వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెత్ ఐలాండ్: హిట్లర్‌ను ఓడించడానికి ఆంత్రాక్స్ ప్రయోగించడంతో ఆ ద్వీపం 50 ఏళ్ల పాటు విషంగా మారిపోయింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రరాజ్యాలకు ఒకటే లక్ష్యం.. నాజీల జర్మనీని ఓడించాలి. అందుకు అనేక రకాల ప్రణాళికలు రచించాయి. వాటిల్లో ఒకటి ఆంత్రాక్స్ పథకం.

జీవ ఆయుధాలను (బయొలాజికల్ వెపన్స్) ఉపయోగించి నాజీ సైన్యాన్ని మట్టుబెట్టాలనుకున్నాయి. కానీ, ఆ పథకం తిప్పికొట్టింది. స్కాట్లాండ్‌లోని ఒక ద్వీపాన్ని పూర్తిగా విషపూరితం చేసింది.

అయిదు దశాబ్దాల పాటు ఆ దీవిలోకి ఎవరూ అడుగుపెట్టలేకపోయారు. ఒకప్పుడు పక్షులకు అభయారణ్యంగా వెలుగొందిన ఈ ద్వీపం జీవులకు శాపంగా మారింది.

అయితే, ఈ ఆపరేషన్ ఎలా జరిగిందన్న వివరాలు చాలాకాలం రహస్యంగానే ఉండిపోయాయి .

స్థానికంగా నేటికీ ఆ దీవిని "ఆంత్రాక్స్ ద్వీపం" అనే పిలుస్తారు. "డెత్ ఐలాండ్" అని కూడా అంటారు. అదే స్కాట్లాండ్‌లోని గ్రునాడ్ ద్వీపం. దాదాపు 50 ఏళ్ల తరువాత 1990లో ఈ దీవిని "సురక్షితం"గా ప్రకటించినప్పటికీ, అక్కడ జీవితం సాధారణ స్థితికి రాలేదు.

ఆంత్రాక్స్ ద్వీపం

బ్రిటిష్ ప్రణాళిక ఎప్పుడు, ఎలా మొదలైంది?

1941 చివర్లో ఈ కథ ప్రారంభమైంది. అప్పటికి రెండవ ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతోంది. ఆ ఏడాది నాజీలు బయొలాజికల్ బాంబు తయారుచేసి, సర్వనాశనానికి ఒడిగట్టబోతున్నారనే వార్తలు వ్యాపించాయి. దాంతో, మిత్రరాజ్యాల్లో భయం మొదలైంది.

ఆ వార్తతో తీవ్రంగా కలత చెందిన అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, వెంటనే ఒక కొత్త ఆయుధాన్ని తయారుచేయమని దేశంలో అత్యంత రహస్యంగా నడిచే లాబొరేటరీ పోర్టన్ డౌన్‌లోని శాస్త్రవేత్తలను ఆదేశించారు. దానిని జర్మన్లపై ప్రయోగించేందుకు ప్రణాళిక రచించారు.

కొన్ని నెలల పరిశోధన తరువాత పోర్టన్ డౌన్‌లో శాస్త్రవేత్తలు, ఆంత్రాక్స్ (బసిలస్ ఆంత్రాసిస్‌లో ఒక రకం) ఉపయోగించి జర్మన్లపై దాడి చేయవచ్చని కనుగొన్నారు. నిజానికి ఈ సంస్థను మొదటి ప్రపంచ యుద్ధంలో విష వాయువుల అధ్యయనం చేయడానికి స్థాపించారు.

ఆంత్రాక్స్ పథకం ఏమిటి?

రక్షణ శాఖ సీక్రెట్ లాబొరేటరీలో బయోలజీ డైరెక్టర్ పాల్ ఫిల్డెస్ అందించిన వివరాల ప్రకారం, ఆంత్రాక్స్ నింపిన గుళికలను జర్మనీలో వదిలితే పశువులు వాటిని మేస్తాయి. దాంతో, మాంసం, పాల ఉత్పత్తుల పరిశ్రమ దెబ్బతింటుంది. ఆంత్రాక్స్ ప్రభావం మనుషులకూ వ్యాపించి, ప్రజలను భయాందోళలకు గురిచేస్తుంది.

