రాజాచారి..అంతరిక్షయాత్ర: మిషన్ కమాండర్‌గా: నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్
వాషింగ్టన్: తెలుగు మూలాలు ఉన్న వ్యోమగామి రాజా చారి అంతరిక్ష యాత్ర మొదలైంది. అంతరిక్ష పరిశోధన కేంద్రానికి స్పేస్ ఎక్స్ పంపించిన నాలుగురు వ్యోమగాములు ఉన్న ఈ మిషన్‌కు ఆయనే కమాండర్. ఇదివరకు- చంద్రుడిపైకి పంపించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టనున్న మిషన్ మూన్ ప్రాజెక్ట్‌కు కూడా రాజా చారి ఎంపిక అయ్యారు. 2024లో మిషన్ మూన్ ప్రాజెక్ట్‌ను తలపెట్టింది నాసా. అంతకంటే- ముందే రాజాచారి అంతరిక్ష యాత్ర ఆరంభమైంది.

చంద్రుడి మీదికి ప్రయాణం కంటే ముందే..
స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ కోసం ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. నాసా మిషన్ మూన్ కోసం రాజాచారి ఇదివరకే పూర్తిస్థాయిలో శిక్షణ పొందారు. అందుకే- ఆయనను తన ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసింది. స్పేస్ ఎక్స్. ఈ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ రూపొందించిన ఎండ్యూరెన్స్ రాకెట్‌లో రాజాచారితో పాటు మొత్తం నలుగురిని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపించిందీ సంస్థ.

రాజాచారితో పాటు
రాజాచారి మిషన్ కమాండర్‌గా వ్యవహరిస్తోన్న ఈ టీమ్‌లో పైలెట్ టామ్ మార్ష్‌బర్న్, మిషన్ స్పెషలిస్ట్ కాయ్‌లా బ్యార్రన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు మథ్థైయాస్ మారర్ ఉన్నారు. ఈ టీమ్ ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో గడుపుతుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్-మేల్లో వారు మళ్లీ భూమికి చేరుకుంటారు. 2024లో మళ్లీ రాజాచారి నాసా తరఫున చంద్రుడి మీదికి వెళ్తారు.

నాసా స్పేస్ సెంటర్ నుంచి..
ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్‌లో గల నాసాకు చెందిన జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్స్ వారిని తీసుకెళ్లింది. స్పేస్ ఎక్స్ మిషన్ కోసం ఓ భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతమైందని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. అంతరిక్ష పరిశోధనల్లో మేలుమలుపుగా దీన్ని ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

తండ్రి.. ఓయూ పూర్వ విద్యార్థి
రాజాచారి పూర్తి పేరు రాజా జాన్ వురపుతూర్ చారి. ఆయన తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం హైదరాబాద్. తాత స్వస్థలం మహబూబ్ నగర్. శ్రీనివాసాచారి ఇదివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడే కొంతకాలం లెక్చరర్‌గా పని చేశారు. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. రాజాచారి అమెరికాలోనే పుట్టి పెరిగారు. ప్రతిష్ఠాత్మక మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2017లో వ్యోమగాముల శిక్షణ కోసం నాసా దరఖాస్తులు ఆహ్వానించగా.. రాజాచారి సహా పలువురు ఎంపిక అయ్యారు. రెండేళ్ల పాటు శిక్షణ ఇచ్చారు. షార్ట్ లిస్ట్‌ను ప్రకటించారు.

అమెరికా ఎయిర్‌ఫోర్స్ కర్నల్‌గా
తొలుత రాజాచారి యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ అండ్ ఇంజినీరింగ్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. అనంతరం మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్‌లో పీజీ చేశారు. కాలిఫోర్నియా ఎయిర్‌బేస్‌లోని 461-ఫ్లైట్ టెస్ట్ స్కాడ్రన్‌లో కమాండర్‌గా చేరారు. రాజాచారి వివాహితుడు. ఆయన భార్య పేరు హోల్లీ. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో ఇహోవా స్టేట్‌లో నివాసం ఉంటున్నారు.

2024 నాటికి మిషన్ మూన్..
మిషన్ మూన్ కోసం ఎంపికైన 18 మంది ఇక నాసా పర్యవేక్షణలో ఉంటారు. మరింత శిక్షణ పొందుతారు. 2024 నాటికి మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్‌ను నాసా చంద్రుడి మీదికి ప్రయోగించబోతోంది. ఈ మిషన్‌లో వారు భాగస్వామ్యులవుతారు. 1972 తరువాత నాసా.. చందమామ మీదికి మానవ సహిత ప్రయోగాలకు సిద్ధపడటం ఇదే తొలిసారి. చంద్రుడిపై మరింత విస్తృత ప్రయోగాలను చేపట్టడానికి ఈ మిషన్ ఉపకరిస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధునిక అమెరికాలో చేపట్టిన ఈ తొలి ప్రాజెక్ట్.. తమ అంచనాలకు మించి రాణిస్తుందని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications