వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా హైప్రొఫైల్ #Metoo కేసు: అమెరికాలో కోర్టు బయట రాజీకి కారణాలేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రిచర్డ్ లియూ

ఇది చైనాలోనే అత్యున్నత స్థాయికి చెందిన 'మీటూ' కేసు. కానీ, ఈ కేసు విచారణ మాత్రం అమెరికాలో మొదలయింది.

ఇందులో నిందితుడు 49 ఏళ్ల కోటీశ్వరుడు. ఈయనను చైనా జెఫ్ బెజోస్ అని పిలుస్తారు. ఆయన రిచర్డ్ లియూ.

బాధితురాలు 25 ఏళ్ల విద్యార్థిని. ఆమె లియూ జిన్‌జియో . లియూ ఆమెను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేశారు.

ఈ కేసు విచారణ ఓపెన్ కోర్టులో జరుగుతుంది. ఇదే మాదిరి విచారణ చైనాలో జరగడం ఊహించడం కూడా కష్టం. కానీ, ఈ కేసు విచారణ ఘటన జరిగినట్లు ఆరోపిస్తున్న మిన్నెసోటా రాష్ట్రంలో హెన్నెపిన్ కౌంటీలో ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే, అనూహ్యంగా మలుపులు తిరిగిన ఈ కేసులో నిందితుడు, బాధితురాలు కోర్టు విచారణను తప్పించుకుంటూ.. కోర్టు బయట రాజీకి వచ్చారు.

ఇద్దరి పేర్లలోనూ లియూ అని ఉండటం తప్ప వీరిద్దరి మధ్య ఎటువంటి బంధుత్వం లేదు. చైనాలో ఈ పేరు చాలా సాధారణంగా ఉంటుంది.

ఇరువురి తరుపు న్యాయవాదులు శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. "జరిగిన సంఘటన అపార్ధాలు సృష్టించి ప్రజల దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా ఇరువురికీ, వారి కుటుంబాలకు కూడా తీవ్రమైన వేదన కలిగించింది" అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

"ఈ కేసు వల్ల కలిగిన వేదన మరింత ఎక్కువవ్వకుండా ఉండేందుకు ఇరు వర్గాలు ఈ కేసు విషయంలో ఒక ఒప్పందానికి వచ్చేందుకు నిర్ణయించుకున్నారు" అని ఈ ప్రకటనలో తెలిపారు.

ఈ వార్త చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ వార్తలతో చైనా సోషల్ మీడియా నిండిపోయింది. చైనా సోషల్ మీడియా వేదిక వీబోలో కొన్ని గంటల్లోనే సృష్టించిన హ్యాష్ ట్యాగ్ ల నుంచి లక్షల కొలదీ వ్యూస్, కామెంట్లు వచ్చాయి.

పారదర్శకంగా జరిగే కోర్టు విచారణ చూసేందుకు కొన్ని లక్షల మంది చైనీయులు ఎదురు చూశారు. అమెరికాలో జరుగుతున్న విచారణలో జిన్‌జియోకు కేసు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చని భావించారు.

కానీ, ఈ కేసు ఒప్పందం కోర్టు వెలుపల జరగడంతో, ఈ కేసు విషయంలో మరిన్ని ఊహాగానాలు మొదలవుతాయి. ఈ నిర్ణయం చైనాలోని మీటూ ఉద్యమాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేయవచ్చు.

వీడియో క్లిప్

వాదనల యుద్ధం

ఈ కేసు విచారణ ప్రారంభం కాక ముందే, ఆగస్టు 2018 రాత్రి నాటి సంఘటనకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్‌ల ఆధారంగా ప్రజలు తమ అభిప్రాయాలను ఏర్పరుచుకున్నారు.

అప్పుడు జిన్‌జియో మిన్నెసోటాలోని ఒక యూనివర్సిటీలో చదువుతున్నారు. రిచర్డ్ లియూ ఆతిధ్యం ఇచ్చిన ఒక నెట్‌వర్కింగ్ విందులో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం అందింది.

ఆయన ప్రముఖ ఈ రిటైల్ సంస్థ జేడీ. కామ్ వ్యవస్థాపకుడు. విందు తర్వాత ఇద్దరూ కలిసి ఆమె అపార్ట్మెంట్‌కు వెళ్లారు.

డిన్నర్ సమయంలో మోతాదు మించి మద్యం తాగమని రిచర్డ్ లియూతో పాటు ఇతర అతిధులు బలవంతం చేశారని లియూ జిన్‌జియో ఆరోపించారు.