1942లో ఈ పథక రచన జరిగింది. ఆంత్రాక్స్ గుళికల ఆలోచన వినగానే ఉత్సాహంతో బ్రిటిష్ మిలటరీ అధికారులు దాన్ని వెంటనే పరీక్షించాలనుకున్నారు. కానీ, ఎక్కడ, ఎలా? దీని కోసం జనావాసం లేని మారుమూల ప్రాంతం కావాలి. అయితే, ప్రధాన భూభాగం నుంచి అక్కడికి చేరుకోగలిగే వెసులుబటు ఉండాలి.

గ్రునాడ్ ద్వీపం అందుకు అనువైనదని భావించారు. కేవలం 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవి గైర్‌లోచ్, ఉల్లాపూల్ మధ్య ఉంది. వెంటనే రక్షణ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి సర్వే చేసింది.

ఆ దీవిని కొనేయడానికి అధికారులు నిశ్చయించారు. దాని యజమానులు మోలీ డన్ఫీ, ఆమె భర్త కల్నల్ పీటర్ డన్ఫీ చర్చిల్‌కు సన్నిహితులు. 500 పౌండ్లకు (సుమారు రూ. 48,256) బేరం కుదిరింది. అలా ఒక అందమైన అభయారణ్యం విధ్వంసానికి నెలవైంది.

ప్రయోగం ఎలా జరిగిందంటే...

వాస్తవంలో గ్రునాడ్ ద్వీపంలో ఏం జరిగిందనేది చాలాకాలం రహస్యంగానే ఉండిపోయింది. దీనిపై రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే, 1997లో బ్రిటన్ రక్షణ శాఖ ఒక అద్భుతమైన వీడియోను డీక్లాసిఫై చేసింది. అందులో ఈ ప్రయోగం పూర్తి వివరాలు ఉన్నాయి. ఏం జరిగింది, ఎలా జరిగిందన్నది ప్రపంచ మొత్తం చూసింది.

"ఆంత్రాక్స్ ఒక ఆయుధంగా ఎలా పనిచేస్తుందో, దాని ప్రభావం ఎంత లోతుగా ఉంటుందో అధికారులు పరీక్షించాలనుకున్నారు" అని స్కాటిష్ చరిత్రకారుడు రోరే స్కోథోర్న్ బీబీసీకి చెప్పారు.

పోర్టన్ డౌన్ శాస్త్రవేత్తలు ఆంత్రాక్స్ బాంబులను జాగ్రత్తగా పొట్లం కట్టి ఉత్తరంవైపుకు వెళ్లారు. గ్రునాడ్ ద్వీపం చేరుకున్న తరువాత, 80 గొర్రెలను అక్కడ వదిలారు. వీటిని వేర్వేరు పెట్టెల్లో ఉంచారు. ఆంత్రాక్స్ పొగతో ఆ ప్రాంతాన్ని నింపారు. అది ఎంత విషపూరితమైనదంటే, మూడు రోజుల్లో గొర్రెలన్నీ చనిపోయాయి.

"ఒక మేఘం అలా ఎగురుకుంటూ వచ్చి గొర్రెలను సమీపించడం నేను చూశాను. గొర్రెలను ఒక వరుసలో కట్టి ఉంచారు. అది ఆంత్రాక్స్"

ఇది జరిగిన 20 ఏళ్ల తరువాత ఒక ప్రత్యక్ష సాక్షి బీబీసీతో చెప్పిన మాటలవి.

ఈమధ్యే జాన్ మెక్‌ఎల్‌వర్టీ బీబీసీ కోసం 'ది మిస్టరీ ఆఫ్ ఆంత్రాక్స్ ఐలాండ్' అనే డాక్యుమెంటరీని రూపొందించారు. అందులో ప్రతక్ష సాక్షులు చెప్పిన వివరాలను పొందుపరిచారు.

"గొర్రెలను చంపడంలో ఆంత్రాక్స్ ప్రభావం చూపించింది కాబట్టి ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు భావించారు. అయితే, మనుషులపై ఇది అంత ప్రభావం చూపించదనే నిర్ణయానికొచ్చారు. మనుషులపై ప్రయోగించడానికి ఇంతకన్నా శక్తిమంతమైన బయొలాజికల్ ఆయుధాలు ఉన్నాయి" అని స్కోథోర్న్ అన్నారు.

ఆంత్రాక్స్ ప్రాణాంతకమైన బ్యాక్టీరియా. దీన్ని పీల్చితే ప్రాణాలకే ప్రమాదం అని చాలాసార్లు రుజువైంది.

"ఈ బ్యాక్టీరియా ముక్కు ద్వారా శ్వాసకోస వ్యవస్థలోకి చేరి, ఊపిరితిత్తులను నాశనం చేస్తుంది. ఇది ప్రాణాంతకం" అని బీబీసీ డాక్యుమెంటరీలో మైక్రోబయాలజిస్ట్ క్లేర్ టేలర్ వివరించారు.

