రేపు రావాలని మోడీకి ట్రంప్ ఆహ్వానం..! వెళ్లడంపై ఉత్కంఠ..!
భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసీ నుంచి ఓ కీలక ఆహ్వానం అందింది. అయితే అది చివరి నిమిషంలో అందింది. ఈజిప్ట్ లో తాము నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని మోడీని వీరిద్దరూ కోరారు. దీంతో ఈ విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేక ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఇవాళ రాత్రి కల్లా మోడీ దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత రెండేళ్లుగా భీకర యుద్దం సాగుతోంది. ఇందులో భాగంగా పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేసి భారీ విధ్వంసం చేసింది. ఇందులో దాదాపు 50 వేల మంది ప్రాణాలు కూడా తీసింది. గాజాకు మంచినీరు, ఆహారం, విద్యుత్, నిత్యావసరాలు ఏవీ అందకుండా అడ్డుకుంది. అయినా హమాస్ వద్ద ఉన్న తమ 250 మంది బందీల్ని మాత్రం ఇజ్రాయెల్ విడిపించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్-హమాస్ ను శాంతి ఒప్పందానికి ఒప్పించారు. దీంతో కాల్పుల విరమణ జరిగింది.

ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ఈజిప్ట్ ముందుకొచ్చింది. రేపు ఈజిప్ట్ లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో శాంతి సదస్సు నిర్వహించబోతున్నారు. గాజాలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు మరో 20కి పైగా దేశాధినేతలు హాజరవుతున్నారు. ఈ సదస్సుకు రావాలని భారత ప్రధాని మోడీకి కూడా ఆహ్వానం పంపారు.

ట్రంప్ తో పాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసీ నేతృత్వంలో రేపు మధ్యాహ్నం షర్మ్ ఎల్ షేక్ లో ఈ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు మోడీ హాజరైతే ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశాలు కూడా లభిస్తాయి.అలాగే మధ్యప్రాచ్యంలో భారత్ ఉనికిని ప్రదర్శించడానికి, పాలస్తీనా లక్ష్యం పట్ల మంచి సంకేతం ఇవ్వడానికి, శాంతి సందేశం ఇవ్వడానికి , ఈజిప్ట్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు ప్రోత్సాహాన్ని అందించడానికి కూడా మోడీకి ఇది మంచి అవకాశం కానుంది. కాబట్టి చివరి నిమిషంలో ఆహ్వానం అందినా మోడీ దీనికి హాజరయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications