పాక్ కు ఊపిరి పోసిన చైనా- భారీ ప్రాజెక్ట్ స్పీడప్
Munda Dam: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్ తీసుకుంటోన్న నిర్ణయాలు పాకిస్తాన్ కూసాలను కదిలిస్తోంది. అన్నింటికీ మించి భారత్ నుంచి ఆ దేశానికి సరఫరా అవుతోన్న నదీ జలాల సరఫరాను నిలిపివేయడం వల్ల దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా 1960లో పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తక్షణమే ఇది అమల్లోకి కూడా వచ్చింది. పాకిస్తాన్‌కు నీటి సరఫరా అందజేసే నదులపై నిర్మించిన రిజర్వాయర్ల గేట్లను మూసివేసింది.

దీని ప్రభావం పాకిస్తాన్‌పై తీవ్రంగా పడింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ను దెబ్బ కొట్టింది. ఖరీఫ్ సీజన్‌లో సరఫరా కావాల్సిన నదీ జలాల్లో 21 శాతం కొరత ఏర్పడినట్లు ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (IRSA) అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. చీనాబ్ నదీ ప్రవాహంలో అకస్మాత్తుగా తగ్గడం వల్ల ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పాకిస్తాన్‌లో 21 శాతం నీటి కొరత తలెత్తిందని అంచనా వేసింది.
పాకిస్తాన్‌లో ఖరీఫ్ సీజన్ పంటలకు సింధు నదీ జలాలే ప్రాణవాయువుగా చెప్పుకోవచ్చు. సింధు- దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్‌లో 80 శాతం పొలాలకు నీరు సరఫరా అవుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్‌పై నిర్మించిన సలాల్, రాంబన్ జిల్లాల్లో నిర్మితమైన బాగ్లిహార్ రిజర్వాయర్ల నుంచి ప్రతి సీజన్‌లోనూ ఈ నీళ్లు విడుదల అవుతుంటాయి.
ఇప్పుడు పహల్గామ్ ఉగ్రవాద దాడిని దృష్టిలో పెట్టుకుని భారత్ ఈ రెండు రిజర్వాయర్ల గేట్లను మూసివేసింది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. కిషన్‌గంగా డ్యామ్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను తీసుకోవాలని భావిస్తోంది. నేడో, రేపో ఈ రిజర్వాయర్ గేట్లను మూసివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
భారత్ తీసుకున్న ఈ చర్యల వల్ల పాకిస్తాన్‌లో ఖరీఫ్ సీజన్‌కు 21 శాతం నీటి కొరత తలెత్తిందని ఐఆర్ఎస్ఏ అడ్వైజరీ కమిటీ ప్రకటించిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మారాలా వద్ద చీనాబ్ నది ప్రవాహం అకస్మాత్తుగా తగ్గడం పట్ల ఈ సలహా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఖరీఫ్ సీజన్ అంటే మే నుండి సెప్టెంబర్ వరకు నదీ జలాల లభ్యత గురించి అంచనా వేయడానికి ఐఆర్ఎస్ఏ సమావేశమైంది. భారత్ నుండి తక్కువ నీటి సరఫరా కారణంగా మారాలా వద్ద చీనాబ్ నది ఇన్‌ఫ్లో అకస్మాత్తుగా తగ్గిందని, దీనివల్ల ప్రారంభ ఖరీఫ్ సీజన్‌లో కొరత ఏర్పడిందని ఏకగ్రీవంగా నిర్ధారించింది.
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ ను ఆదుకోవడానికి ముందుకొచ్చింది దాని మిత్ర దేశం.. చైనా. గతంలో ప్రకటించిన ఓ భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. 2026 నాటికల్లా ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చేలా తక్షణ చర్యలకు దిగింది.
ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ పరిధిలోని మొహ్మండ్ జిల్లాలో మొహ్మండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో 2019లో ఈ రిజర్వాయర్ కమ్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది చైనా. ముండా డ్యామ్ గా ఇది గుర్తింపు పొందింది. పెషావర్ కు అయిదు కిలోమీటర్ల దూరంలో స్వాత్ నదిపై ఈ భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించింది.
దీని నిర్మాణం పూర్తయితే 16,100 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. అలాగే- 800 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్ లో పెట్టిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని చైనా నిర్ణయించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications