వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా యుద్ధ ఖైదీలను యుక్రెయిన్ సైనికులు మోకాళ్లపై షూట్ చేశారా... వైరల్ వీడియో నిజమెంత?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రష్యా, వీడియో

యుక్రెయిన్ సైనికులు, రష్యా యుద్ధ ఖైదీలను మోకాళ్లపై కాల్చినట్టు చూపిస్తున్న ఒక వీడియో ఫుటేజీపై యుక్రెయిన్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

మార్చి 27, ఆదివారం పొద్దున మొదటిసారి కనిపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అప్పటి నుంచి రష్యా మద్దతుదారులు దీన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు.

రష్యన్ ఖైదీల పట్ల యుక్రెయిన్ తీరును కించపరిచేందుకు రష్యా ఇలాంటి "బూటకపు వీడియోలను చిత్రీకరించి, పంపిణీ చేస్తోందని" యుక్రెయిన్ సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్ వాలెరీ జలుజ్నీ అన్నారు.

కాగా, ఈ వీడియో ఫుటేజీపై వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ తెలిపారు.

"యుద్ధ ఖైదీలతో అనుచితంగా వ్యవహరించడం యుద్ధనేరమని సైన్యానికి, పౌరులకు, భద్రతా దళాలకు గుర్తుచేస్తున్నాను" అని ఆయన అన్నారు.

బీబీసీ ఈ వీడియోను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, ఇంతవరకు ఈ ఫుటేజీని స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.

ఈ వీడియోను పరిశీలిస్తున్న దిశలో ఇంతవరకు మాకు లభించిన సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాం.

వీడియోలో ఏముంది?

వీడియో ఫుటేజీ చాలా గ్రాఫిక్‌గా ఉంది. ఇందులో, బందీలుగా పట్టుబడిన అనేకమంది సైనికులు నేలపై పడి ఉన్నారు. కొంతమంది తలలపై సంచీలు ఉన్నాయి. చాలామంది కాళ్లకు గాయాలై నెత్తురోడడం కనిపిస్తోంది. వాళ్లకి ఎప్పుడు, ఎలా దెబ్బలు తగిలాయన్నది స్పష్టంగా తెలియడంలేదు. వారి విభాగాల గురించి, కార్యకలాపాల గురించి ఖైదీలను ప్రశ్నిస్తున్నారు.

ఒక దగ్గర, ముగ్గురు వ్యక్తులను వాహనంలోంచి దించారు. ఒక సైనికుడు వారిని కాళ్లపై కాల్చినట్టు కనిపిస్తోంది. తరువాత, వాళ్లని ప్రశ్నించారు.

ఖార్కియెవ్

దీన్ని ఎక్కడ చిత్రీకరించారు?

ఆదివారం సాయంత్రానికి ఒక ట్విట్టర్ వినియోగదారుడు వీడియోలో కనిపిస్తున్న స్థలాన్ని గుర్తుపట్టారు. ఖార్కియెవ్‌కు ఆగ్నేయ దిశలో ఉన్న మలయా రోహన్‌ అనే ఊరిలోని డెయిరీ ప్లాంట్‌లో ఈ వీడియోను చిత్రీకరించినట్టు ఆ యూజర్ సూచించారు.

జియో-లొకేషన్ సాధనాలు ఉపయోగించి ఆ స్థలాన్ని బీబీసీ నిర్థరించింది. ఈ ప్రాంతాన్ని ఇటీవలే యుక్రెయిన్ దళాలు రష్యా నుంచి వెనక్కి చేజిక్కించుకున్నాయి.

డెయిరీ ప్లాంట్ ఉపగ్రహ చిత్రాలను పరిశీలించడం ద్వారా ఆ స్థలానికి సంబంధించిన ఆధారాలు సేకరించవచ్చు.

వీడియోలో ఆ ముగ్గురు సైనికులను కాళ్లపై కాల్చక ముందు గమనిస్తే, వారిలో ఒకరి వెనుక ఒక ఇల్లు ఉన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఒక చెట్టు (1), ఒక పొగగొట్టం(2), కిటికీ పైభాగం (3) కనిపిస్తున్నాయి. ఇవి, అంతకుముందు (2017లో) తీసిన డెయిరీ ప్లాంట్ ఫొటోలతో పోలి ఉన్నాయి. డెయిరీ ప్లాంట్ గూగుల్ వెబ్ పేజీలో మేం ఈ పాత చిత్రాలను సేకరించాం.

వాకిట్లో తెల్లటి నిర్మాణం ఏదో ఉంది. దానివల్ల ఇల్లు సగం భాగం అస్పష్టంగా కనిపిస్తోంది.

వీడియోలో మరొకచోట, సైనికులు నేలపై పడి ఉన్నారు. అక్కడ మరిన్ని క్లూస్ దొరికాయి.

ఆ తెల్లటి నిర్మాణం (4), పొగగొట్టం (1), చెట్లు, నల్లటి గోడ (2) అన్నీ కూడా డెయిరీ ఫాం ప్రధాన భాగంలో ఆరుబయట కనిపిస్తున్నాయి.