ఇద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఆమె పై శారీరక దాడి చేశారని, ఆమె మత్తులో ఉండటంతో ప్రతిఘటించలేకపోయానని చెప్పారు.

ఆమెతో పాటు అపార్ట్మెంట్‌కు వెళ్లి, వద్దని వారిస్తున్నా ఆమె పై అత్యాచారం చేశారని ఆమె చెప్పారు.

అయితే, ఆమె మద్యం మత్తులో లేరని, ఇష్టపూర్వకంగానే తనను ఇంటికి ఆహ్వానించారని, పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ సెక్స్‌లో పాల్గొన్నామని రిచర్డ్ లియూ చెప్పారు.

ఈ సంఘటన జరిగిన వెంటనే లియూ జిన్‌జియో తన స్నేహితురాలికి ఈ విషయం చెప్పారు.

ఆమె పోలీసులను పిలిచారు. రిచర్డ్ లియూ అరెస్ట్ అంతర్జాతీయ వార్తా శీర్షికల్లోకి చేరింది. ఆయన ఎటువంటి తప్పు చేయలేదని చెప్పారు. ఆ మరుసటి రోజే ఆయన విడుదలయ్యారు.

ఈ సంఘటనకు సరైన ఆధారాలు లేవంటూ, కొన్ని వారాల తర్వాత ఆయన పై అభియోగాలు నమోదు చేసేందుకు స్థానిక ప్రాసిక్యూటర్లు తిరస్కరించారు. ఆరోపణలను నిరూపించడం చాలా కష్టమవుతుందని అన్నారు.

ఏప్రిల్ 2019లో లియూ జిన్‌జియో స్థానిక కోర్టులో లైంగిక వేధింపుల కేసు నమోదు చేస్తూ నష్ట పరిహారంగా కనీసం $50,000 డాలర్లు (సుమారు రూ.40లక్షలు) ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె ఆరోపణల్లో బలం ఉందంటూ కోర్టు కేసును స్వీకరించింది. ఆయన సంస్థ కూడా నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి ఉండొచ్చని పేర్కొంది.

ఆమె కేసు నమోదు చేసిన కొన్ని రోజులకే పోలీసు బాడీ క్యాం, పర్యవేక్షక కెమేరాల నుంచి లభించిన వీడియోలు ఆన్ లైన్ లో కన్పించాయి. ఈ వీడియోల్లో రిచర్డ్ తో కలిసి జిన్ జియో డిన్నర్ కు హాజరైన రెస్టారంట్ బయట మాట్లాడుకుంటున్నట్లు, అపార్ట్మెంట్ దగ్గర కూడా ఉన్నట్లు కనిపించింది. ఈ సంఘటన తర్వాత జిన్ జియో పోలీసులతో మాట్లాడటం కూడా కనిపించింది.

ఈ కేసులో నమోదు చేసిన ఆధారాల నుంచి ఈ వీడియో క్లిప్‌లు బయటపడ్డాయి. ఇవి చైనాలో పలు మీడియా సంస్థల నుంచి మొదట వెలుగు చూశాయి. ఈ వీడియోలు బయటపడిన తర్వాత ఒక మీడియా సంస్థ పేరు కూడా వినిపించడం లేదు.

కోర్టు విచారణ జరగడానికి ముందు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు ఈ క్లిప్స్ ను లీక్ చేశారని జిన్ జియో న్యాయవాదులు వాదించారు. అయితే, రిచర్డ్ లియూ న్యాయవాదులు ఈ ఆరోపణలను ఖండిస్తూ, పోలీసులే మీడియా సంస్థల అభ్యర్ధన మేరకు ఈ వీడియోలు విడుదల చేశారని బీబీసీకి చెప్పారు.

అయితే, ఈ వీడియో క్లిప్ లు మాత్రం చైనా రిచర్డ్ లియూకి ప్రజల మద్దతు, లియూ జిన్‌జియో పట్ల వ్యతిరేకత కలిగేలా చేశాయి.

ఆమెను నీతి తప్పిన స్త్రీ అని, గోల్డ్ డిగ్గర్ అని నిందించడం మొదలుపెట్టారు.

ఇరువురి మధ్య ఒప్పందం కుదిరినట్లు వార్త రాగానే, చైనా సోషల్ మీడియాలో యూజర్లు ఆమె డబ్బు కోసమే ఈ కేసును నమోదు చేశారనడానికి సాక్ష్యం అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. కొందరు ఆమెను లైంగిక కలయిక తర్వాత దోపిడీ చేసిన బాధితురాలు అంటూ వర్ణించడం మొదలుపెట్టారు.

బహిరంగ కోర్టు విచారణ

ఈ కేసు నమోదు చేసినప్పటి నుంచి జిన్‌జియో పైకి కనిపించడం మానేశారు. ఆమె లింగ్విస్టిక్స్‌లో చదువును కొనసాగిస్తున్నారు.

ఆమె మానసికంగా కోలుకోవడం కోసం రెండు సార్లు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చారని ఆమె తరుపు న్యాయవాదులు చెప్పారు.

చివరకు ఆమె డిగ్రీ పూర్తి చేసి మిస్సోరిలో ఉన్న వాషింగ్టన్ యూనివర్సిటీలో ఉన్నత చదువుల కోసం సీటు సంపాదించుకున్నట్లు చెప్పారు.

ఈ ఘటనతో పాటు బహిరంగంగా జరిగిన అవమానం వల్ల ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. రిచర్డ్ లియూతో పాటు డిన్నర్ కు హాజరైన ఇతర అతిధుల నుంచి ఆమెకు ముప్పు ఉంటుందేమోనని భయపడుతూ చైనాకు తిరిగి వెళ్లాలని అనుకోవడం లేదు" అని ఆమె న్యాయవాదులు చెప్పారు.

ఆరోజు డిన్నర్ కు చైనా కమ్మూనిస్టు పార్టీలో ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు హాజరైనట్లు చెప్పారు.

మొదట్లో ఆమె ఈ కేసును పోరాడేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ కేసు విషయంలో ఎప్పటికీ రాజీ పడనని అలా చేస్తే, జరిగిన విషయం బయటకు రాకుండా చేసుకున్న ఒప్పందంలా మిగిలిపోతుందని ఆమె 2019లో న్యూ యార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే, ప్రస్తుతం ఆమె కోర్టు బయట ఒప్పందానికి రావడానికి వెనుకనున్న కారణాలు తెలియవు. ఈ విషయం గురించి ఆమె న్యాయవాదులు వెల్లడించలేదు.

కానీ, కోర్టు విచారణ సమయం దగ్గర పడుతున్న కొలదీ ఆమె ఒత్తిడిని తట్టుకోలేకపోయి ఉంటారని ఆమె మద్దతుదారులు భావిస్తున్నారు.

ఈ కేసులో రాజీకి వచ్చిన వెంటనే విషయం చెబుతూ తనకు సందేశం పంపినట్లు చైనాలో ఫెమినిస్ట్ ఉద్యమకారిణి లియాంగ్ సోవెన్ చెప్పారు.

"ఆమె చివరి వరకు పోరాడాలని అనుకున్నారు. కానీ, చాలా కష్టమైపోయింది" అని లియాంగ్ బీబీసీకి చెప్పారు.

"కేసు కొలిక్కి రావడం ఒక విధంగా ఉపశమనం కలిగించింది. కానీ చివరి వరకు పోరాడలేకపోయారు. ఆమె పట్ల నమ్మకాన్ని ప్రదర్శించిన వారిని ఆమె గౌరవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి చేతనైన సహాయాన్ని అందిస్తాను" అని ఆమె చెప్పారు.

రిచర్డ్ లియూ ఏప్రిల్ లో జేడీ.కామ్ సంస్థ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, ప్రజల దృష్టిలో ఆయన ఇంకా సంస్థ చైర్మన్ గానే ఉన్నారు.

సమృద్ధి, శక్తితో కూడిన కొత్త శకపు చైనాలో ఆయననొక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా చూస్తారు.

టెక్ ఉత్పత్తులు అమ్మే చిన్న స్టాల్ నుంచి ఆన్ లైన్ రిటైల్ స్థాయికి తీసుకెళ్లిన ఆయనను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో పోలుస్తారు.

2015లో ఆయన ఇంటర్నెట్‌లో ప్రముఖ వ్యక్తి జాంగ్ జటియన్‌ను పెళ్లి చేసుకున్నారు. చైనా మీడియా మాత్రం వారిద్దరూ పరస్పరంప్రేమగా ఉన్నట్లు తరచుగా వార్తల్లో చూపిస్తూ ఉంటుంది.

అయితే, ఇదంతా రిచర్డ్ లియూ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా చూపించుకునేందుకు ఆయన మద్దతుదారులు చేస్తున్న ప్రచారం అని జిన్ జియో తరుపున మాట్లాడేవారు అంటారు. జేడీ.కామ్ ఈ ఆరోపణలను ఖండించింది.

"నాలుగేళ్ల పాటు సాగిన చిక్కుముడి, చివరకు వీడింది" అంటూ చైనా మీడియాకు ఇచ్చిన ప్రకటనలో రిచర్డ్ లియూ అన్నారు.

ఈ వ్యవహారం వల్ల ఇబ్బంది పడిన వారికందరికి, ముఖ్యంగా నా భార్యకు క్షమాపణలు చెబుతున్నాను. నా జీవితం, నేను చేసే పని తిరిగి సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాను" అని అన్నారు.

రిచర్డ్ లియూ, జాంగ్ జటియన్

ఊహించని పారదర్శకత

ఈ కేసులో విచారణ ఆగిపోవడంతో చైనా ప్రజలు ఈ అత్యున్నత స్థాయి మీటూ కేసు విచారణను చూసే అవకాశాన్ని కోల్పోయారు.

అయితే, మిన్నెసోటా కోర్టులో కేసుకు సంబంధించిన రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉండటంతో చైనా ప్రజలు, మీడియా కూడా ఊహించని స్థాయిలో ఈ కేసు వివరాలు తెలుసుకునే అవకాశం దొరికింది.

చైనాలో న్యాయవ్యవస్థ పని చేసే తీరుకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. చైనాలో అత్యున్నత స్థాయి కేసులు కోర్టు లోపల మాత్రమే జరుగుతాయి. వాటి గురించి పెట్టే ఆన్ లైన్ పోస్టులు, కామెంట్లను కూడా భారీగా సెన్సార్ చేస్తారు.

ప్రస్తుతం ఈ కేసులో ఇరు వర్గాలు ఒప్పందానికి రావడంతో, ఈ కేసు మరెక్కడైనా చోటు చేసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదా అనే ప్రశ్న వస్తోంది.

లియో జిన్‌జియోకు చైనాలో కంటే, అమెరికాలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొంత మంది న్యాయ నిపుణులు చెప్పారు.

చైనాలో బాధితులే తమకు జరిగిన అన్యాయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ, అమెరికాలో ఈ సంఘటన జరిగి ఉంటుందా లేదా అనేది న్యాయమూర్తులు నిర్ణయించగలరు.

చైనాలో కోర్టులు కూడా వీడియో ఫుటేజీ లాంటి ఆధారాలను సమర్పించడం పై చాలా కచ్చితంగా ఉంటాయి. అమెరికాలో ప్రత్యక్ష సాక్షులిచ్చే ఆధారాలకు ఎక్కువ బలముంటుంది.

కానీ, ఈ ఒప్పందం వల్ల చైనాలో మీటూ ఉద్యమం పై ఎటువంటి ప్రభావం పడుతుందనే ప్రశ్న పుడుతోంది.

"కొన్ని అత్యున్నత స్థాయి కేసులకు కోర్టు బయట పరిష్కారానికి రావడం లేదా క్రిమినల్ అభియోగాలను ఉపసంహరించుకోవడం లాంటివి జరిగే అవకాశముంది" అని ఉద్యమకారులు చెబుతున్నారు.

"లైంగిక వేధింపులకు గురైన బాధితులకు ఈ కేసు విచారకరమైన సంకేతాన్ని పంపింది" అని అన్నారు.

మీటూ ఉద్యమం తర్వాత ఉద్యమకారులు వేధింపులకు గురి కావడం లేదా కనిపించకుండా మాయమవ్వడం లాంటి సంఘటనలు జరిగాయి. ఆన్ లైన్ సెన్సార్ షిప్ , శత్రుత్వం పెరిగింది.

ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో జిన్‌జియో మద్దతుదారులు పోస్టు చేసిన అప్‌డేట్లను సెన్సార్ చేశారు. ఆమెకు మద్దతిచ్చేందుకు కాల్స్ చేసిన విచాట్ అకౌంట్లను బ్లాక్ చేశారు.

"చివరకు ఈ ఒప్పందం జిన్‌జియోతో పాటు మీటూ ఉద్యమానికి కూడా గెలుపే " అని లియాంగ్ అంటారు.

ఆమె కథను బయటపెట్టాలని చూసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.

"మా పోరాటాన్ని కొనసాగించేందుకు చైనాలో మీటూ ఉద్యమానికి ఆమె ఊతమిచ్చారు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
China's high-profile #Metoo case: Reasons for out-of-court settlement in America?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X