్కడి అధికారులు అంటున్నారు. అయితే కట్టుదిట్టమైన భద్రతతో ఛోటా రాజన్ ను భారత్ తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications