వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొమినిక్ ఒంగ్వెన్: కిడ్నాప్‌కు గురైన పిల్లాడు ఆ కిడ్నాపర్ల ముఠాకే కమాండర్‌గా ఎలా మారాడంటే..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
డొమినిక్ ఒంగ్వెన్

'వైట్ యాంట్' అనే పేరున్న యుద్ధ నేరాల్లో దోషి, డొమినిక్ ఒంగ్వెన్‌ను, తను 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్నప్పుడు లార్డ్స్ రెసిస్టెన్స్ ఆర్మీ(ఎల్ఆర్ఏ) అపహరించిందని భావిస్తున్నారు.

ఉత్తర ఉగాండాలో స్కూలుకు నడిచి వెళ్తున్నప్పుడు ఒంగ్వెన్‌ను ఎత్తుకెళ్లారు. తర్వాత 27 ఏళ్లకు అతడు ఒక క్రూరమైన రెబెల్ కమాండర్‌గా మారాడు.

హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని వివరణలు కొంతమందిని బాధ కలిగించవచ్చు.

తప్పనిసరి పరిస్థితుల్లో ఎల్ఆర్ఏలోని అణచివేతదారుల నీడలో పెరిగిన చాలామంది పిల్లల్లాగే ఇది ఒక పిల్లాడి కథ అని ఎల్ఆర్ఏలో అరాచకాలను గుర్తించిన ఒక బృందం చెప్పింది.

"1987 లేదా 88లో ఒంగ్వెన్ తనను అపహరించిన కొన్నిరోజులకే మరో ముగ్గురితో కలిసి తప్పించుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో, వాళ్లను భయపెట్టడానికి ఎల్ఆర్ఏ తాము మళ్లీ పట్టుకున్న పిల్లల్లో ఒకరికి బతికున్నప్పుడే చర్మం ఒలిచింది" అని ఒంగ్వెన్‌ను హేగ్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించినపుడు ఒక సైకియాట్రిస్ట్ చెప్పారు.

"వాళ్లు ఆ పిల్లాడి చర్మం ఒలిచారు, పేగులు బయటు తీశారు. శరీరాన్ని చెట్టుకు వేలాడదీశారు. దాంతో, ఒంగ్వెన్ రెండు మూడు నెలలు మాంసం తినలేకపోయాడు" అని డికెన్స్ అకేనా కోర్టుకు తెలిపారు.

"అదే సమయంలో ఒంగ్వెన్ 'వైట్ యాంట్' అనే పేరుతో రెబల్ ర్యాంకింగ్స్‌లో వేగంగా పైకి ఎదిగాడు. ఎల్ఆర్ఏ నాయకుడు జోసెఫ్ కోనీ విశ్వాసం గెలుచుకున్న ఆయన 20 ఏళ్ల వయసులోనే బ్రిగేడియర్ అయ్యాడు" అని ఎల్ఆర్ఏ గురించి తెలిసిన మరో వ్యక్తి చెప్పారు.

కానీ, ఎల్ఆర్ఏ కమాండర్‌తో అతడికి మంచి సంబంధాలు ఉండేవి కావు. దీంతో, 2015లో అతడి పట్టు నుంచి తప్పించుకున్న ఒంగ్వెన్ లొంగిపోయాడు. పదేళ్ల తర్వాత ఆయనపై, కోనీ, మరో ముగ్గురు సీనియర్ కమాండర్ల మీద ఐసీసీ అభియోగాలు మోపింది.

ఒంగ్వెన్ ఇప్పుడు 2002 జులై నుంచి 2005 డిసెంబర్ వరకూ జరిగిన నేరాలు, యుద్ధ నేరాలు.. మొత్తం 70 ఆరోపణల్లో 61 నేరాల్లో దోషిగా తేలాడు.

ఆయన నేరాల్లో రెబల్స్ తరిమికొట్టడంతో నిరాశ్రయులైనవారి కోసం భద్రతా దళాలు ఏర్పాటు చేసిన నాలుగు శిబిరాలపై జరిగిన దాడులు కూడా ఉన్నాయి. ఒంగ్వెన్ మీద లైంగిక బానిసత్వానికి సంబంధించిన కేసులు, 15 ఏళ్ల లోపు పిల్లలను బంధించి ఘర్షణల్లో ఉపయోగించడం లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.

బైబిలికల్ రాజ్యం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకున్న ఎల్ఆర్ఏ లక్షమందికి పైగా ప్రజలను చంపింది. మూడు దశాబ్దాలపాటు ఉగాండా, దాని పొరుగు దేశాల్లో కూడా వ్యాపించిన ఈ ఘర్షణల్లో 60 వేల మందికి పైగా పిల్లలను అపహరించారు.

నేరాలను అంగీకరించని ఒంగ్వెన్, తనను బాధితుడుగా కూడా పరిగణించాలని కోర్టును కోరాడు. ఎల్ఆర్ఏ దురాగతాలకు బలైన వారిలో తను కూడా ఒకడినని చెప్పాడు.

విన్సెంట్ ఒట్టి

డాన్స్ అంటే ఇష్టం

కోర్టుకు సాక్షిగా హాజరైన ఒంగ్వెన్ మామయ్య, అతడు చిన్నతనంలో చాలా సరదాగా ఉండేవాడని చెప్పారు.

ఒంగ్వెన్‌ అపహరణకు గురైన నెలకే తన అమ్మనాన్నలు చనిపోయారు. ఆయన తల్లిని తిరుగుబాటుదారులే కొట్టి చంపేశారని, తండ్రిని తిరుగుబాటుదారుడని పొరపడిన భద్రతాదళాలు కాల్చిచంపాయని ఆరోపణలు ఉన్నాయి.

ఒంగ్వెన్ చిన్నతనంలో డాన్స్ క్లాసులు, మిగతా కళలను ఆస్వాదించేవాడని ఆయన ప్రైమరీ స్కూల్ టీచర్ పట్వోగా ఒకెల్లో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

"ఎల్ఆర్ఏలో ఉన్నప్పుడు విన్సెంట్ ఒట్టి అతడికి టీచర్‌గా ఉన్నాడు. ఒట్టి తర్వాత కోనీ డిప్యూటీ అయ్యాడు. అపహరించిన తర్వాత ఒంగ్వెన్ ఆయన దగ్గరే ఉన్నాడు. మిలిటరీ శిక్షణ, దోపిడీలతోపాటూ క్రూరంగా కొట్టడం, కఠిన ఆచారాల ద్వారా ఒక మంచి టీచర్ తన బంధీలను అత్యంత విశ్వాస పాత్రులుగా మార్చగలడు" అని విద్యావేత్త ఎరిక్ కె బైన్స్ చెప్పారు.

"ఒంగ్వెన్ వారిని సంతృప్తిపరచడానికి తపించేవాడు. కానీ, ఆ దారిలో ఆయన మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కున్నారు. సుదూర ప్రాంతాలు నడిచే వెళ్లేవాడు. పెద్ద పెద్ద నదులను కూడా దాటేవాడు" అని ఒక సాక్షి ఐసీసీకి చెప్పాడు.

1990 మధ్యలో ఒంగ్వెన్ ఇప్పటి దక్షిణ సూడాన్‌కు వెళ్లిపోయారు. అక్కడ నుంచి ఎల్ఆర్ఏ ఆపరేషన్లు జరిగేవి. 2001 నాటికి ఆయన ఫీల్డ్ కమాండర్ అయ్యారు. ఉగాండాలో అపహరణ దాడులతో ఆయన దళాలను తిరిగి భర్తీచేసేవారు అని బైన్స్ చెప్పారు.

ఒంగ్వెన్ తన దళాలతో వెళ్లినపుడు పెద్దగా ప్రాణనష్టం జరగకుండానే భయంకరమైన యుద్ధాల నుంచి బయటపడేవాడని ఎనఫ్ ప్రాజెక్ట్ అనే మరో బృందం చెప్పింది.

డొమినిక్ ఒంగ్వెన్ గురించి క్లుప్తంగా...

