అమెరికాలో భారతీయ యువ ఉద్యోగి ప్రాణం తీసిన పని ఒత్తిడి
న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గోల్డ్‌మన్ శాక్స్‌లో ఎనలిస్ట్ ఉద్యోగి అయిన ఓ భారతీయుడు పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అతని పేరు సర్వశ్రేష్ఠ్ గుప్తా. వయస్సు 22. అతడు పని ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
పని ఒత్తిడితో అతను తొలుత రాజీనామా చేశాడు. కానీ ఎలాగైనా ఉద్యోగం చేయాలన్న తండ్రి మాటకు విలువిచ్చి మళ్లీ ఉద్యోగంలో చేరాడు. చివరికి ఆ ఒత్తిడికి తట్టుకోలేక తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచే దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ యువ బ్యాంక్ ఉద్యోగి విషాధ గాథ జరిగింది. గోల్డ్‌మన్ శాక్స్ సంస్థలోని టెలికమ్యూనికేషన్స్, మీడియా అండ్ టెక్నాలజీ గ్రూపులో విశ్లేషకుడిగా పని చేసేవాడు. పని భారంపై తండ్రివద్ద తన ఆవేదన వెళ్లగక్కాడు.

అయితే ఉద్యోగం మానేయవద్దని, ఎలాగోలా చేయాలని తండ్రి చెప్పాడని తెలుస్తోంది. ఆయన ఎంత నచ్చజెప్పినా సర్వశ్రేష్ఠ్ ఈ ఏడాది మార్చిలో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఆయన ఎప్పటిలాగానే ఉద్యోగం మానేయవద్దని చెప్పాడు.
కంపెనీవారు కూడా రాజీనామా విషయంలో పునరాలోచించుకోవాలని కోరడంతో మనసు మార్చుకుని వారంలోగా అదే కంపెనీలో మళ్లీ చేరాడు. తర్వాత కొద్దిరోజులకే తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్కన పార్కింగ్‌లాట్‌లో చనిపోయి కనిపించాడు.
అతడు అపార్ట్‌మెంట్ భవనం పై నుంచి దూకి చనిపోయాడని సమాచారం. చనిపోవడానికి ఒక్కరోజు ముందు అతను తండ్రికి ఫోన్ చేశాడు. కొడుకు బాధ విని, ఆ తర్వాత రాజీనామా చేసి వచ్చేయమని తండ్రి చెప్పాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది.












Click it and Unblock the Notifications