• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దులో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, ఈ ఉద్రిక్తతలకు కారణమేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు

రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ ఉద్రిక్తతల పట్ల పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వివాదాలు పెరిగి యుద్ధానికి దారి తీస్తే, దాని మంటలు యూరోప్ మొత్తానికి అంటుకుంటాయని, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అంత దారుణమైన పరిస్థితులను ప్రపంచం చూడలేదని ఆందోళన పడుతున్నాయి.

ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దులో ట్యాంకులు, ఫిరంగిదళాలతో పాటు లక్ష మంది సైనికులను రష్యా మోహరించిందని పాశ్చాత్య దేశాల నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. జనవరి చివరి నాటికి ఆ సంఖ్య 1.75 లక్షలకు పెరగవచ్చని అమెరికా భావిస్తోంది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రకటిస్తే "తీవ్ర ఆర్థిక పరిణామాలు" చోటుచేసుకుంటాయని అమెరికా, దాని నాటో మిత్రదేశాలు ఇప్పటికే హెచ్చరించాయి.

కానీ, రష్యా "ఈ ఆట ఆడేందుకే" సిద్ధపడుతోంది.

రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు

నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)లో ఉక్రెయిన్‌కు చోటు దక్కకుండా ఉండేందుకే రష్యా ఈ వ్యూహాన్ని అవలంబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇస్తే తమ దేశ సరిహద్దుల్లో నాటో స్థావరాలు బలపడతాయని రష్యా భయపడుతోంది.

అయితే, తమ వల్ల రష్యాకు ఎలాంటి ముప్పు ఉండదని నాటో హామీ ఇచ్చింది.

ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య వివాదాలను నాటోతో ముడిపెట్టి చూస్తున్నారు విశ్లేషకులు.

కానీ, గతంలో అనేకసార్లు ఈ రెండు దేశాల మధ్య సంఘర్షణలు చోటుచేసుకున్నాయి.

2014లో రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేసి క్రిమియాను స్వాధీనం చేసుకుంది.

ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలో ఇంకొంచెం వెనక్కి వెళ్లి చూడాలి.

రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు

గతంలో ఉక్రెయిన్ రష్యాలో భాగం

ఒకప్పుడు ఉక్రెయిన్, రష్యా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 1991లో సోవియట్ యూనియన్‌ను రద్దు చేసిన తరువాత ఉక్రెయిన్‌కు స్వాతంత్ర్యం లభించింది.

అప్పటి నుంచి రష్యా నీడ నుంచి బయటపడేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తూనే ఉంది. ఇందుకోసం ఉక్రెయిన్ పశ్చిమ దేశాలతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంది.

ఉక్రెయిన్ తూర్పు, ఉత్తర భాగాల్లో రష్యాతో పొడవైన సరిహద్దు కలిగి ఉంది.

2010లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికైన విక్టర్ యనుకోవిచ్ రష్యాతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. అందువల్లే, యూరోపియన్ యూనియన్‌లో చేరే ఒప్పందాన్ని తిరస్కరించారు.

ఫలితంగా, భారీ నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో 2014లో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆ తరువాత, అక్కడి వేర్పాటువాదులతో చేతులు కలిపి రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేసింది. క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది.

ఉక్రెయిన్ వేర్పాటువాదులకు రష్యా డబ్బు, ఆయుధాలు సరఫరా చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు

అయితే, ఈ వాదనలను రష్యా తిరస్కరించింది. కానీ, వేర్పాటువాదులకు బహిరంగంగా మద్దతు తెలిపింది.

ఉక్రెయిన్ తూర్పు భాగంలో ఉన్న డాన్‌బాస్ నగరం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి ప్రాంతం. 2014లో జరిగిన యుద్ధంలో డాన్‌బాస్‌లో 14,000 మందికి పైగా మరణించారు.

తిరుగుబాటుదారులకు రష్యా సైనిక సహాయం కూడా అందిస్తోందని ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి.

అయితే, తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్న పౌరులు వలంటీర్లని రష్యా అంటోంది.

2015లో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందానికి ఫ్రాన్స్, జర్మనీ మధ్యవర్తిత్వం వహించాయి. దాంతో, యుద్ధం ఆగిపోయింది కానీ, రాజకీయ పరిష్కారమేదీ లభించలేదు.

ఈ సంవత్సరం ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలు సైనిక విన్యాసాలు ప్రారంభించడంతో కాల్పుల విరమణ ఉల్లంఘనలు తీవ్రమయ్యాయి. కానీ, ఏప్రిల్‌లో రష్యా కొంత వెనక్కి తగ్గడంతో పరిస్థితి మెరుగుపడింది.

ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దులో ఏం జరుగుతోంది?

రష్యా 1.75 లక్షల మంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించనుందని, వారిలో సగం మందిని ఇప్పటికే వేర్వేరు ప్రదేశాల్లో మోహరించిందని, 2022 ప్రారంభంలో రష్యా దాడి చేయవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు గత వారం ఆందోళన వ్యక్తం చేశారు.

తమ సరిహద్దులకు కొద్ది దూరంలోనే రష్యా 90,000 మంది సైనికులను మోహరించినట్లు ఉక్రెయిన్ ఫిర్యాదు చేసింది.

రష్యా 41వ ఆర్మీకి చెందిన యూనిట్ ఆ దేశంలోని యెల్నాయ నగరానికి సమీపంలో ఉందని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నగరం ఉక్రెయిన్ ఉత్తర సరిహద్దు నుంచి కేవలం 260 కి.మీ. దూరంలో ఉంది.

ఉక్రెయిన్ సమీపంలో రష్యా ఆక్రమిత క్రిమియాలో 94,300 మంది రష్యన్ సైనికులు ఉన్నారని, జనవరిలో వీరి సంఖ్య "భారీగా పెరగవచ్చని" ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోఫ్ శుక్రవారం చట్టసభలో వెల్లడించారు.

అయితే, ఉక్రెయిన్ సమీపంలో సేనల మోహరింపుపై రష్యా నుంచి ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.

తమ భూభాగంలో తమ సైన్యాన్ని మోహరించడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాత్రం పేర్కొంది.

రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు

తాజా ఉద్రిక్తతలకు కారణం?

2015 శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ గౌరవించలేదని, ఈ ఒప్పందాన్ని పాటించేలా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకురాలేదని రష్యా ఆరోపించింది.

ఈ ఒప్పందంలో భాగంగా తిరుగుబాటుదారులకు క్షమాభిక్ష ప్రకటించి, స్వతంత్రం ఇవ్వాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చింది. కానీ, అది జరగలేదు.

ఇది అమలు కాకపోవడానికి రష్యానే కారణం అంటూ ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా మద్దతుగల వేర్పాటువాదులు కాల్పుల విరమణను ఉల్లంఘించారని, రష్యా సైనికదళాలు తూర్పున తిరుగుబాటుదారుల కోటలో ఉన్నాయని పేర్కొంది.

అయితే, రష్యా ఈ వాదనలను ఖండిస్తోంది.

ఈ వాదోపవాదాల మధ్య, ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీలతో సమావేశం కావడానికి రష్యా నిరాకరించింది.

2015 శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరించకపోవడం అర్థరహితమని పేర్కొంది.

మరోవైపు, ఉక్రెయిన్‌కు ఆయుధాల సహాయం చేస్తూ, ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నందుకు అమెరికా, దాని మిత్ర దేశాలపై రష్యా విరుచుకుపడుతూనే ఉంది.

దీనివల్ల, ఉక్రెయిన్ బలం పెరిగి తిరుగుబాటు దారుల భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించింది.

రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు

తూర్పు భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉక్రెయిన్ చేస్తున్న సైనిక ప్రయత్నాలు "ఆ దేశ హోదాకు తీవ్ర పరిణామాలు" కలిగిస్తాయని ఈ ఏడాది ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.

రష్యన్లు, ఉక్రెనియన్లు ఒకటేనని, సోవియట్ కాలంలో పొరపాటుగా ఉక్రెయిన్‌కు రష్యా భూభాగంపై అధికారం లభించిందనే అభిప్రాయాన్ని పుతిన్ పలుమార్లు వ్యక్తం చేశారు.

అలాగే, ఉక్రెయిన్, నాటోలో చేరుతుందనే భయం కూడా పుతిన్‌కు ఉంది. నాటో సభ్యులు ఉక్రెయిన్‌లో సైనిక శిక్షణా కేంద్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారని, నాటోలో చేరకుండానే ఉక్రెయిన్ దానికి మద్దతు ఇస్తోందని పుతిన్ పేర్కొన్నారు.

అమెరికా, దాని మిత్రదేశాల నుంచి రష్యాకు "విశ్వసనీయమైన, దీర్ఘకాలికమైన భద్రతా హామీలు" కావాలని గత వారం పుతిన్ నొక్కిచెప్పారు. నోటి మాట కాకుండా చట్టబద్ధమైన హామీ కావాలని కూడా పుతిన్ స్పష్టం చేశారు.

గత వారం, ఇదే అంశంపై పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మధ్య వర్చువల్ సమావేశం జరిగింది.

ఆ సమావేశంలో పుతిన్ తన డిమాండ్ల గురించి బైడెన్‌కు తెలియజేసినట్లు రష్యా విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి ఉషాకోఫ్ చెప్పారు.

అయితే రష్యా డిమాండ్లను అమెరికా పట్టించుకోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

జోబైడెన్ వ్లాదిమిర్ పుతిన్

పుతిన్ వ్యూహం

సైనిక శక్తిని ప్రదర్శించే వ్యూహం పని చేసిందని ఏప్రిల్‌లో రష్యా భావించింది. అందుకే, మళ్లీ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.

“ఇటీవల మా హెచ్చరికలను వినిపించాం. అవి ప్రభావం చూపించినట్టున్నాయి. ఉద్రిక్తత పెరిగింది” అని అధ్యక్షుడు పుతిన్ గత వారం రష్యా దౌత్యవేత్తలతో అన్నారు.

ఉద్రిక్తత పెరిగితే పశ్చిమ దేశాలు రష్యాపై దృష్టి పెడతాయని, దానిని నిర్లక్ష్యం చేయవని పుతిన్ భావిస్తున్నారు.

"ఉక్రెయిన్ సమీపంలో సైనిక కార్యకలాపాలు పెరిగినంత మాత్రాన రష్యా ప్రత్యక్ష యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు కాదు. అది పుతిన్ ఇవ్వాలనుకుంటున్న సందేశానికి సూచిక మాత్రమే" అని మాస్కోలోని థింక్ ట్యాంక్ ఆర్ఐఏసీకి చెందిన ఆండ్రీ కోర్టునోఫ్ అన్నారు.

అంటే, డాన్‌బాస్ మీద మళ్లీ నియంత్రణ కోసం ప్రయత్నించడం లాంటి తెలివితక్కువ పనులేవీ చేయద్దని ఉక్రెయిన్‌కు పుతిన్ ఆ సందేశం ఇస్తున్నారు.

ఉక్రెయిన్‌కు నాటో బలగాలను పంపించవద్దని, అత్యాధునిక ఆయుధాలు లాంటివి అందించవద్దని పశ్చిమ బలగాలకు రష్యా సందేశం ఇస్తోందని కోర్టునోఫ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Clouds of war looming over the border between Russia and Ukraine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X