  • స్కూలుకు వెళ్తున్నప్పుడు ఎల్ఆర్ఏ అపహరించింది.
  • తక్కువ సమయంలోనే టాప్ కమాండర్ స్థాయికి ఎదిగాడు.
  • బానిసత్వం సహా ఎన్నో నేరాలు, యుద్ధ నేరాల్లో దోషిగా తేలాడు.
  • అతడిపై ఐసీసీ 2005లో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
  • 2013లో అమెరికా అతడి సమాచారం ఇచ్చినవారికి 5 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించంది.
  • లొంగిపోయాక 2015లో అతడి కేసు ఐసీసీకి బదిలీ అయ్యింది. 2021లో దోషిగా తేలాడు.

ఒంగ్వెన్ తన కాలికి తీవ్ర గాయమై కుంటుతున్నప్పటికీ, ఎప్పుడూ నడుస్తూనే ఉండే ఒక దృఢమైన ఫైటర్ అని అంతకు ముందు అపహరణకు గురైన ఒక వ్యక్తి చెప్పాడు.

ప్రాసిక్యూషన్ విచారణ సమయంలో ఉగాండా సెక్యూరిటీ ఏజెన్సీలు సేకరించిన ఎల్ఆర్ఏ రేడియో కమ్యూనికేషన్లు సమర్పించింది.

వాటి ద్వారా కమాండర్ కోనీ తాము అపహరించిన పిల్లలను మా 'ఆత్మలు' మీ మనసులను కూడా చదవగలవని చెప్పి వారితో పనులు చేయించేవాడని, బెటాలియన్లను గుప్పిట్లో ఉంచుకునేవాడని లిసింది.

ఘర్షణల్లో తగలబడిన గ్రామం

"విజయాలు సాధించే కమాండర్లను కోనీ, మిగతా సీనియర్ అధికారులు ప్రశంసించేవారు. తరచూ ఆ పొగడ్తలు ఒడోమీ అని పిలిచే ఒంగ్వెన్ ఒక్కడికే దక్కేవి" అని తన పేరు బయటపెట్టని ఒక రేడియో సర్వేలెన్స్ ఆఫీసర్ చెప్పాడు.

కానీ, శాంతి చర్చల మధ్యలో ఇద్దరూ బయటికి వచ్చేసిన తర్వాత, 2007లో ఒట్టికి వేసిన మరణశిక్షను ఒంగ్వెన్ వ్యతిరేకించడంతో అతడికి, కోనీకి మధ్య సంభందాలు చెడిపోయాయి.

ఒట్టిని ప్రాణాలతో వదిలేయాలని కోనీని అడిగిన కమాండర్ ఒంగ్వెన్ ఒక్కడేనని ఎల్ఆర్ఏ ఫిరాయింపుదారులు చెప్పారు.

అలా డిమాండ్ చేయడం వల్ల ఎల్ఆర్ఏలో ఒంగ్వెన్ ప్రభావం బలహీనపడిందని ఎల్ఆర్ఏ క్రైసిస్ గమనించిన వారు చెప్పారు.

అయితే, ఒంగ్వెన్‌కు ఎల్ఆర్ఏలో ఉన్న విలువ, ముఖ్యంగా ధైర్యంగా పోరాడే ఆయన సామర్థ్యం గమనించిన కోనీ, ఒట్టి తర్వాత అతడి విధేయులను తుడిచిపెట్టిన సమయంలో ఒంగ్వెన్‌ను మాత్రం విడిచిపెట్టాడు.

ఎల్ఆర్ఏ నేత జోసెఫ్ కోనీ

ఇప్పుడు దక్షిణ సూడాన్‌గా ఉన్న డెమాక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుల్లో అడవుల్లో శాంతి చర్చలు జరిగాయి. మధ్యవర్తులతో తిరుగుబాటుదారులు చర్చలు జరిపిన ఎన్నో వీడియోలు ఉన్నాయి.

ఒంగ్వెన్ ఆ వీడియోల్లో ఎప్పటిలాగే నుదురు చిట్లించి అమాయకుడిలా జరుగుతున్నవి జాగ్రత్తగా గమనిస్తుంటారు.

2005లో ఐసీసీ తన నేరారోపణలు ఉపసంహరించుకోడానికి నిరాకరించడంతో ఆ చర్చలు చివరకు విఫలమైనట్లు పరిశీలకులు చెప్పారు.

ఒంగ్వెన్ భార్య ఫ్లోరెన్స్ అయోట్ సహా కొంతమంది అతడిపై ఆరోపణలు మోపడం అన్యాయం అంటున్నారు.

