వ్యాక్సిన్ తీసుకున్న యూఎన్ చీఫ్ -టీకాల ఉత్పత్తిలో ఇండియాకు కితాబు
దాదాపు ఏడాదిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 22లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 10.21కోట్లకు పెరిగింది. అయితే, గడిచిన నెల రోజులుగా చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటం, కొత్త కేసులు క్రమంగా తగ్గుతుండటం శుభపరిణామంగా ఉంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.
71 ఏళ్ల గుటెర్రస్, న్యూయార్క్ నగరంలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో కరోనా టీకా వేయించుకున్నారు. వీలైనంత త్వరగా ప్రజలంతా టీకాలను తీసుకోవాల్సిందిగా యూఎన్ చీఫ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రభుత్వాలకు సూచించారు.

కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి సిబ్బంది, దౌత్యవేత్తలకు భాగం కల్పించినందుకు న్యూయార్క్ నగరానికి యూఎన్ చీఫ్ కృతజ్ఞతలు చెప్పారు. కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధంలో పరస్పర సహకారం అతి కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కరోనా టీకాల తయారీలో భారత్ పాత్రను గుటెర్రస్ శ్లాఘించారు.

భారీ స్థాయిలో టీకాలను తయారు చేయగల భారత సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తిగా యూఎన్ చీఫ్ అభివర్ణించారు. భారత్‌లో దేశీయంగా అనేక టీకాలు తయారవుతున్న విషయం తమకు తెలుసని పేర్కొన్నారు. ఆయా సంస్థలతో ఐక్యరాజ్యసమితి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించేందుకు భారత్ సైతం సిద్ధంగా ఉందని తాము ఆశిస్తున్నామని గుటెర్రస్ అన్నారు.












Click it and Unblock the Notifications