ఇరాన్‌కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్.. 3 రోజుల్లో తేల్చకపోతే బాంబులే!
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్, అమెరికా దేశాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటోందా లేదా మహా యుద్ధానికి దారితీస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఇరాన్ ఓ కొత్త ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యా పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 3 రోజుల అల్టిమేటం జారీ చేశారు.
హోర్ముజ్ జలసంధిని తెరవండి.. ఇరాన్ ఆఫర్
యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్ రెండు దశల ప్రణాళికను వైట్ హౌస్‌కు పంపింది. మొదటి దశలో అమెరికా నౌకాదళం హోర్ముజ్ జలసంధి వద్ద విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని ఇరాన్ కోరింది. ఒకసారి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక, రెండో దశలో అణు ఒప్పందం, ఇతర భద్రతా అంశాలపై చర్చలు జరుపుతామని ఇరాన్ స్పష్టం చేసింది. భద్రతకు గ్యారెంటీ, నష్టపరిహారం, కొత్త చట్టపరమైన ఒప్పందం ఉంటేనే చర్చలు సాధ్యమని ఇరాన్ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది.

ట్రంప్ ఆగ్రహం.. 3 రోజుల అల్టిమేటం
ఇరాన్ ప్రతిపాదనలను పక్కన పెట్టిన ట్రంప్, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రష్యా పర్యటనపై మండిపడ్డారు. ఇరాన్ ఒకవైపు చర్చలంటూనే, మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చేతులు కలపడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. వచ్చే 3 రోజుల్లోగా అమెరికా షరతులకు లోబడి శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే, ఇరాన్‌లోని ఆయిల్ ప్లాంట్లను, పైప్‌లైన్ వ్యవస్థను పేల్చివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. "ఒకవేళ పైప్లైన్లు ధ్వంసమైతే, ఇరాన్ చుక్క చమురు కూడా ఎగుమతి చేయలేదు.. ఆ దేశం కోలుకోలేని దెబ్బ తింటుంది" అని ఆయన అల్టిమేటం ఇచ్చారు.
ఇరాన్‌కు ట్రంప్ ఆప్షన్
రెండో విడత శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఓ ఆప్షన్ ఇచ్చారు. ఇరాన్‌కు నిజంగా శాంతి కావాలంటే నేరుగా తనకు ఫోన్ చేయాలని, కానీ ఏ పరిస్థితుల్లోనూ ఆ దేశాన్ని అణు ఆయుధాలు తయారు చేయనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ మొండి వైఖరి కారణంగానే అమెరికా తన ప్రతినిధి బృంద పర్యటనను రద్దు చేసుకుందని.. దీనికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్ హెచ్చరికపై స్పందించిన ఇరాన్
మూడు రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చమురు పైప్లైన్లను పేల్చేస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంపై ఇరాన్ స్పందించింది. చమురు క్షేత్రాలతో పాటు తమ మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడితే.. అమెరికాకు మద్దతిచ్చే దేశాల్లో దానికి 4 రెట్లు ఎక్కువగా విధ్వంసానికి పాల్పడతామని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ హెచ్చరించారు. శత్రువులు ఇరాన్ కు చెందిన ఒక్క చమురు బావిపై దాడి చేస్తే.. తాము 4 చమురు బావులపై దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులను ధ్వంసం చేస్తామని వెల్లడించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి మెరుపు పర్యటనలు
అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ 24 గంటల్లో పాకిస్థాన్, ఒమన్ దేశాల్లో పర్యటించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో చర్చలు జరిపిన అనంతరం ఆయన నేరుగా రష్యాకు చేరుకున్నారు. సోమవారం ఆయన పుతిన్‌తో భేటీ కానున్నారు. రష్యాతో ఇరాన్ జరుపుతున్న ఈ చర్చలు అమెరికాకు కంటగింపుగా మారాయి.












Click it and Unblock the Notifications