"చాలా చిన్నప్పుడే తనను అపహరించారని డొమినిక్ మాకు ఎప్పుడూ చెబుతుండేవాడు. తను అన్నీ కోనీ కోసమే చేశాడు. అందుకే తను అమాయకుడు" అని ఆమె 2008లోబీబీసీకి చెప్పారు.

2005లో ఎల్ఆర్ఏ నుంచి తప్పించుకుని, తర్వాత క్షమాభిక్ష పొందిన ఆమె 9 ఏళ్ల వయసులో అపహరణకు గురైంది. మొదట ఫ్లోరెన్స్ ఎల్ఆర్ఏ కమాండర్ ఒబ్వాంగ్ కిజురాకు భార్య అయ్యారు. ఎల్ఆర్ఏలో ఆమె 13 ఏళ్ల వయసులో అత్యాచారానికి గురయ్యారు.

ఎల్ఆర్‌ఏ నేతలు మహిళలు సొంతంగా జీవించడానికి ఒప్పుకునేవారు కాదు. అందుకే, భర్త చనిపోయాక తను స్వయంగా ఒంగ్వెన్ భార్య కావాలనుకున్నట్లు ఆమె చెప్పారు.

ఒంగ్వెన్ తన కొడుకును కూడా తన సొంత బిడ్డల్లాగే చూసుకునేవాడని, ఆ సమయంలో అతడి మిగతా ముగ్గురు భార్యలు తమతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదని, వాళ్లతో అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె చెప్పారు.

"తను జనాలతో ప్రవర్తించే పద్ధతి నచ్చడంతో నేను అతడిని ప్రేమించాను. ఒంగ్వెన్ గొడవపడే రకం కాదు. తన దగ్గర ఉండడం మంచిదేనని నాకు అనిపించింది. నేను అతడిని ఇష్టపడకపోవడానికి ఎలాంటి కారణం లేదు. ఎందుకంటే అంతకు ముందు తను ఏ తప్పూ చేసినట్లు నాకు కనిపించలేదు. మేం కలిసి సంతోషంగా జీవించాం" అన్నారు.

తుపాకీ చూపించి అత్యాచారం

విచారణలో మరో ఏడుగురు ఇచ్చిన వాంగ్మూలాలతో ఆమె చెప్పింది తేలిపోయింది. మరో సాక్షి పి-227తోపాటూ, ఒంగ్వెన్ భార్యల్లో మరొకరిని 2005లో అపహరించారు. నెల తర్వాత సెక్స్‌కు ఒంగ్వెన్ తనను బలవంతం చేశారని ఆమె ఆరోపించారు.

"నేను ఏడ్చాను, గట్టిగా అరిచాను.. ఎందుకు ఏడుస్తున్నావని తను నన్ను అడిగాడు. నేను ఏడుస్తూనే ఉన్నా. తను నాకు తుపాకీ చూపించాడు. నాకు మొత్తం శరీరం చీల్చేస్తున్నట్టు అనిపించింది. 2010లో నేను అక్కడ్నుంచి తప్పించుకునేవరకూ నాపై పదే పదే అత్యాచారం చేశాడు" ఆమె చెప్పారు.

"అక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడం కూడా చాలా ప్రమాదకరంగా ఉండేది. అలా చేస్తే మీ ఊరు మొత్తం నాశనం చేస్తామని ఎల్ఆర్ఏ బెదిరించేవారు" అని అయోట్ చెప్పారు.

2003లో ఒంగ్వెన్, ఆమె పారిపోవాలని ప్లాన్ వేశారు. కానీ అది వాళ్లకు తెలిసిపోయింది. దాంతో అతడిని ఒట్టి కొన్నేళ్లపాటు బంధించి ఉంచాడని చెప్పారు.

భద్రతా దళాల శిబిరాలపై దాడులు జరిగినప్పుడు ఒంగ్వెన్ పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని విచారణ సమయంలో కొంతమంది సైకియాట్రిస్టులు అభిప్రాయపడ్డారు.

ప్రాసిక్యూషన్ మాత్రం సినియా బ్రిగేడ్‌లో బెటాలియన్‌కు ఒక కమాండర్‌గా ఉన్న ఆయన, 2004లో మొత్తానికీ కమాండర్ అయ్యాడని చెప్పింది.

