వణుకుతున్న భారత ఉపఖండం: తాజాగా పాకిస్తాన్‌లో..
ఇస్లామాబాద్: భారత ఉపఖండాన్ని వరుస భూకంపాలు వదలట్లేదు. రోజు విడిచి రోజు అన్నట్లుగా ఈ రీజియన్‌లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తూ వస్తోన్నాయి. వాటి తీవత్ర కూడా ఆందోళనకర స్థాయిలో ఉంటోంది. మరణాలు సైతం సంభవిస్తోన్నాయి. ప్రాణ, ఆస్తినష్టాలు నమోదవుతున్నాయి.
భారత్, నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లల్లో తరచూ భూకంపాలు సంభవిస్తూ వస్తోన్నాయి. మొన్నటికి మొన్ని నేపాల్‌ను వణికించింది ఈ విపత్తు. పలువురిని పొట్టనబెట్టుకుంది. ఈ నెల 3వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత నేపాల్‌లో సంభవించిన భూకంపంలో 150 మంది వరకు మరణించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. రెండు జిల్లాలను అతలాకుతలం చేసింది.

అదే సమయంలో ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ (Delhi-NCR) సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లోనూ భూమి ప్రకంపించింది. వేలాది మంది రోడ్లపై చేరుకున్నారు. రోడ్ల మీదే జాగారం చేశారు. ఆ తరువాత కూడా ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో చెప్పుకోదగ్గ స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. అటు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ, ఇటు ఈ విపత్తుతో సహవాసం చేసే పరిస్థితి ఏర్పడింది ఢిల్లీ వాసులకు.
అటు శ్రీలంకలోనూ ఇదే తీవ్రతతో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. దీని తీవత్ర రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. హిందూ మహా సముద్రం, బంగాళాఖాతం మధ్యప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం వల్ల శ్రీలంక, సింగపూర్, మలేసియా ఉలిక్కిపడ్డాయి. సునామీ సంభవించవచ్చనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
తెల్లవారే సరికి పాకిస్తాన్‌ను వణికించింది భూకంపం. ఈ తెల్లవారు జామున పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. దీనివల్ల ఇప్పటివరకు ఎలాంటి నష్టం సంభవించిందనేది ఇంకా తెలియరాలేదు. నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండో భూకంపం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భూకంప తీవ్రత నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌కు ఈశాన్య దిక్కున.. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు సెస్మాలజీ సెంటర్ తెలిపింది.












Click it and Unblock the Notifications