ఆంత్రాక్స్ నేలపై ఎక్కువకాలం కొనసాగగలదు.

"వాటి బీజాలు 40 నుంచి 50 ఏళ్ల వరకు మనగలవు. కొన్ని సందర్భాల్లో 200 ఏళ్ల వరకు జీవించగలవు" అని ఆయన వివరించారు.

ఆంత్రాక్స్ ప్రభావం

జంతువులపై ప్రయోగించిన ఆంత్రాక్స్ ప్రభావం ఎంత లోతుగా ఉంటుందో శాస్త్రవేత్తలు అంచనా వేయలేదు. దాని వలన ద్వీపంలోని నేల మొత్తం విషపూరితంగా మారిందని, స్కాట్లాండ్ తీరంలోని కొన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించిందని అనేక పరిశోధనల తరువాత బయటపడింది.

ఈ ప్రయోగం చేసిన ఆరు నెలల తరువాత కూడా 30 నుంచి 50 గొర్రెలు, ఏడు ఆవులు, రెండు గుర్రాలు, మూడు పిల్లులు చనిపోయాయి. ప్రభుత్వం వీటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది.

"అక్కడి పరిస్థితులను విశ్లేషించడానికి ఏజెంట్లను ఉత్తరానికి పంపారు. రైతులకు నష్టపరిహారం చెల్లించారు కానీ, వాస్తవంలో ఏం జరిగిందో దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఒక గ్రీకు ఓడ ఆ ద్వీపం పక్క నుంచి వెళ్లిందని, అందులోంచి ఆంత్రాక్స్ లీక్ అయిందని నమ్మబలికారు. అందుకే గ్రీకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిందని చెప్పారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన ప్రయోగం అన్న విషయం బయటపెట్టలేదు. అలా దాని బాధ్యత నుంచి తప్పించుకోవచ్చని భావించారు" అని స్కోథోర్న్ అన్నారు.

1944లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ ద్వీపంలోకి ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించింది. అత్యంత విషపూరితమైన ఆంత్రాక్స్ ప్రయోగించడం వల్ల గ్రునాడ్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ప్రాంతంగా మారింది. 24 ఏళ్ల వరకు ఈ ప్రాంతాన్ని పూర్తిగా వెలివేశారు.

గ్రునాడ్ ద్వీపంలోకి ఎవరూ అడుగుపెట్టకూడదని, అది "డెత్ ఐలాండ్"గా మారిందని చుట్టుపక్కల ప్రజలకు తెలుసు. బ్రిటిష్ రక్షణ శాఖ అక్కడ ఏదో రహస్య ప్రయోగం నిర్వహించిందని కూడా తెలుసు. కానీ, వాస్తవంలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కొన్ని దశాబ్దాల వరకు ప్రభుత్వం నిజాన్ని దాచిపెట్టింది.

ఆంత్రాక్స్

ఆ రహస్యం ఎప్పుడు, ఎలా బయటపడింది?

"గ్రునాడ్ విషపూరితమైందని ప్రజలకు తెలుసు. కానీ ఇది మీడియాలో రాలేదు. ఒక సమయంలో ఆ ద్వీపం నుంచి విషాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆలోచించింది. 1971లో దర్యాప్తు చేశారు కూడా. కానీ, విషాన్ని తొలగించడానికి చాలా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వంపై ఆ ద్వీపాన్ని శుభ్రపరచాలన్న ఒత్తిడేమీ లేదు" అని స్కోథోర్న్ చెప్పారు.

1981లో పరిస్థితులు మారాయి. తమను తాము 'డార్క్ హార్వెస్ట్ కమాండోస్' అని పిలుచుకునే అండర్‌గ్రౌండ్ సెల్ యూనిట్ గ్రునాడ్ నుంచి విషపూరితమైన మట్టిని సేకరించి పోర్టన్ డౌన్ ప్రయోగశాలకు పంపించింది.

ఇతరులకు పంపడానికి తమ వద్ద ఇంకా 136 కిలోల మట్టి ఉందని తెలుతూ ఈ సెల్ పత్రికలకు లేఖ రాసింది.

శాస్త్రవేత్తలు ఆ మట్టిని పరిశీలించి అందులో ఆంత్రాక్స్ ఉందని, ఇది స్కాటిష్ దీవి నుంచి వచ్చిందని నిర్ధారించారు.

ఈ బృందం డిమాండ్ ఒకటే.. గ్రునాడ్‌ను శుభ్రపరచాలి.

"స్కాట్లాండ్‌లో ఈ ద్వీపాన్ని బ్రిటిష్ ప్రభుత్వం కలుషితం చేసిందని బయటపెట్టడమే వారి ఉద్దేశం. 20వ శతాబ్దపు అతి పెద్ద రహస్యాన్ని వారు బట్టబయలుచేశారు. ఆ ద్వీపంలో బ్రిటిష్ ప్రభుత్వం రసాయన ఆయుధాలను పరీక్షించిందనే నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. అది కూడా, ప్రజలకు ఆగ్రహం కలిగే విధంగా చేశారు" అని స్కోథోర్న్ వివరించారు.

తరువాత, లివర్‌పూల్‌కు ఉత్తరాన బ్లాక్‌పూల్‌లో జరిగే కన్జర్వేటివ్ పార్టీ సమావేశానికి రెండో లేఖ రాశారు. దాంతో జాతీయ స్థాయిలో ఆందోళన ప్రారంభమైంది. ఈ విషయం అంతర్జాతీయ మీడియాకు చేరింది.

"ఈ బృందాన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారుగానీ, కుదరలేదు. కానీ, వారు రహస్యన్ని బయటపెట్టిన కొద్దిరోజులకే ప్రభుత్వం గ్రునాడ్‌కు శాస్త్రవేత్తల బృందన్ని పంపించిది. గ్రునాడ్‌ను మళ్లీ జంతువుల, మనుషుల ఆవాసనికి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభించింది" అని స్కోథోర్న్ చెప్పారు.

గ్రునాడ్ ద్వీపం

ద్వీపాన్ని శుభ్రపరిచే ప్రక్రియ

1943 నుంచి 1981 వరకు పలుమార్లు అధికారులు, శాస్త్రవేత్తలు గ్రునాడ్ ద్వీపంలో మట్టిని పరీక్షించారు. ప్రతిసారి అక్కడ అధిక శాతంలో ఆంత్రాక్స్ ఉందనే తేలింది.

1970లలో ద్వీపాన్ని శుభ్రపరచడానికి అధిక మొత్తం ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దాంతో, గ్రునాడ్‌ను శుభ్రపరచడం లాభదాయకం కాదనే నిర్ణయానికి వచ్చింది.

చివరికి, 1980లలో డార్క్ హార్వెస్ట్ గ్రూపు రహస్యాన్ని బయ్టపెట్టడం, అభివృద్ధి చెందిన సాంకేతికను ఉపయోగించి ద్వీపాన్ని తక్కువ ఖర్చుతో శుభ్రపరచవచ్చని తేలడంతో ఆ పనికి పూనుకుంది బ్రిటిష్ ప్రభుత్వం.

గ్రునాడ్ ద్వీపంలో మట్టిని ఉప్పు, ఫార్మాల్డిహైడ్‌ అనే రసాయనంతో శుభ్రపరిచారు. విషవాయువులు తొలగిపోయాయో లేదో పరీక్షించేందుకు మట్టిని పోర్టన్ డౌన్‌కు పంపించారు.

ఎట్టకేలకు, 1990 ఏప్రిల్ 24న గ్రునాడ్ ద్వీపం ఆంత్రాక్స్ నుంచి విముక్తి పొందిందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, శాస్త్రవేత్తలు పరీక్షించిన మట్టి ద్వీపం నుంచి రాలేదని, ద్వీపానికి ముందున్న తీరం నుంచి వచ్చిందని తెలిసింది.

"ఇప్పటివరకు ఆ మట్టి గ్రునాడ్ ద్వీపం నుంచి వచ్చిందా, లేదా తీరం నుంచి వచ్చినా మనకు తెలీదు. అయితే దాన్ని పరీక్షించిన శాస్త్రవేత్తలు, ఆ మట్టి, ద్వీపంలోని మట్టితో సరిపోలుతోందని చెప్పారు. డార్క్ హార్వెస్ట్‌లో సభ్యులెవరో, ఈ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరో కూడా ఇప్పటికివరకు బయటపడలేదు" అని స్కోథోర్న్ చెప్పారు.

అదీ గ్రునాడ్ ద్వీపం కథ. అందమైన ద్వీపం వినాశనానికి గురై, మళ్లీ కొన్ని దశాబ్దాల తరువాత ఊపిరిలూదుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Death Island: Island poisoned for 50 years after anthrax used to defeat Hitler
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X