డెయిరీ ప్లాంట్‌ను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది.

వీడియో గ్రాబ్

ఎప్పుడు చిత్రీకరించారు?

వీడియో ఫుటేజీలో టైం లేదా తేదీ స్టాంపు లేదు. అది ఎప్పుడు చిత్రీకరించారో తెలిపే మెటాడాటా కూడా లభ్యం కాలేదు.

కానీ, ఆకాశం చూస్తే వాతావరణం తేటగా ఉన్నట్టు తెలుస్తోంది. నేల పొడిగా ఉంది.

ఖార్కియెవ్ వాతావరణ నివేదికలు పరిశీలిస్తే, ఈ వీడియోను మార్చి 26, శనివారం షూట్ చేసి ఉండవచ్చు అనిపిస్తోంది.

శుక్రవారం, శనివారం వాతావరణం పొడిగా ఉంది. ఎండ వచ్చినప్పటికీ చలిగా ఉంది. శనివారం రాత్రి చిన్న వర్షం పడిందని నివేదికలు చెబుతున్నాయి.

వీడియోలో సూర్యుడు కనిపిస్తున్న దిశను గమనిస్తే, దీన్ని పొద్దుపొద్దున్నే షూట్ చేసి ఉండవచ్చు.

ఫార్మ్ ప్రాంతం

వీడియోలో ఏం మాటలు వినిపిస్తున్నాయి?

ఖైదీలను రష్యన్‌లో ప్రశ్నిస్తున్నారు. "యాస, యుక్రెయిన్ పౌరులు రష్యా మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉందని" బీబీసీ మానిటరింగ్ లాంగ్వేజెస్ నిపుణులు తెలిపారు.

తూర్పు యుక్రెయిన్ యాస వినిపిస్తోందని మరొక నిపుణుడు తెలిపారు. వీడియోలో "హోవొరిట్" (మాట్లాడు) అని అన్నారు. రష్యన్లయితే "గోవొరిట్" అంటారని వివరించారు.

ఒక దగ్గర, ఒక బందీని ఖార్కియెవ్‌పై బాంబుదాడి చేశారని ఆరోపించారు. మరొకరిని జాతీయత గురించి ప్రశ్నించారు. జవాబుగా, ఆయన 'అజెరీ' (రష్యన్ జాతి కాదు) అని చెప్పారు.

మరొక బందీ, తాను బిస్క్విట్నెలో విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ఊరు, మలయా రోహన్‌లోని డెయిరీ ప్లాంట్‌కు దగ్గర్లో ఉంది.

యుక్రెయిన్, రష్యా

ఆ సైనికులు ఎవరు?

బందీలుగా ఉన్నవారు మాట్లాడుతున్న యాస చూస్తే వారు తూర్పు యుక్రెయిన్‌కు చెందినవారిలాగ కనిపిస్తున్నారు.

అయితే, వారు యుక్రెయిన్ సైనికులు అని నిర్థరించడానికి ఈ కారణం సరిపోదు. వారు ఆ ప్రాంతంలో ఉన్న రష్యన్ అనుకూల వేర్పాటువాదులు కావొచ్చు.

వాళ్లు నీలం రంగు ఆర్మ్‌బ్యాండ్స్ (చేతికట్టు) ఉన్న యూనిఫాం వేసుకున్నారు. ఇది యుక్రెయిన్ సైనికులు వేసుకునే యూనిఫాం. అయినాసరే, వాళ్లు యుక్రెయిన్ సైనికులు అని చెప్పలేం.

వాళ్లను గుర్తించడానికి వీలుగా మరే ఇతర రెజిమెంటల్ బ్యాడ్జీలుగానీ, ఐడీ కార్డులు గానీ ధరించలేదు.

యుక్రెయిన్ దళాలు కూడా సమీపంలోనే ఉన్నాయి.

మార్చి 26-27 వారాంతంలో ఆన్‌లైన్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అతివాద రైట్ వింగ్ నేషనల్ కార్ప్స్ రాజకీయ సమూహానికి అనుబంధంగా ఉన్న క్రాకెన్ యూనిట్ కార్యకలాపాలను చూపిస్తున్న వీడియో అది.

జియో-లొకేషన్ సాధనాలను ఉపయోగించి ఈ వీడియోను విల్ఖివ్‌కా గ్రామంలో షూట్ చేసినట్టు బీబీసీ కనిపెట్టింది. ఈ గ్రామం మలయా రోహన్‌కు 3.5 మైళ్ల (5.6 కిమీ) దూరంలో ఉంది. ఈ వీడియోలో కూడా వాతావరణం ఎండగా, పొడిగా ఉంది.

ఈ గ్రామం నుంచి మార్చి 25న 30 మంది రష్యన్లను ఖైదీలుగా పట్టుకున్నట్టు ఆ సమూహం తెలిపింది.

క్రాకెన్ వీడియో ఫుటేజీలో యుద్ధ ఖైదీలను బంధించి, కళ్లకు గంతలు కట్టి వాహనాల్లో కుక్కడాన్ని చూడవచ్చు. యుక్రెయిన్ జాతీయ గీతం ఆలపించేలా నిర్బంధించడాన్ని గమనించవచ్చు. కానీ, కాల్చడం లేదా తీవ్రమైన హింస ఈ వీడియోలో లేదు.

ఖార్కియెవ్ ప్రాంతంలోని నేషనల్ కార్ప్స్ అధిపతి కాన్‌స్టాంటిన్ నెమిచెవ్‌ను బీబీసీ సంప్రదించింది.

తమ సైనికులు ఖైదీల పట్ల "మానవీయంగా" ప్రవర్తించారని, డెయిరీ ప్లాంట్‌లో కాల్పులు జరిగినట్టు చూపించిన వీడియోతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

డెయిరీ ప్లాంట్ వీడియో ఫుటేజీలో, సైనికులలో ఒకరు విలక్షణమైన, దాచిపెట్టినట్టు ఉన్న అసాల్ట్ రైఫిల్‌ను పట్టుకుని నడుస్తున్నారు.

ఈ భాగాన్ని పరిశీలించమని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ (ఆర్‌యూఎస్ఐ)కు చెందిన సైనిక నిపుణుడు నిక్ రేనాల్డ్స్‌ను అడిగాం.

"యుక్రెయిన్ ప్రత్యేక దళాలు (ఎస్ఓఎఫ్) తమ అసాల్ట్ రైఫిల్స్ బయటకు కనిపించకుండా, దాచిపెట్టినట్టు పట్టుకునే పద్ధతిలానే ఉంది. కానీ, వీడియోలో కనిపిస్తున్న ఆయుధం నేను చూసిన వాటి కంటే భిన్నంగా కనిపిస్తోంది" అని ఆయన చెప్పారు.

ఇరుపక్షాలు పరస్పరం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి కాబట్టి వీడియోలో కనిపిస్తున్న తుపాకీ గురించి కచ్చితంగా చెప్పడం కష్టమని ఆయన అన్నారు.

యుక్రెయిన్, రష్యా

కాల్పుల విషయంలో సందేహాలు

వీడియోలో ముగ్గురు వ్యక్తులను తుపాకీతో దగ్గర నుంచి కాళ్లపై కాల్చిన దృశ్యాలు కలవరపెడతాయి.

ఈ వీడియో నిజమా, బూటకమా అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కాలిస్తే వచ్చేంత రక్తం, గాయాలు, లేదా బాధతో అరుపులు వీడియోలో కనిపించడం లేదని, ఇది నిజం కాకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ వీడియోను మేం పలువురు ట్రామా సర్జన్లకు, మాజీ మిలటరీ డాక్టర్లకు చూపించాం.

వారంతా వీడియో ఫుటేజీలో కనిపిస్తున్న దృశ్యాలపై తమ అభిప్రాయాలు చెప్పారు. కానీ, వారి పేర్లను బయటపెట్టవద్దని కోరారు.

ఒకరు ఏం చెప్పారంటే, బాధతో అరవకుండా, మూలగకుండా గన్‌షాట్‌ను భరించే సైనికులను తాను చూశానని, వారికి చికిత్స చేశానని తెలిపారు.

అలాగే, తుపాకీతో కాల్చినప్పుడు రక్తం కారకపోవడానికి కారణం టోర్నికెట్ ధరించడం (ఇది వీడియోలో కనిపిస్తోంది) కావచ్చని చెప్పారు.

"కనిపిస్తున్న దానిబట్టి ఇది ఫేక్ వీడియో అనడం నా దృష్టిలో సబబు కాదు. ఇది యుద్ధనేరమా, కాదా అనేది దర్యాప్తు చేయాలి" అని ఆయన అన్నారు.

"ఇది నిజమే అనిపిస్తోంది.. శిక్షగా అవయవాలపై కాల్పులు జరిపే పద్ధతిలోనే ఉంది" అని మరొక డాక్టర్ అన్నారు.

అయితే, కాల్పులు జరిపినప్పుడు తుపాకీలో కనిపించే రీకాయిల్ (వెనక్కు తన్నడం) లేదని, అవి బ్లాంక్ కాల్పులు కావచ్చని సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయపడ్దారు.

ఏకే-74లో 5.45మిమీ రౌండ్ సామర్థ్యం చిన్నగా ఉంటుందని, దాన్లో రీకాయిల్ కూడా చాలా తక్కువగా ఉంటుందని రేనాల్డ్స్ చెప్పారు. అయితే, "వీడియో క్వాలిటీ అంత బాగా లేదని" కూడా అన్నారు.

బీబీసీ ఈ వీడియోపై పరిశోధన కొనసాగిస్తోంది. కొత్త సమాచారం లభించిన వెంటనే ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం.

రిపోర్టింగ్: అలిస్టెయిర్ కోల్‌మన్, డేనియేలే పలుంబో, షాయన్ సర్దారిజాదే, రిచర్డ్ ఇర్విన్-బ్రౌన్, విటాలీ షెవ్‌చెంకో, పాల్ మైయర్స్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Did Ukrainian soldiers shoot Russian prisoners of war on their knees,Is the viral video real
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X