వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పామాయిల్ కంపెనీలు లక్షలాది నిరుపేద గిరిజనులను ఎలా దోచుకుంటున్నాయో తెలుసా? - బీబీసీ పరిశోధన

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

మీరు సూపర్ మార్కెట్‌లో ఏవైనా వస్తువులు కొంటే వాటిలో కొన్ని ఉత్పత్తులలో పామాయిల్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ పామాయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే ఆ లింక్ ఇండోనేషియాలోని ఆయిల్ పామ్ తోటల దగ్గర తేలుతుంది.

కానీ, ఇక్కడ ఈ ఆయిల్ పామ్ గింజల నుంచి తీసిన నూనెను మార్కెటింగ్ చేసే జాన్సన్ అండ్ జాన్సన్, కెల్లాగ్స్, మోండెల్జ్ వంటి సంస్థలకు విక్రయించడం ద్వారా ఇండోనేషియాలోని స్థానిక తెగల ప్రజలు మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నష్టపోతున్నారని బీబీసీ పరిశోధనలో తెలింది.

మత్ యాడి నది మార్గంలో బయలుదేరారు. ఆయన చేతిలోని ఈటె వేటాడడానికి సిద్ధంగా ఉంది. ఆయనకు ఇవాళ ఏమీ దొరకలేదు. "ఇంతకు ముందు జింకలు, ముళ్లపందులు లాంటి చాలా జంతువులు ఉండేవి. ఇప్పుడవేవీ దొరకడం లేదు’’ అన్నారు మత్ యాడి.

మత్ యాడి ఇండోనేషియాలోని అంతరించి పోతున్న సంచార తెగలలో ఒకటైన ఒరాంగ్ రింబా తెగకు చెందినవారు. తరతరాలు ఆయన తెగకు చెందిన వారు సుమత్రా ద్వీపంలోని అడవిలో నివసిస్తున్నారు.

Palmoil companies

రబ్బరు పండించడంతో పాటు వేటాడడం, పండ్లను సేకరించడం వారి ప్రధాన వృత్తి.1990లలో ఒక పామాయిల్ కంపెనీ డబ్బు, అభివృద్ధి కల్పిస్తామంటూ మారుమూల ప్రాంతమైన టెబింగ్ టింగికి వచ్చింది.

ఇది ఈ తెగ వారు పూర్వీకుల నుంచి పొందిన భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇందుకు బదులుగా ఈ భూమి విలువలోని సగానికి పైగా వారికి తిరిగి ఇస్తారమని హామీ ఇచ్చినట్లు ఒరాంగ్ రింబా తెగ ప్రజలు చెబుతున్నారు.

వీరి భూమిలో ఆ కంపెనీ ఆయిల్ పామ్‌ తోటలను నాటింది. ప్రస్తుతం ఆయిల్ పామ్ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న పంట. పండించిన పండ్లను ఆ కంపెనీకి అమ్మేసుకోవడం వల్ల అటు కంపెనీకి, ఇటు గిరిజన తెగకు ఇద్దరికీ లాభదాయకమైన వ్యవహారం.

25 సంవత్సరాలలో ఆయిల్ పామ్‌ చెట్లు పొడవుగా పెరిగాయి. పెద్ద ఎత్తున పంట మిల్లులోకి ప్రవహించింది. సలీమ్ గ్రూప్ అనే ఆ సంస్థ మిలియన్ల డాలర్ల విలువైన ఎడిబుల్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసింది.

ఈ ఆయిల్ ను క్యాడ్‌బరీస్ చాక్లెట్, పాప్-టార్ట్స్ వంటి ప్రోడక్ట్స్ తయారీదారులు కొనుగోలు చేశారు. కానీ, మత్ యాడి కి తన తెగకు వాగ్దానం చేసినట్లు ఏమీ ఇవ్వలేదు. ఈ రోజు ఆయన కుటుంబం తోట లోపల ఒక చిన్న గుడిసెలో నివసిస్తోంది."మాకు ఏమీ ఇవ్వలేదు, మా దగ్గర నుంచి అన్నీ తీసేసుకున్నారు" అని ఆయన అన్నారు.

ఒరాంగ్ రింబాలో మిగతా వారిలాగానే తెగ పెద్ద సితి మణినా పండి రాలిన ఆయిల్ పామ్‌ పండ్లను ఏరుకుని వాటిని అమ్మి జీవనం సాగిస్తున్నారు. అదృష్టం బాగుండి మరిన్ని పండ్లు దొరికితే బియ్యం, కూరగాయలు కొనడానికి అవసరమైన డబ్బులు వస్తాయి. లేదంటే ఆరోజు ఇబ్బంది పడాల్సిందే.

"మాకు జరుగుతున్న అన్యాయంలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది ప్రతిచోటా జరుగుతోంది. కార్పొరేట్ కంపెనీలు అత్యాశతో ఉన్నాయి" అని ఇండోనేషియా ఎంపీ డేనియల్ జోహన్ చెప్పారు. ఆయన తెగ తరపున పనిచేసిన ఆయన వ్యవసాయ, అటవీ రంగాన్ని పర్యవేక్షిస్తుంటారు.

ప్రపంచంలోని అత్యంత జీవవైవిధ్యంగల విస్తారమైన అడవులను పామాయిల్ తోటల కోసం నరికివేశారు. ఒకప్పుడు అడవితో కప్పేసి ఉన్న ఇండోనేషియా దీవులైన బోర్నియో, సుమత్రాలో ఇప్పుడు పామాయిల్ తోటలు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.

స్థానికుల నుంచి మద్ధతు పొందేందుకు కంపెనీలు ఆర్ధికాభివృద్ధికి హామీ ఇవ్వడంతోపాటు, ప్రభుత్వం నుంచి ఫైనాన్సింగ్ పొందడానికి కంపెనీలు 'ప్లాస్మా’ అని పిలిచే ప్లాట్లతో స్థానికులకు భాగం కల్పిస్తామని హామీ ఇచ్చాయి.

2007 నాటి చట్టం ప్రకారం కంపెనీలు ఏదైనా కొత్త ప్లాంటేషన్‌ మొదలు పెడితే ఐదో వంతు కమ్యూనిటీలకు ఇవ్వడం చట్టపరమైన అవసరం.

ఈ పథకం బాగా పనిచేసిన చోట, గ్రామీణ ప్రజలు పేదరికం నుండి బయటపడటానికి కొంత వరకు సహాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $ 50 బిలియన్ డాలర్లు ( సుమారు రూ. 38,75,87,50,00,000) కంటే ఎక్కువ విలువైన పరిశ్రమలో వారికి వాటా లభించింది.

కానీ, కంపెనీలు ప్లాస్మాను అందించడం, వాగ్దానాలను నెరవేర్చడం, చట్టపరమైన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

సమస్య తీవ్రతను తెలుసుకోవడానికి గత రెండు సంవత్సరాలుగా పరిశోధనాత్మక జర్నలిజం నిర్వహిస్తున్న 'ది గెక్కో ప్రాజెక్ట్’, పర్యావరణ వార్తల సైట్ మొంగాబేతో బీబీసీ ఒక బృందంగా కలిసి పని చేసింది.

ఒక్క సెంట్రల్ కాలిమంతన్ ప్రావిన్స్ లోనే ప్లాస్మా రూపంలో స్థానికులకు ఇవ్వాల్సిన భూమిలో దాదాపు లక్ష హెక్టార్ల ( 2.5 లక్షల ఎకరాలు) భూమిని కంపెనీలు ఇవ్వలేదని తేలింది. వీటి సైజు దాదాపు లాస్ ఏంజెలస్ నగరమంత ఉంటుంది.

ఇవన్నీ ప్రభుత్వం డాక్యుమెంట్లలో వెల్లడైన వివరాలే. పామాయిల్ నుండి లభించే లాభాలను కొలిచే సంప్రదాయ ప్రమాణాల ప్రకారం చూసినా, స్థానిక తెగలు దీని ద్వారా ప్రతియేటా 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,97,72,50,000) నష్టపోయినట్లు తేలింది.

ఈ ప్రాంతం ఇండోనేషియాలో కార్పొరేట్ కంపెనీలు నడిపే మొత్తం పామాయిల్ తోటలలో ఐదవ వంతు మాత్రమే.

వ్యవసాయ మంత్రిత్వ శాఖ డేటాను విశ్లేషించినప్పుడు ఇతర ప్రధాన పామాయిల్ తోటలలో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉందని, ఇండోనేషియా వ్యాప్తంగా ప్రతియేటా స్థానిక తెగలు కొన్ని వందల మిలియన్ల డాలర్లను నష్టపోతున్నాయి.