సాక్ష్యుల వాంగ్మూలాలను బట్టి అతడు కనీసం ఒక సందర్భంలో అయినా "మనుషులను చంపాలని, శవాలను ఉడికించాలని, తినాలని" ఆదేశించాడని ఐసీసీ ప్రాసిక్యూటర్స్ వాదించారు.

ఈ విచారణలో రెండు లీగల్ టీమ్స్ నుంచి మొత్తం 4 వేల మందికి పైగా బాధితులు హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది అంతకు ముందు శిబిరాల్లో ఉన్నవారే. విచారణలో ఉత్తర ఉగాండాలోని వారికి జరిగిన ప్రాణనష్టం, విధ్వంసం, అపహరణలు, మానసిక నష్టం గురించి వివరించారు.

2016లో ఐసీసీ విచారణను టీవీలో చూస్తున్న ప్రజలు

కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడాలని బెదిరింపులు

2005లో ఒంగ్వెన్ హత్యకు గురైనట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిసింది. తిరుగుబాటుదారులు పశ్చిమంగా డీఆర్ కాంగో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్లడంతో ఆయన చాలా ఏళ్లపాటు పరారీలోనే ఉన్నాడు.

అమెరికా 2013లో ఎల్ఆర్ఏ కమాండర్లను పట్టుకోడానికి రంగంలోకి దిగింది. ఒంగ్వెన్‌ను పట్టుకోడానికి తగిన సమాచారం ఇచ్చినవారికి 5 మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది.

2014 చివర్లో తనకు ఎదురుతిరిగిన ఒంగ్వెన్‌ను తీవ్రంగా కొట్టాలని కోనీ ఆదేశించారని ఎల్ఆర్ఏ నుంచి తప్పించుకున్న ఒక వ్యక్తి చెప్పారు.

దారుణమైన పరిస్థితిలో ఆయన చివరికి డర్ఫూర్ ఎల్ఆర్ఏ క్యాంప్ నుంచి తప్పించుకున్నారు. సూడాన్ నుంచి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్(సీఏఆర్)కు పారిపోయారు. అక్కడ అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ సమయంలో ఉగాండా ప్రజలు తనను క్షమించాలని ఆయన అడిగారు. కానీ, తర్వాత పది రోజుల్లోనే ఆయన కేసును ఐసీసీకి బదిలీ చేశారు.

జస్టిస్‌ఇన్‌ఫో డాట్ నెట్ వివరాల ప్రకారం విచారణకు ముందు చదువుకోడానికి వచ్చిన అవకాశాన్ని ఆయన ఆస్వాదించాడు. ఆ సమయంలో పియానో పాఠాలు కూడా నేర్చుకున్నారు.

2016లో కుటుంబంతో ఫోన్లో మాట్లాడనివ్వకపోతే, ఆత్మహత్య చేసుకుంటానని, నిరాహారదీక్ష చేస్తానని ఒంగ్వెన్ బెదిరించారు. అయినా తన పిల్లలను కలవకుండా ఆయన్ను అడ్డుకున్నారు.

ఈ విచారణ పరోక్షంగా కోనీకి శిక్షలాంటిదేనని కొందరు వాదిస్తున్నారు. కోనీ ప్రారంభించిన ఉద్యమం ప్రస్తుతానికి బలహీనపడినా, ఉగాండా అవతల అది ప్రభావవంతంగానే ఉంది.

ఈ విచారణలో ఒంగ్వెన్ రెండు వర్షన్లు బయటికొచ్చాయి. ఒకటి ఆయన ఒక క్రూర హంతకుడు అని, ఇంకొకటి ఆయన వివాదాస్పద వ్యక్తిగా ఎదిగిన గాయపడిన ఒక బాల సైనికుడుగా చెప్పాయి.

ఆయన కంటే ముందు వేల మంది ఫైటర్లకు ఇచ్చినట్లే, ఒంగ్వెన్‌కు క్షమాభిక్ష పెట్టాలని, స్థానిక అచోలీ నేతల కోసం ఆయన్ను ఇంటికి పంపించాలని డిఫెన్స్ లాయర్లు వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Dominic Ongwen: How a kidnapped child became the commander of a gang of kidnappers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X