వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లా హెయిర్ క్లిప్: 'మహిళలు ఇష్టపడే ఈ క్లిప్‌ను కనిపెట్టింది మా నాన్నే'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
క్లా క్లిప్

ప్రస్తుత కాలంలో బజార్లో రకరకాల హెయిర్ క్లిప్స్ దొరుకుతున్నాయి. 30 ఏళ్ల క్రితం క్లా క్లిప్ కనిపెట్టింది మా నాన్నే. కోవిడ్ సమయంలో సెలూన్లు మూతపడడంతో జుట్టు మేనేజ్ చేయడం ఆడవాళ్లకు పెద్ద పనైంది. అందంగా ఉంటూ సౌకర్యంగా ఉండే హెయిర్ క్లిప్స్‌కు డిమాండ్ పెరిగింది.

జుట్టు అంతటినీ దగ్గరగా చేసి, చక్కగా నొక్కిపెట్టి ఉంచే 'క్లా క్లిప్' 1900లలో ఫ్రాన్స్‌లోని ఓ చిన్న వర్క్‌షాప్‌లో ఊపిరి పోసుకుందన్న సంగతి చాలా కొద్దిమందికే తెలుసు.

"ప్రపంచంలో ప్రతి చోట కోకోకోలా బాటిల్, మైకేల్ జాక్సన్ ఫొటో, మన హెయిర్ క్లిప్ తప్పక కనిపిస్తుంది" అంటూ ఉండేవారు మా నాన్న.

నిజానికి ఆయన నన్నుపెంచుకున్న తండ్రి. నేను ఫ్రాన్స్‌లో రెండు కుటుంబాల మధ్య పెరిగాను. నాకు జన్మనిచ్చిన తల్లి మరియా పశ్చిమ ఆఫ్రికా తీరంలోని కేప్ వెర్డేకు చెందినవారు. ఆమెకు 24 ఏళ్లు ఉన్నప్పుడు నేను కడుపులో పడ్డాను. అప్పుడే, మంచి భవిష్యత్తు కోసం కేప్ వెర్దే విడిచిపెట్టి యూరప్‌కు పయనమయ్యారు.

అష్టకష్టాలు పడి, కొన్ని నెలలు ప్రయాణం చేసి మొదట పోర్చుగల్, తరువాత ఫ్రాన్స్ చేరుకున్నారు.

కొన్ని వారాల తరువాత 1976 డిసెంబర్లో తూర్పు ఫ్రాన్స్‌లోని రియోమ్ అనే చిన్న పట్టణంలో నేను పుట్టాను. మేం చాలా పేదరికం అనుభవించాం. గడ్డు కట్టుకుపోయే చలిలో వీధుల్లో రోడ్లపై పడుకునేవాళ్లం. కొన్నాళ్లకు మా అమ్మకు ఒక పాడుబడిన షెడ్డు కనిపించింది. అందులోకి మారాం. అమ్మ ఆరోగ్యం చాలా పాడైపోయింది. అప్పటి నుంచి ఆమె కోలుకోలేదు.

ఒకరోజు ఒక ఫ్రెంచ్ దంపతులు క్రిస్టియాన్ పొటుట్, ఆయన భార్య సిల్వియన్ మా దుస్థితిని చూసి నాకు వాళ్ల ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. మాకు ఇల్లు వెతకడంలో సహాయం చేశారు.

కానీ, నేను ఆ ఇల్లు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వాళ్లు చూపించిన ఆదరణకు వాళ్లకు తప్పక ప్రతిఫలం దక్కుతుందని మా అమ్మ మరియా అంటుండేవారు. అది నిజమైంది.

క్లా క్లిప్

1980లకు వచ్చేసరికి ప్రపంచం మారిపోయింది. పెద్ద ఫోన్లు వచ్చాయి. ఆడవాళ్లు జుట్టు పొడుగ్గా పెంచుకోవడం మొదలుపెట్టారు క్రిస్టియాన్ కూడా పెద్ద కలలు కనడం మొదలుపెట్టారు.

14 ఏళ్ల వయసులోనే ఆయన స్కూలు చదువులకు స్వస్తి చెప్పారు. కొత్తగా ఏదైనా కనిపెట్టాలని కలలు కంటుండేవారు. 27 ఏళ్లు వచ్చేసరికి ఆర్థికంగా చితికిపోయారు. చేతిలో ఏమీ మిగల్లేదు. దాంతో, తన తల్లిదండ్రుల ఇంటి వెనుక భాగంలో 180 చదరపు అడుగుల జాగాలో ఒక చిన్న వర్క్‌షాప్‌ను ప్రారంభించారు.

1986 నాటికి వాళ్ల వ్యాపారం పెరిగి పెద్దదైంది. క్రిస్టియాన్, సిల్వియాన్ కంపెనీ 'సీఎస్‌పీ డిఫ్యూజన్' ద్వారా ఒయోనాక్స్‌లో దువ్వెనలు, హెయిర్ బ్యాండ్స్ తయారుచేసే తొలి ఫ్యాక్టరీని తెరిచారు.

ఆ సమయంలో క్రిస్టియాన్‌కు ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది.

క్లా క్లిప్ ఆలోచన

"ఒకరోజు నా చేతి వేళ్లను ఒకదాన్లో ఒకటి దూర్చి, తీసి కాలక్షేపం చేస్తున్నా. అప్పుడే నాకు బల్బు వెలిగింది. నేను దువ్వెనలు, క్లిప్స్ అమ్ముతాను. ఈ రెండిటినీ కలిపి ఓ కొత్త ప్రోడక్ట్ ఎందుకు తయారుచేయకూడదు? అనుకున్నా" అంటూ క్రిస్టియాన్ వివరించారు.

అలా క్లా క్లిప్ పుట్టుకొచ్చింది,

"జుట్టు ఎలాంటిది అయినా సరే.. ఉంగరాల జుట్టు, నున్నటి జుట్టు, పొట్టి, పొడవు ఎలాంటి జుట్టయినా క్లా క్లిప్ పనికొస్తుంది" అంటూ గర్వంగా చెప్పారు క్రిస్టియాన్.

అవి ఫ్యాషన్ పెరుగుతున్న రోజులు. ఈ క్లా క్లిప్ చౌకగా సాధారణ ప్రజలకు కూడా అందుబాటు ధరలకు లభ్యమయ్యేది.

"ఈ క్లిప్ నా చిన్నప్పటి రోజులు గుర్తుచేస్తుంది. మా అమ్మ రోజూ తన క్లయింట్లకు ఈ క్లిప్ పెట్టేవారు" అని హెయిర్‌డ్రెస్సర్, లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ అలెక్సిస్ రోసో చెప్పారు.

క్రమంగా క్లా క్లిప్స్ ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అమెరికన్ టీవీ షో 'ఫ్రెండ్స్'లో జెన్నిఫర్ అనిస్టన్ కూడా దీన్ని తలకు పెట్టుకుని కనిపిస్తారు.

స్కూల్లో నా ఫ్రెండ్స్ అంతా ఆ క్లిప్స్ తెమ్మని అడిగేవారు. ఇంకా కావాలి..ఇంకా కావాలి అని అడిగేవారు. అప్పటికిగానీ ఆ క్లిప్ ఎంత పెద్ద హిట్ అయిందో నాకర్థం కాలేదు.

1990ల నాటికి మా ఫ్యామిలీ కంపెనీ నెలకు లక్షల్లో ఈ క్లిప్స్ అమ్మేది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని మహిళలు దీన్ని వాడడం ప్రారంభించారు.

మా సంస్థ పరిణామం పెరిగింది. ఉద్యోగులు పెరిగారు. ఈ క్లిప్‌కు వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీని విస్తరించారు.

'క్లిప్ చిన్నదే కానీ, తయారీ శ్రమతో కూడుకున్నది'

నేను సెలవుల్లో క్రిస్టియాన్, సిల్వియాన్ పిల్లలలతో పాటు వర్క్‌షాప్‌లో కూర్చుని ఒక్కో క్లిప్ చెక్ చేసేదాన్ని. ఏవైనా మచ్చలు, మరకలు ఉంటే తుడిచి, ఎక్కడైనా చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉండిపోతే వాటిని కట్ చేసి శుభ్రపరిచేవాళ్లం.

ప్లాస్టిక్ కరుగుతున్న వాసన నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ వాసన నా చిన్నతనపు జ్ఞాపపకాలను తట్టిలేపుతుంది.

క్లిప్ చూడ్డానికి చిన్నదిగా ఉన్నా, అది తయారుచేయడానికి ఎంత ఎక్కువ సమయం పడుతుందో తెలిస్తే నమ్మశక్యం కాదు.

"ముందు డిజైన్ వేసుకోవాలి. తరువాత రెసిన్ స్కేల్ మోడల్ తయారుచేసుకోవాలి. దానిపై ఒక రకమైన రసాయన మిశ్రమాన్ని పోయాలి. అప్పుడు అచ్చు తయారవుతుంది. ఈ అచ్చును ఒక పెద్ద మిషన్‌కు తగిలిస్తాం. ద్రవ రూపంలో ఉన్న అసిటేట్‌ను ఈ అచ్చులో పోయాలి. అది చల్లారాక క్లిప్ తయారవుతుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. ఒక అచ్చును రూపొందించడానికి నాకు దాదాపు 200 గంటలు పట్టేది" అని క్రిస్టియాన్ చెప్పారు.

అమెరికా, జపాన్‌లు ఈ క్లిప్స్‌కు అతిపెద్ద మార్కెట్లుగా అవతరించాయి. గ్రీస్ లాంటి ఐరోపా దేశాలకు కూడా సప్లయి చేస్తున్న క్లిప్స్ సరిపోయేవి కావు.

"ఇది చాలా అద్భుతమైనది.. చాలా వినూత్నమైనది" అని ఏథెన్స్‌లోని ఫ్యానీ లప్పాస్ గుర్తుచేసుకున్నారు. నా తల్లిదండ్రుల మొదటి, అతిపెద్ద క్లయింట్‌లలో ఆయన ఒకరు. ఒకేసారి 1,00,000 క్లిప్‌లను ఆర్డర్ చేశారు లప్పాస్.

నేడు క్లా క్లిప్స్ నలుపు లేదా ముదురు కాఫీ రంగుల్లో వస్తునాయి. కానీ, 1980లు, 1990లలో అప్పటి ఫ్యాషన్‌కు తగ్గట్టుగా రంగు రంగుల క్లిప్స్ తయారుచేసేవారు.

"మా క్లయింట్‌లలో ఒకరు స్వీడన్ రాజకుటుంబానికి ఆభరణాలు సరఫరా చేసేవారు. స్టాక్‌హోంలో ఆమెకు అందమైన షాపు ఉండేది. ఆమె షాపులో మా క్లిప్స్ పలు వరుసలలో ఉండేవి. మేం తయారుచేసిన ఖరీదైన క్లిప్స్ కూడా ఉండేవి. ఆమె వాటన్నిటినీ అమ్మేసేవారు" అని సిల్వియాన్ గుర్తుచేసుకున్నారు.

బ్రిటన్‌లో కూడా మేం తయారుచేసే మోడల్స్‌కు డిమాండ్ పెరిగింది.

నా తల్లిదండ్రులకు వ్యాపారం పెంచుకోవాడం ఎంత ముఖ్యమో నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం.

"మేం చాలా క్లిప్స్ అమ్మాం. అలాగే, చాలామంది స్నేహితులను కూడా కూడగట్టుకున్నాం" అన్నారు సిల్వియాన్.

మెల్లగా వ్యాపారం విస్తరించడం, చేతిలో డబ్బులు రావడంతో విదేశాలకు ప్రయాణాలు చేయదం మొదలుపెట్టామని క్రిస్టియాన్ చెప్పారు.

"టోక్యో, టొరంటో, మొరాకోలో క్లయింట్లను కలవడానికి వెళ్లేవాడిని."

అప్పటికి నేను టీనేజీకి వచ్చేశాను. కొంచం ఇంగ్లిష్ మాట్లాడడం నేర్చుకున్న. దాంతో, మా నాన్న నన్ను వెంటతీసుకుని వెళ్లేవారు.

మొదటిసారి న్యూయార్క్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం, ఉత్సాహం కలిగింది. ఒక ఖరీదైన హోటల్‌లో బస చేసాం. ఆ గది కిటీకీలోంచి బయటకు చూస్తూ, నేను కూడా నా కలలను నెరవేర్చుకునే దిశలో కృషి చేయాలనుకున్నా.

'వైఫల్యాలు కూడా ఉన్నాయి'

అయితే, ఈ ప్రయాణంలో కొన్ని వైఫల్యాలు కూడా ఎదుర్కొన్నాం. ఒకసారి న్యూయార్క్‌లో ఒక క్లయింట్‌కు పంపించాల్సిన క్లిప్స్ కాకుండా వేరేవి పంపించేసాం.

కానీ, ఆ అనుభవాల నుంచి మేం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం.

ఎన్నో కష్టాలు పడి నా తల్లి మరియా నాకు జన్మనిచ్చారు. ఎన్ని కష్టాలు పడినా నేను జీవితంలో పైకి రావాలన్నదే ఆమె కోరిక.

నన్ను పెంచిన తల్లిదండ్రులు, నాకు ఆశ్రయం ఇచ్చారు. వాళ్ల మనసుల్లో చోటిచ్చారు. నా కలలు నెరవేర్చుకునేందుకు తోడ్పడ్దారు. బ్రిటన్ రమ్మని నన్ను ప్రోత్సహించారు.

వాళ్లు లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగేదాన్ని కాదు. బీబీసీ ఆఫ్రిక్స్ క్యాష్ ఎకో ప్రోగ్రామ్‌ నిర్మాతగా, వ్యాఖ్యాతగా ఈరోజు నేను మీ ముందు ఉండేదాన్ని కాదు.

ఈమధ్యే డయాస్పోరాలోని అత్యంత ప్రభావవంతమైన ఆఫ్రికన్ మహిళగా ఆరవ స్థానంలో నిలిచాను. అలాగే టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన ఆఫ్రికన్ మహిళలలో ఒకరిగా నిలిచాను.

30 ఏళ్ల క్రితం మా నాన్న సృష్టించిన వస్తువు ఇప్పుడు మళ్లీ మార్కెట్లో కనిపించడం ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను.

"పాత ఫ్యాషన్ మళ్లీ మార్కెట్లోకి రావడం జరుగుతూనే ఉంటుంది. పోనీటెయిల్స్, వదులుగా ఉండే ప్యాంట్లు మార్కెట్లోకి వచ్చినట్టే క్లా క్లిప్స్ కూడా తిరిగి మార్కెట్లోకి వచ్చాయి" అన్నారు లోరియల్‌కు చెందిన రోసో.

"ఈ కాలంలో ఆడపిల్లలు మళ్లీ ఈ క్లిప్స్ వాడడం చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఇది నిజంగా ఒక క్లాసిక్ డిజైన్" అంటున్నారు సిల్వియాన్.

ఇంత విజయం సాధించిన క్రిస్టియాన్, సిల్వియాన్‌కు విచారం కలిగించే విషయాలు ఏవైనా ఉన్నాయా?

"మేం పేటెంట్‌కు అప్లయి చేయాల్సింది. ఫ్రాన్స్‌లో దీనికి రక్షణ ఉంది కానీ, విదేశాలలో లేదు. ప్రపంచవ్యాప్యంగా వీటికి నకళ్లు పుట్టుకొచ్చాయి. మంచి విషయాలనే కాపీ చేస్తారు కాబట్టి మేం తయారుచేసింది అంత మంచి వస్తువు అని సంతోషపడాలి" అన్నారు క్రిస్టియాన్.

కానీ, నన్ను వారి కుటుంబంలోకి ఆహ్వానించడంపై వాళ్లకు ఎప్పటికీ విచారం ఉండదని నాకు తెలుసు.

"వాళ్లకి మా ఇంట్లో చోటిచ్చినప్పుడు, మమ్మల్ని జనం పిచ్చివాళ్లుగా చూసేవారు. వాళ్లు ఆఫ్రికా వలసదారులని, మీకొచ్చింది మీకే సరిపోదు, వాళ్లనేం చూస్తారని అనేవారు. కానీ, నీ చేతిని నా చేతిలోకి తీసుకున్నప్పుడు మనసులో ప్రేమ తప్ప మరో భావన కలగలేదు" అని నా పెంపుడు తండ్రి నాతో చెప్పారు.

"నిన్ను చూడగానే, నువ్వు నా బిడ్డవి" అనిపించింది అన్నారు నా పెంపుడు తల్లి స్ల్వియాన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Claw Hair Clip: 'My Dad Invented This Clip That Women Love'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X