Lanzhou: చైనాలో మళ్లీ పేలిన కరోనా బాంబు: 4 మిలియన్ల జనాభా ఉన్న సిటీలో లాక్‌డౌన్
బీజింగ్: సుమారు రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి జన్మనిచ్చినట్టుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డ్రాగన్ కంట్రీ.. చైనా మరోసారి లాక్‌డౌన్‌లో వెళ్లింది. ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ప్రకటించింది. కొద్దిరోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని- ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.

లాంగ్ఝౌలో లాక్‌డౌన్..
చైనాకు వాయవ్య దిశలో ఉన్న లాంగ్ఝౌ (Lanzhou) సిటీలో కొత్తగా లాక్‌డౌన్‌ను విధించింది చైనా ప్రభుత్వం. దీన్ని కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించింది. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రాకూడదని సూచించింది. భౌగోళికంగా కీలకమైన గన్సు ప్రావిన్స్ రాజధాని ఈ లాంగ్ఝౌ సిటీ. ఈ ఒక్క సిటీలో సుమారు నాలుగు మిలియన్ల జనాభా ఇక్కడ నివసిస్తోంది. ఇక్కడ కొద్దిరోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తోండటంతో తక్షణ చర్యలకు దిగింది. లాక్‌డౌన్‌ను ప్రకటించింది.

అత్యవసర సర్వీసులు మినహాయించి..
అత్యవసర సర్వీసులు మినహాయించి.. మిగిలిన అన్ని రకాల సేవలు నిలిపివేయాలని స్థానిక అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ప్రజా రవాణాను స్తంభింపజేశారు. దుకాణ సముదాయాలన్నింటినీ మూసివేయాలంటూ ఆదేశించారు. ఈ నగరం సరిహద్దులను మూసివేశారు. బయటి వ్యక్తులను ఎవరినీ లోనికి రానివ్వట్లేదు. అలాగే స్థానికులను బయటికి పంపించట్లేదు. వైద్య సేవలు వంటి అత్యవసర సర్వీసులను మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయించారు.

కొత్త కేసులతో..
నిజానికి- ఈ నగరంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేవు. కొత్త కేసులు ఆరు మాత్రమే రికార్డయ్యాయి. చైనా వ్యాప్తంగా మొత్తంగా 29 పాజిటివ్ కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. దీనితో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదైన లాంగ్ఝౌ సిటీలో లాక్‌డౌన్ విధించింది. దీన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.

డెల్టా వేరియంట్..
లాంగ్ఝౌ సిటీలో నాలుగు మిలియన్ల మందికి పైగా నివసిస్తున్నందున.. చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తోన్నారు. సాధారణ వైరస్‌తో పోల్చుకుంటే.. శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్న కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీనివల్ల ఈ సిటీలో పాజిటివ్ కేసులు పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

50 లక్షలకు చేరువైన కరోనా మరణాలు..
చైనాలో 2019లో డిసెంబర్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. హ్యుబే ప్రావిన్స్‌లోని వుహాన్ సిటీలో మొదలైన కరోనా వైరస్ దండయాత్ర ప్రపంచం మొత్తాన్నీ అతలాకుతలం చేసింది. లక్షలాదిమంది ప్రాణాలను బలి తీసుకుంది. కోట్లాదిమందిని ఆసుపత్రుల పాలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 49,71,243కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసులు 24,48,72,248కు చేరుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్, భారత్‌లల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications