బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్- అమెరికా గడప తొక్కకుండా చర్యలు
US Travel ban: అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వివిధ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు.. మరి కొన్నింటిపై ఆంక్షలను ప్రకటించారు. ఈ నిషేధాన్ని ఎదుర్కొంటోన్న దేశాల ప్రజలు ఇక అమెరికాలో అడుగు పెట్టలేరు. ఆంక్షలు విధించిన దేశాలకు నామమాత్రంగా విసాలను జారీ చేస్తుంది అమెరికా.
దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి కిందటే సంతకం చేశారు. ఈ ఆర్డర్ జారీ చేయడానికి గల కారణాలను వివరించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

అమెరికా నిషేధాన్ని ఎదుర్కొంటోన్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఛద్, కాంగో, ఈక్వెటోరియల్ గుయానా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సొమాలియా, సూడాన్, యెమెన్ ఉన్నాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ కూడా ఆయా దేశాల ప్రజలు అమెరికాకు వెళ్లలేరు.
బురుండీ, క్యూబా, లావోస్, సియెర్రా లియెన్, టోగో, తుర్క్ మెనిస్తాన్, వెనిజులపై తీవ్ర ఆంక్షలు విధించారు. డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో ఈ దేశాలకు నామమాత్రంగా విసాలను జారీ చేస్తుంది అమెరికా. ఈ దిశగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి.
ఇటీవలే కొలరాడోలోని బౌల్డర్ లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వైట్ హౌస్ వెల్లడించింది. కొన్ని దేశాల పౌరుల నుంచి ప్రజలు, దేశ భద్రతకు పెను ముప్పు ఉందని ట్రంప్ భావిస్తోన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
అమెరికాను మరో యూరప్ లా మార్చదలచుకోలేదని తేల్చి చెప్పింది. రాజకీయ అనిశ్చితి, ఉగ్రవాద/అసాంఘిక కార్యకలాపాలు, సంఘ విద్రోహ శక్తుల వల్ల ప్రమాదాన్ని ఎదుర్కొంటోన్నాయో.. ఆయా దేశాల ప్రజలకు జారీ చేసే విసాలు, అమలులో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయాలని ట్రంప్ ఆదేశించినట్లు వైట్ హౌస్ వివరించింది.












Click it and Unblock the Notifications