• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా

By BBC News తెలుగు
|

వ్యాక్సీనేషన్

అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సీన్ తయారీ సామర్థ్యాలను పెంచుకోకుండా బ్రిటన్, అమెరికా సహా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయని బీబీసీ న్యూస్‌నైట్ షోకి అందిన లీకైన పత్రాలు సూచిస్తున్నాయి.

కరోనా వ్యాక్సీన్ విషయంలో చాలా వరకూ పేద దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సాయం కోరాయి.

అయితే వాటికి సాయం చేసేందుకు వీలు కల్పించేలా ఉన్న అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా ధనిక దేశాలు పనిచేస్తున్నాయి. ఈ అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానంపై జరిగిన సంప్రదింపులకు సంబంధించి లీకైన పత్రంలో ఈ వివరాలు ఉన్నాయి.

ఈ ప్రయత్నాలు చేస్తున్న ధనిక దేశాల్లో బ్రిటన్, అమెరికాతోపాటు యురోపియన్ యూనియన్ కూడా ఉన్నాయి.

''దేశాలు వేటికవే వ్యాక్సీన్లను అంతర్గతంగా తయారుచేసుకోవడాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను బ్రిటన్ వ్యతిరేకిస్తోంది. అలాంటి ప్రతిపాదనలను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది’’ అని ఔషధాలు అందరికీ అందుబాటులో ఉండాలని పోరాడుతున్న జస్ట్ ట్రీట్‌మెంట్ సంస్థకు చెందిన డెయిర్మేడ్ మెక్ డోనల్డ్ అన్నారు.

వ్యాక్సీన్

మరోవైపు... ''అంతర్జాతీయ సంక్షోభానికి అంతర్జాతీయ పరిష్కారాలు అవసరం. బ్రిటన్ ఈ విషయంలో ముందుండి నడిపిస్తోంది. కోవిడ్ వ్యాక్సీన్లు, చికిత్సలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది’’ అని బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అంటున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఏడాదిలో వంద కోట్ల కరోనా వ్యాక్సీన్ డోసులు అందించాలని అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఇందుకోసం అత్యధికంగా తోడ్పాటు అందిస్తున్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటని అన్నారు.

అంతర్జాతీయంగా కోవిడ్‌పై వ్యాధి నిరోధకత రావడానికి అందరికీ వ్యాక్సీన్లు సమానంగా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

''వ్యాక్సీన్లు అవసరమైన దాంట్లో ఇప్పుడు అంతర్జాతీయంగా 33 శాతం మేర మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇవి చాలా వరకూ ధనిక దేశాల్లో తయారై, అక్కడే ఉండిపోయేవే’’ అని ఔషధ విధానాల నిపుణురాలు ఎలెన్ టీహెయెన్ అన్నారు.

వ్యాక్సీన్లను తీసుకోవడంలోనే కాదు, వ్యాక్సీన్ల తయారీలోనూ తమ వాటా ఉండాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుకుంటున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

వ్యాక్సీన్ తయారీ

వ్యాక్సీన్ తయారు చేయడానికి దాని తయారీ హక్కులు పొందడం ఒక్కటే సమస్య కాదు. దాని తయారీకి అవసరమైన సంక్లిష్టమైన సాంకేతికత కూడా కావాలి.

పేటెంట్ల విషయంలో వెసులుబాటులు ఇచ్చే అధికారం ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేదు. కానీ, వ్యాక్సీన్ తయారీ సామర్థ్యాలు పెరిగేలా చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

పేటెంట్ల విషయంలో, దేశాలకు సాంకేతిక సాయం అందించే విషయంలో అంతర్జాతీయ చట్ట నిబంధనలను ఉపయోగించుకునే అంశం కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే.

అయితే, పేటెంట్ల విషయంలో సడలింపులు ఇవ్వడం మొదలుపెడితే... కోవిడ్‌కు, అలాంటి ఇతర వ్యాధులకు పరిష్కారాలు కనిపెట్టే విషయంలో మున్ముందు సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తాయని ఫార్మా సంస్థల ప్రతినిధులు అంటున్నారు.

ఈ నెల ఆరంభంలో అమెరికాలోని ఫార్మా సంస్థల ప్రతినిధులు ఈ విషయమై ఆ దేశ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు.

వ్యాక్సీనేషన్

పేటెంట్ హక్కులను సంరక్షించేలా ఇప్పుడున్న నిబంధనలను సడలించడం వల్ల ఉత్పత్తి వేగవంతమేమీ కాదని వారు అంటున్నారు. వ్యాక్సీన్‌లపై ప్రజల విశ్వసనీయత కూడా దెబ్బతింటుందని వారు వాదిస్తున్నారు.

''కాలం గడుస్తున్న కొద్దీ వ్యాక్సీన్ల రంగంలో పనిచేసే సంస్థలు తగ్గిపోవడం చూస్తున్నాం. ఎందుకంటే ఇందులో లాభాలు తక్కువ. పేటెంట్ల విషయంలో వెసులుబాటులు కల్పిస్తూ పోతే, భవిష్యతులో ఈ విషయంలో పరిశోధనలు ముందుకు సాగడం కూడా కష్టమవ్వచ్చు’’ అని వ్యాక్సీన్ ఇమ్యునాలజీ నిపుణురాలు అన్నే మూర్ అన్నారు.

''కోవిడ్ సంక్షోభంలో ప్రస్తుత అత్యవసర పరిస్థితి దాటిన తర్వాత వ్యాక్సీన్ల ధరలు పెరగొచ్చు. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము కూడా వీటి ఉత్పత్తిలో భాగం కావాలనుకుంటున్నాయి’’ అని ఎలెన్ టీహెయెన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: Are rich countries preventing other countries from developing the vaccine?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X