అయితే, సమస్య స్థాయి అధికారిక డేటాలో మాత్రమే కనిపించదు.తమ ప్లాంటేషన్లను కమ్యూనిటీలతో పంచుకోవడానికి వాగ్దానాలను విరమించుకున్నట్లు లేదా చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల డేటాబేస్‌ను మా బృందం కూడా రూపొందించింది.

గత ఆరేళ్లుగా సగటున ప్రతి నెలా ప్లాస్మా పై ఫిర్యాదులతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, తరచుగా వాటిని హింసాత్మకంగా కప్పిపెట్టడంలో ప్రభుత్వాల పాత్ర చాలా చురుకుగా ఉన్నట్లు కనిపించింది.

2015లో, స్థానిక రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందంలో, సలీం గ్రూప్ ఒరాంగ్ రింబాకు ప్లాస్మాను అందజేస్తానని వాగ్దానం చేస్తూ ఒక కొత్త ఒప్పందంపై సంతకం చేసింది. కానీ, జనవరి 2017 నాటి వరకు అది నెరవేర లేదు.

అప్పటికి ఆ తెగ ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురు చూశారు.విసుగు చెందిన తెగ సభ్యులు సంస్థ తోటలను ఆక్రమించారు. కానీ, కంపెనీ వారి గుడిసెలను కూల్చివేసింది.

దీంతో గ్రామస్తులు ప్లాంటేషన్‌లోని సెక్యూరిటీ పోస్టుకు నిప్పుపెట్టి, కంపెనీ ఆఫీసు అద్దాలను పగలగొట్టారు. 40 మందికి పైగా పోలీసులు అరెస్టు చేసి దాడి చేశారని గ్రామస్తులు మాకు చెప్పారు.

"ఎవరినీ ప్రశ్నించకుండా, మమ్మల్ని హింసించారు. మా రక్తం కళ్లజూశారు" అని ఒక వ్యక్తి చెప్పారు. విధ్వంసానికి పాల్పడ్డారని ఏడుగురికి 18 నెలల జైలు శిక్ష పడింది. దీనిపై స్పందన కోసం ప్రయత్నించగా, పోలీసులు మాట్లాడటానికి అంగీకరించలేదు.

"వారు అన్నిరకాల ప్రతిఘటనలకు వారు ప్రయత్నించారు. కొన్నిసార్లు వారి జీవితాలను కూడా త్యాగం చేసారు. ఇప్పటికీ ఎటువంటి పరిష్కారం లేదు. అంటే వ్యవస్థ విఫలమైందని దీని అర్థం" అని ఎంపీ డేనియల్ జోహన్ అన్నారు. ఈ సంఘనలు జరిగిన వెంటనే ఆయన ఇతర చట్టసభ సభ్యులతో టెబింగ్ టింగ్గీ ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ నిరసనల తర్వాత, ఒరాంగ్ రింబా తెగ పూర్వీకుల భూమిని తిరిగి ఇవ్వాలని పార్లమెంటరీ కమీషన్ సలీం గ్రూప్‌ను కోరింది. అయితే ఐదు సంవత్సరాలు గడిచినా ఇంకా అది జరగలేదు. తోటల పెంపకాన్ని నియంత్రించే సలీమ్ గ్రూప్, దాని అనుబంధ సంస్థ దీనిపై మాట్లాడటానికి నిరాకరించింది.

వాగ్దానాలను నెరవేర్చడంలో వైఫల్యం గురించి కమ్యూనిటీలు ఫిర్యాదు చేసినప్పుడు, ప్రభుత్వం ఎక్కువగా మధ్యవర్తిత్వంపై ఆధారపడుతుంది. అయితే ఇలాంటి మధ్యవర్తిత్వపు చర్చల్లో కేవలం 14% మాత్రమే ఫలితాలనిస్తాయని ఒక విద్యాసంబంధ అధ్యయనం కనుగొంది.

ఇండోనేషియాలోని అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తి చేసే ప్రావిన్స్ 'రియావు’లోని ప్లాంటేషన్ ఆఫీస్ అధిపతి సంసుల్ కమర్, తాను ప్లాస్మా గురించి దాదాపు ప్రతివారం ఒక కొత్త ఫిర్యాదు చేస్తున్నానని, తన పర్యవేక్షణలో ఉన్న 77 కంపెనీలలో కొన్ని మాత్రమే వీటిని పట్టించుకుంటాయని చెప్పారు.

అయితే, తన అనుచరుల మాదిరిగానే ఆయన కూడా కేవలం హెచ్చరికలు చేయడం కంటే ఏమీ చేయలేకపోయారు.

