షాకింగ్: కరోనా సోకిన తొలి శునకం మృతి - రక్తపు వాంతులతో దారుణంగా - అమెరికాలో నిమిషానికో మరణం
పాండమిక్ తాండవం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో రోజులు గడుస్తున్నకొద్దీ అవగతమవుతున్నది. చిన్నాపెద్దా, రాజుపేదా తేడా లేకుండా అందరినీ బలితీసుకుంటోన్న కరోనా వైరస్.. ఇప్పుడు మూగజీవాలను కూడా తన ఖాతాలో కలిపేసుకుంటున్నది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన మొట్టమొదటి శునకం అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. కరోనా కేసుల్లో ఎవరెస్టు స్థానానికి ఎగబాకిన అమెరికాలో నిమిషానికి ఒక్కోరు చొప్పున ప్రాణాలు కోల్పోతుండటం అక్కడి భయానక స్థితికి అద్దంపడుతున్నది.

ఎలా సోకింది?
న్యూయార్క్ సిటీలోని ఐదు స్వయం పాలిత ప్రాంతాల్లో ఒక్కటి స్టేటెన్ ఐలాండ్. అక్కడ నివసించే రాబర్ట్ అనే వ్యక్తి.. ‘బడ్డీ' అనే పెంపుడు కుక్క ఉండేది. ఏప్రిల్ లో రాబర్ట్ కుటుంబం కరోనా బారినపడింది. వాళ్లు వ్యాధి నుంచి కోలుకునేలోపే బడ్డీ కూడా అస్వస్థతకు గురైంది. టెస్టులు చేయగా, దానికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అలా ప్రపంచంలోనే కరోనా సోకిన తొలి శునకంగా బడ్డీ పేరు రికార్డులకెక్కింది. అయితే, వైరస్ మనిషి నుంచి కుక్కకు సోకిందా, లేదా అనే విషయాన్ని సైంటిస్టులు తేల్చలేకపోయారు. బడ్డీ తర్వాత అమెరికాలో మరో 12 కుక్కలు, 10 పిల్లులు, ఒక పులి, మరో సింహం కరోనా బారిన పడ్డట్లు యూఎస్ అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఈలోపే..

రక్తం కక్కుకుంటూ..
ఏప్రిల్ లో కరోనా కాటుకు గురైన కుక్కను వెటర్నరీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కానీ రానురానూ వైరస్ ప్రభావం మరింత ముదిరిపోయి.. బడ్డీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. నాసికా రంధ్రాలు పని చేయకపోవడం లాంటి సమస్యలతోనూ అది బాధపడింది. మూడు నెలల ట్రీట్మెంట్ తర్వాత కూడా కోలుకోలేకపోయిన ఆ శునకం.. చివరి దశలో రక్తపు వాంతులు చేసుకుందని, జులై 11న అది తుది శ్వాస విడిచిందని ప్రఖ్యాత ‘నేషనల్ జియోగ్రాఫిక్' సంస్థ శుక్రవారం వెల్లడించింది.

అమెరికాలో మృత్యేహేల..
మొత్తం 46.4 లక్షల కేసులతో కరోనాకు మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా ఉన్న అమెరికాలో వైరస్ ధాటికి అక్షరాల లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయానికి మొత్తం మరణాల సంఖ్య 1.55లక్షలకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 6.77లక్షలుగా ఉంది. అమెరికాలో వరుసగా మూడో మూడో వారంలోనూ రోజూ వెయ్యికి తక్కువ కాకుండా మరణాలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 29 నుంచి ఏప్రిల్ 23 వరకు (54 రోజుల వ్యవధిలో) 50వేల మంది చనిపోయారని, మే, జూన్ లో మరణాల ఉధృతి కాస్త తగ్గినా, జులై మొదటి వారం నుంచి భారీగా ఉంటున్నాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఆరిజోనా రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉంది.
Recommended Video

ఇండియాదే కీలక పాత్రంటోన్న యూఎస్
కొవిడ్-19 విరుగుడు వ్యాక్సిన్ కోసం భారత్ సహా అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అయితే, అందరిలోకీ ఇండియాదే కీలక పాత్ర అని వైట్ హౌజ్ కొవిడ్ టాస్క్ ఫోర్స్ మెంబర్ ఆంటోనీ ఫౌచీ అన్నారు. అమెరికాలో ప్రఖ్యాత వైరాలజిస్టుగానూ పేరుపొందిన ఆయన గురువారం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మాట్లాడారు. అమెరికన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్)తోపాటు మరికొన్ని సంస్థలు భారత్ తో కలిసి పని చేస్తున్నాయి. సమర్థవంతమైన వ్యాక్సిన్ రూపొందేలా భారత సైంటిస్టులకు సహకరిస్తామని ఫౌచీ తెలిపారు.












Click it and Unblock the Notifications