ఫోన్ కాల్ లీక్ ఎఫెక్ట్.. పదవి నుంచి థాయిలాండ్ ప్రధాని ఔట్ !
థాయిలాండ్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రి పేటోంగ్‌తార్న్ షినవత్రాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెను పదవి నుంచి తొలగిస్తూ రాజ్యాంగ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కంబోడియా మాజీ నాయకుడు హున్ సేన్ తో ఆమె జరిపిన టెలిఫోన్ సంభాషణలో నైతిక ఉల్లంఘన జరిగిందని తేల్చింది. ఈ కాల్ బయటకు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పేటోంగ్ తార్న్ దేశ ఆర్మీ జనరల్‌ను విమర్శించడం, కంబోడియా వైపు మొగ్గు చూపడం పట్ల సర్వత్రా మండిపడ్డారు.
షినవత్రా వంశానికి మరో దెబ్బ..
పేటోంగ్‌తార్న్ తండ్రి థాక్సిన్ షినవత్రా కూడా దేశ మాజీ ప్రధానమంత్రి. గత రెండు దశాబ్దాలుగా షినవత్రా కుటుంబానికి చెందిన నేతలు లేదా వారి మద్దతుదారులు సైన్యం-న్యాయవ్యవస్థల జోక్యంతో పదవి నుంచి తొలగించబడ్డారు. పేటోంగ్‌తార్న్ తొలగింపుతో ఆ వంశానికి మరో పెద్ద దెబ్బ తగిలింది.

కొత్త ప్రధానమంత్రి ఎంపికపై అనిశ్చితి..
ఇప్పుడంతా కొత్త ప్రధానమంత్రి ఎంపికపై దృష్టి సారించారు. ఫేయు థాయ్ పార్టీకి కేవలం స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది, దాంతో సంకీర్ణాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. తాత్కాలికంగా ఉపప్రధాని ఫుమ్తామ్ వెచైచాయ్ ప్రభుత్వం నడిపించనున్నారు.
ప్రధాని రేసులో ఎవరు?
ప్రముఖ అభ్యర్థులలో 77 ఏళ్ల చైకాసెం నితిసిరి (ఫేయు థాయ్ పార్టీ) పేరు వినిపిస్తోంది. అయితే ఆయనకు రాజకీయ అనుభవం తక్కువ. మాజీ సైనిక నాయకుడు ప్రయుత్ చాన్-ఓచా ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ, ఆయన మద్దతుదారులు ప్రభావం చూపవచ్చు. మరోవైపు అనుతిన్ చార్న్‌విరకుల్, పేటోంగ్‌తార్న్ ప్రభుత్వానికి ఇటీవల మద్దతు ఉపసంహరించుకున్నందున ఆయన కూడా ప్రధానిగా చర్చలో ఉన్నారు.
గత 17 ఏళ్లలో రాజ్యాంగ కోర్టు ఐదుగురు ప్రధానులను తొలగించింది. ఈ తీర్పు కూడా దేశంలో రాజకీయ అనిశ్చితిని మరింతగా పెంచింది. ఆర్థిక వృద్ధి మందగించడం, సంస్కరణలు నిలిచిపోవడం, పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఒత్తిడి-ఇవి అన్ని థాయిలాండ్‌ను అస్థిరత వైపు నెట్టివేస్తున్నాయి.












Click it and Unblock the Notifications