విజయ్ పేరులో మార్పు వెనుక?
తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలు కాబోతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. ఇంకాస్సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. బీజేపీ, ఏఐఏడీఎంకేలను అధికారానికి దూరంగా ఉంచాలనే ధ్యేయంతో చిన్న పార్టీలతో దీర్ఘకాల చర్చల తర్వాత ఈ ప్రభుత్వం కొలువుదీరింది.
ముఖ్యమంత్రిగా విజయ్ తో పాటు మొత్తం తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు సమర్పించిన మంత్రుల జాబితా ప్రకారం.. బస్సీ ఎన్ ఆనంద్- టీనగర్, ఆధవ్ అర్జున (విల్లివాక్కం), కేజీ అరుణ్ రాజ్ (తిరుచెంగోడు), కేఏ సెంగోట్టయ్యన్ (గోబిచెట్టిపాళ్యం), పీ వెంకటరమణన్ (మైలాపూర్), సీటీఆర్ నిర్మల్ కుమార్ (తిరుప్పరన్‌కుండ్రం), రాజ్‌మోహన్ (ఎగ్మోర్), టీకే ప్రభు (కారైకుడి), ఎస్ కీర్తన (శివకాశి) ఉన్నారు.

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేదిక బ్యానర్లపై 'జోసెఫ్ విజయ్' అనే పేరు ముద్రించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయన పూర్తి పేరు.. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. చంద్రశేఖర్.. ఆయన నాన్న పేరు. సింపుల్ గా విజయ్ పేరుతో స్టార్ డమ్ సంపాదించారు. 'విజయ్' గానే వెండితెరకు పరిచయం అయ్యారు. ఇన్ని సంవత్సరాల పాటు అదే పేరుతో కొనసాగారు. ఆయన పూర్తి పేరు ఏమిటనేది వెలుగులోకి వచ్చింది కూడా రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాతే.
ఇప్పుడు జోసెఫ్ విజయ్ అనే పూర్తిపేరును ప్రమాణ స్వీకారోత్సవ బ్యానర్ పై ముద్రించారు. అదే పేరుతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం నుంచి అన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ పేరునే పొందుపరుస్తారని తెలుస్తోంది. మొదటగా బీజేపీ నాయకుడు హెచ్ రాజా.. జోసెఫ్ విజయ్ అనే పేరును ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అనేక బహిరంగ సభలలో ఆయన్ని పదేపదే 'జోసెఫ్ విజయ్' గా సంబోధించారు. విజయ్ క్రైస్తవ మతానికి చెందినవారని చాటడమే ఆయన ఉద్దేశ్యం. ఇప్పుడు దాన్నే కొనసాగించనున్నారు విజయ్.












Click it and Unblock the Notifications