ఈ తరహా దోపిడిని అరికడతామని కొన్ని సంస్థలు ప్రకటనలు చేశాయి.

గత ఆరు సంవత్సరాలుగా కమ్యూనిటీలకు ప్లాస్మాను ఇవ్వడంలో, లేదా ప్లాస్మా నుంచి కలిగే ప్రయోజనాలను అందించడంలో విఫలమైన 13 ప్రధాన సంస్థలను మేం గుర్తించాం. అందులో కోల్‌గేట్-పామోలివ్, రెకిట్‌ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి.

జాన్సన్ & జాన్సన్, కెల్లాగ్స్ కంపెనీలు రెండూ సలీమ్ గ్రూప్ నుండి పామాయిల్ ను కొనుగోలు చేస్తాయి.

సలీమ్ కంపెనీకి ఒరాంగ్ రింబా భూమిలో తోటలను నిర్వహిస్తోంది. మా పరిశోధనపై స్పందించిన పలు కంపెనీలు తమ సరఫరాదారులను చట్టానికి లోబడి ఉండాలని నొక్కి చెప్పాయి.

అయితే ప్లాస్మా నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఇండోనేషియా ప్రభుత్వ అధికారులతో పాటు, ప్రజల నుంచి నిషేధాలు ఎదుర్కొన్న అనేక కంపెనీలకు ఇంకా సరఫరా జరుగుతూనే ఉందని మేం గుర్తించాం.

జాన్సన్ అండ్ జాన్సన్, కెల్లాగ్స్, మోండెల్జ్ లు బోర్నియోలోని ఒక తోట నుంచి పామాయిల్‌ను సేకరిస్తాయి. దశాబ్దానికి పైగా చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైనందుకు ఫిబ్రవరిలో దీనిని తాత్కాలికంగా మూసివేశారు.

ప్లాస్మా కేసులో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి అరుదైన ఉదాహరణగా, రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు జయ సమయ మోనోంగ్ తోటల నుండి బయలుదేరే ట్రక్కులను ఆపడానికి పోలీసులను మోహరించారు.

"వారికి ఏదైనా గట్టి చర్య లేకపోతే వాళ్లు దాన్ని పట్టించుకోరు’’ అని జయ సమయ మోనోంగ్ అన్నారు.

తమపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని జాన్సన్ అండ్ జాన్సన్ చెప్పగా, ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని కెల్లాగ్స్ వెల్లడించింది. క్యాడ్‌బరీస్‌తో లింక్ ఉన్న మోండెల్జ్ సంస్థ, సమస్యను పరిష్కరించడానికి నిపుణులను సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది.

వ్యవస్థలోని లోపాల వల్ల ఇవి జరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ వాటాదారులతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని సంస్థ తెలిపింది.

తాము, తమ సరఫరాదారులు ప్లాస్మా అందించడంలో తగినంత అందిస్తున్నారని కాల్గేట్ పామోలివ్ తెలిపింది. ఫిర్యాదులను పరిశీలించడానికి ఒక ప్రక్రియను డెవలప్ చేస్తామని వెల్లడించింది.

ఇండోనేషియా నుండి పామాయిల్ గ్లోబల్ షిప్‌మెంట్‌లు సోమవారం నుండి తిరిగి ప్రారంభమయ్యాయి.

ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్‌పై గ్లోబల్ ఎక్స్ పోర్టులపై నిషేధాన్ని ఎత్తివేసింది.పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించడానికి, స్థానిక సరఫరాను సురక్షితంగా ఉంచే ప్రయత్నంలో ఇది గత నెల చివర్లో ఎగుమతులను నిషేధించింది.

గ్లోబల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో దేశంలోని పామాయిల్ బూమ్ వెనుక ఉన్న కంపెనీలకు ఈ సంవత్సరం లాభాలు పెరిగాయి. ఇండోనేషియాలో పామాయిల్ సరఫరా చేసే కంపెనీల అధిపతులు బిలియనీర్లుగా ఎదిగారు.

గోల్డెన్ అగ్రి-రిసోర్సెస్‌ను నియంత్రించే విడ్జాజా కుటుంబం, ఇండోనేషియా ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సలీం గ్రూప్‌ సీఈవో ఆంథోని సలీం మూడో స్థానంలో నిలిచారు.

కానీ, ఒరాంగ్ రింబా తెగ మాత్రం అదృష్టం కోసం ఎదురుచూస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Palm oil companies are looting the tribal people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X