యుద్ధం వేళ.. భారత్‌పై విషం కక్కిన చైనా: మంచి మాటలు చెబుతూనే
India Pakistan War: ఊహించినట్టే- పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. ఆపరేషన్ సింధూర్ మిషన్ చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులకు దిగింది. శతృదేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నా ఉగ్రవాదులు. ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచీ భారత్ వాదిస్తూ వచ్చింది. యుద్ధ సన్నాహకాలనూ చేపట్టింది.

తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది భారత్. తెల్లవారు జామున 2 గంటల సమయంలోచీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. తాజా దాడుల్లో జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం సంభవించింది.
బహవాల్‌పూర్ అహ్మద్‌పూర్ ఈస్ట్‌లో సుభాన్ మసీద్ ప్రాంతంలో చాలాకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న జైషె మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి. ముజఫ్ఫరాబాద్‌లో బిలాల్ మసీద్ ప్రాంతంలో మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన మూడు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, సియాల్‌కోట్‌లో మురిడ్కె, కోట్కి, షక్కర్‌ఘర్‌లల్లో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన రెండు క్యాంపులు ధ్వంసం అయ్యాయి.
భారత్ చేపట్టిన ఈ సైనిక చర్య పట్ల ఇజ్రాయెల్ హర్షం వ్యక్తం చేసింది. దీన్ని స్వాగతించింది. ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్‌ను కోరింది. ఈ యుద్ధంలో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తామని పేర్కొంది.
అమెరికా తటస్థ వైఖరిని ప్రదర్శించింది. భారత్ పాక్ మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు. ఈ వివాదం త్వరగా ముగిసిపోవాలని ఆకాంక్షించారు. భారత్ చేపట్టిన చర్యపై ఆయన నేరుగా వ్యాఖ్యానించకపోయినా, మొత్తం సంఘర్షణ త్వరగా ముగిసిపోవాలన్న తన ఆకాంక్షను తెలియజేశారు.
చైనా మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరించింది. భారత సైనిక చర్యను తప్పుపట్టింది. బాధాకరమని వ్యాఖ్యానించింది. భారత్- పాకిస్తాన్‌లు ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని సూచించింది. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని భారత్‌కు విజ్ఙప్తి చేసింది.
ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. బీజింగ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్ జరిపిన సైనిక దాడులకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ దాడులపై పాకిస్తాన్ గట్టిగా ప్రతి స్పందించిందని, తిప్పి కొట్టిందని వ్యాఖ్యానించారు.
భారత సైనిక చర్య విచారకరమని, ఈ పరిస్థితిపై చైనా ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ ఎప్పుడూ పరస్పరం సహకరించుకోవాలని, శాశ్వతంగా పొరుగు దేశంగా కొనసాగాల్సి ఉంటుందని, ఇవి రెండూ కూడా తమకూ పొరుగు దేశాలేనని గుర్తు చేశారు. చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
భారత ఉపఖండంలో శాంతియుత వాతావరణం కొనసాగాలనేదే తమ అభిమతమని చైనా విదేశాంగ ప్రతినిధి తేల్చిచెప్పారు. ఆయా దేశాల సుస్థిరత, విస్తృత ప్రయోజనాల దిశగా భారత్ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటోన్నట్లు వివరించారు. సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని రెండు దేశాలకూ విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications