బంగాళాఖాతంలో ఆవర్తనం: ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో ఎండ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చిన ఉక్కపోత ప్రభావం తగ్గుతోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకుపైగా నమోదవుతూ వచ్చిన ఉష్ణోగ్రత ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. వడగాలుల తీవ్రతలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం చల్లగాలులు పలకరిస్తోన్నాయి. దీంతో ఉపశమనం లబిస్తోంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఈదురుగాలులు వీస్తోన్నాయి.
ఇదే పరిస్థితి.. నేడు కూడా కొనసాగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణం కొంత చల్లగా మారుతుందని, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అక్కడక్కడ ఈదురుగాలులు సైతం బీభత్సాన్ని సృష్టించాయి. ట్రోపోస్ఫియర్ లో వీస్తోన్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడ్డాయి. నేడు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకూ ఇదే పరిస్థి ఉండొచ్చు. అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడొచ్చు. పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశాలు లేకపోలేదు.
నేడు ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లిల్లో చెదురుమదురుగా వర్షాలు పడనున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం నెలకొంటుంది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద, పొలాల్లో ఉండకూడదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు అల్లూరి జిల్లా అనంతగిరి, పోలవరం జిల్లా గుర్తేడు, అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలాల్లో తీవ్రవడగాలులు, ముంచింగిపుట్టు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం,చీడికాడ, చోడవరం, దేవరపల్లి, మాడుగుల, పరవాడ మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications