Coronavirus: భయపెడుతున్న విమాన ప్రయాణం- దాదాపు ప్రతీ విమానంలోనూ ఆనవాళ్ల గుర్తింపు..
రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ భూతం మళ్లీ కోరలు చాస్తోంది. దేశ విదేశాల్లో ప్రయాణికుల ద్వారా, ప్రయాణాల ద్వారా ఈ వైరస్ మరోసారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు గుర్తించి, శాంపిల్స్ ను ల్యాబ్ లకు పంపి పరిశోధనలు చేస్తున్నారు. మలేషియాలో ఇలా చేస్తున్న పరిశోధనల తర్వాత ఓ కీలక వాస్తవం బయటపడింది.
ప్రస్తుతం మలేషియా గాల్లో ఎగురుతున్న దాదాపు ప్రతీ విమానంలోనూ కరోనా వైరస్ ఆనవాళ్లున్నట్లు గుర్తించారు. మలేషియాకు చెందిన నేషనల్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ ప్రకారం కౌలాలంపూర్‌లోని 29 విమానాల నుండి తీసిన మురుగునీటి నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు వాటిలో 28లో కరోనావైరస్ కనుగొన్నారు. 29వ నమూనాపై పరీక్ష జరుగుతోంది. జూన్ నుండి డిసెంబర్ 2022 వరకు అంతర్జాతీయ ఎంట్రీ పాయింట్ల వద్ద ఈ శాంపిల్స్ సేకరించారు. అదే సమయంలో ల్యాబ్ దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 15 సెంటినల్ స్థానాల నుండి 301 నమూనాలను పరీక్షించింది.

ప్రస్తుతం ప్రయాణిస్తున్న విమానాల్లో 95.7% వాటిలో "SarsCoV-2 288 వైరస్ ను శాంపిల్స్ ద్వారా గుర్తించారు. ఆరోగ్య డైరెక్టర్ జనరల్ డాక్టర్ నూర్ హిషామ్ అబ్దుల్లా మలేషియా వార్తాపత్రిక సినార్ హరియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎయిర్‌క్రాఫ్ట్ మురుగునీటి నిఘా ప్రక్రియలో శుద్ధి చేయని మురుగునీరు, మురుగు కాలుష్యం కోసం శాంపిల్స్ పరీక్ష ఉంటుంది. SARS-CoV-2 వైరస్ యొక్క RNA శకలాలు ప్రయాణికుడి ఆరోగ్యంతో సంబంధం లేకుండా మలంలో కనిపిస్తాయి అలాగే మురుగునీటిలో గుర్తిస్తారు. వైరస్ ఈ రూపం అంటువ్యాధి మాత్రం కాదని, మలం ద్వారా సంక్రమించదని గుర్తించారు.
విమానం నుండి మురుగునీటిని సెప్టిక్ ట్యాంక్ ట్రక్ ద్వారా విమాన వ్యర్థాలను పారవేసే సదుపాయానికి తీసుకువెళతారు. అలాగే అనుమానం ఉన్న విమానాలను గుర్తించిన తర్వాత, అధికారులు మురుగునీటిని శుద్ధి చేయడానికి ముందు శాంపిల్స్ తీసుకుని వాటిని ల్యాబ్ కు పంపుతున్నారు. విమానం నుండి మురుగు నీటి నమూనాలను వారానికి రెండుసార్లు తీసుకుని ఇలా ప్రయోగాలు చేస్తున్నట్లు డాక్టర్ అబ్దుల్లా వెల్లడించారు. కోవిడ్ ప్రమాదంలో ఉన్న దేశాల్ని గుర్తించేందుకు మలేషియా ఆరోగ్యశాఖ ఇలా శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రయాణికుల్ని ముందస్దుగా హెచ్చరించేందుకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications